బెజవాడలో బుగ్గ కొరికాడని భర్తపై కేసు పెట్టి భార్య

Wed Aug 10 2022 23:00:01 GMT+0530 (India Standard Time)

Wife files case against husband in Bejwada

బెజవాడ పోలీసులకు వచ్చిన ఒక ఫిర్యాదు ఆసక్తికరంగా మారింది. అందరిని ఆకర్షిస్తోంది. భార్యభర్తలు అన్న తర్వాత సవాలచ్చ ఉంటాయి. కొన్నిసార్లు అలకలు.. చికాకులు.. అంతలోనే సర్దుకు పోవటం.. ఆ వెంటనే గిల్లికజ్జాలు పెట్టుకోవటం లాంటివి కనిపిస్తుంటాయి. ఇవన్నీ నాలుగు గోడల మధ్య ఉన్నంతవరకు ఓకే. ఒకసారి ఇల్లు దాటి బయటకు వస్తే.. ఆ లెక్కలు మొత్తం మారిపోతాయి. తాజాగా బెజవాడలో అలాంటి సీన్ ఒకటి బయటకు వచ్చింది.పోలీసులకు భర్త మీద భార్య ఫిర్యాదు చేస్తే.. అదనపు కట్నం తీసుకురమ్మని ఒత్తిడి చేస్తున్నాడనో.. మద్యం తాగి వచ్చి ఇష్టారాజ్యంగా కొడుతున్నాడనో.. అనుమానంతో అవమానానికి గురి చేస్తే మానసిక. .శారీరక హింసకు పాల్పడుతున్నాడనో లాంటి ఫిర్యాదు వస్తాయి.

కానీ.. ఈ ఉదంతంలో మాత్రం భర్త తన బుగ్గ కొరికాడంటూ భార్య భర్త మీద కంప్లైంట్ చేయటం.. బెజవాడ పోలీసులు కేసు నమోదు చేయటం జరిగిపోయాయి. ఇంతకీ బుగ్గ కొరికితేనే కేసు పెట్టేయటమా? అని అనుకుంటే తప్పులో కాలేసినట్లే. దాని వెనుక చాలానే విషయాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఆ కేసు వివరాల్లోకి వెళితే.

క్రిష్ణా జిల్లాలోని కానూరుకు చెందిన తాళ్లపూడి రాంబాబు.. స్రవంతిలు భార్యభర్తలు. భర్త సెక్యురిటీ గార్డుగా పని చేస్తుంటే.. భార్య ఇంటి వద్దే ఉండేది. రాంబాబుకు మద్యం తాగే అలవాటు ఉంది. ఈ క్రమంలో తాజాగా బాగా తాగి ఇంటికి వచ్చాడు. మత్తులో భార్యతో గొడవ పెట్టుకున్నాడు. అప్పటికే భర్తపై విసిగిపోయిన ఆమె గొడవలు వద్దంటూ గట్టిగా మందలించింది.

దీంతో ఆవేశంతో ఊగిపోయిన రాంబాబు.. ఆమెను కొట్టి.. అక్కడితో ఆగకుండా ఆమె బుగ్గ మీద కొరికేశాడు. ఈ నేపథ్యంలో భర్త నుంచి తప్పించుకున్న ఆమె ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకుంది.

అనంతరం పోలీసులకు కంప్లైంట్ చేసింది. దీంతో.. భర్త మీద కేసు నమోదు చేసిన పోలీసులు.. భార్య బుగ్గను కొరికినందుకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఇంతకూ సదరు భర్తను పోలీసులు అరెస్టు చేశారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.