మెమొరీ లాస్‌తో రూ.కోట్ల ఆస్తిని అమ్మేసిన వ్యక్తిపై భార్య కేసు!

Fri Aug 12 2022 14:33:34 GMT+0530 (IST)

Wife's case against the Husband

కొన్ని కేసులు విచిత్రంగా ఉంటాయి. బాసూ మెమురీ లాసూ.. బతుకంతా ఖల్లాసే.. లైఫంతా మటాషే అన్నట్టు ఓ భర్త చేసిన పని ఆ భార్యకు కష్టాలు తెచ్చిపెట్టింది. దీంతో ఆ మహిళ తన భర్తపై కోర్టులో కేసు వేసింది.ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని సౌభాగ్య నగర్ కాలనీలో ఐనాల వెంకట రాంప్రసాద్ తన కుటుంబంతో నివసిస్తున్నారు. ఆయన కంప్యూటర్ ఇంజినీరుగా పనిచేసేవారు. రామ్ ప్రసాద్ కు భార్య వాసవి 15 ఏళ్ల కుమార్తె ఉన్నారు. అయితే కొన్నేళ్ల క్రితం రాంప్రసాద్ తీవ్రమైన తలనొప్పితో నిమ్స్ ఆస్పత్రిలో చేరారు. వైద్యులు పరిక్షించి ట్రానిటనీ వెంటిలేటర్ అసోసియేటెడ్ న్యుమోనియాగా గుర్తించి ఆపరేషన్ నిర్వహించారు.

ఆపరేషన్ జరిగాక ఇంటికి తిరిగొచ్చిన తర్వాత రామ్ ప్రసాద్ తన జ్ఞాపకశక్తిని కోల్పోయారు. అప్పటికే రామ్ ప్రసాద్ తల్లిదండ్రులు కూడా మృతి చెందారు. మరోవైపు రామ్ ప్రసాద్ తన ఉద్యోగం కూడా కోల్పోయారు. ఈ క్రమంలో 2017లో ఇంటి నుంచి రామ్ ప్రసాద్ కనిపించకుండా పోయారు. అప్పట్లో ఆయన భార్య పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా వారు వెదికి పట్టుకొని అప్పగించారు.

అప్పటి నుంచి రామ్ ప్రసాద్ ఇంట్లోనే ఉండేలా చూసుకుంటున్నారు. అయితే ఇటీవల మదీనాగూడలోని బీహెచ్‌ఈఎల్-హెచ్‌ఐజీ ఫేజ్ 3లో ఉన్న తమ ఇంటిని ఆయన పద్మ అనే మహిళకు విక్రయించినట్లు భార్య తెలుసుకుంది. దాదాపు రెండు కోట్ల విలువైన ఈ ఆస్తి విక్రయానికి సంబంధించి తన భర్త ఖాతాలో ఎలాంటి డబ్బులు జమ కాలేదని గుర్తించారు.

దస్తావేజుల్లో రూ.50 లక్షలకే విక్రయించినట్లు తెలుసుకున్నారు. తన భర్తకు జ్ఞాపకశక్తి లేదని.. న్యాయం చేయాలంటూ ఆమె కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు బంజారాహిల్స్ పోలీసులు రామ్ ప్రసాద్‌పై మెంటల్ హెల్త్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

విచారణలో రామ్ ప్రసాద్‌కు జ్ఞాపకశక్తి సరిగా లేదని నిరూపితమయితేనే ఆ ఆస్తి విక్రయం చెల్లదు. ఒకవేళ రామ్ ప్రసాద్ జ్ఞాపకశక్తి సరిగానే ఉండి విక్రయించినట్టు తేలితే సదరు రూ.2 కోట్ల ఆస్తి కొనుగోలు చేసిన ఆ మహిళ పరమవుతుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తన భర్తకు మెంటల్ హెల్త్ సరిగా లేదని రామ్ ప్రసాద్ భార్య కోర్టును ఆశ్రయించింది.