Begin typing your search above and press return to search.

కొత్త జిల్లాలపై పవన్ మాట్లాడటం లేదేంటి? ఎందుకిలా?

By:  Tupaki Desk   |   29 Jan 2022 8:30 AM GMT
కొత్త జిల్లాలపై పవన్ మాట్లాడటం లేదేంటి? ఎందుకిలా?
X
కొత్త ఏడాది వస్తూనే ఏపీలో రాజకీయం మరింత వేడెక్కిపోయేలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో అధికారపార్టీ వ్యవహరిస్తున్న తీరు కూడా ఈ రచ్చకు కారణమని చెప్పక తప్పదు. సంక్రాంతి సందర్భంగా గుడివాడలో ఏర్పాటు చేసిన క్యాసినో కారణంగా జరిగిన డ్యామేజ్ అంతా ఇంతా కాదు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించిన కొత్త పీఆర్సీ.. లక్షలాది ఉద్యోగుల్లో ఆగ్రహావేశాలను పెంచేలా చేసింది. ఇలాంటివేళలోనూ అనూహ్యంగా తెర మీదకు వచ్చింది కొత్త జిల్లాల ఏర్పాటు.

నెలల తరబడి ఈ ఇష్యూ మీద చర్చ జరుగుతున్నా స్పందించని ఏపీ సర్కారు.. అనూహ్యంగా రాత్రికి రాత్రి నిర్ణయంతో ఆమోదించటం.. ఆ వెంటనే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయటం తెలిసిందే. కొత్త జిల్లాల ఏర్పాటులో అధికార పార్టీ తెలివిగా వ్యవహరించటమే కాదు.. ప్రధాన ప్రతిపక్షంనోటిని మూయించిన పరిస్థితి. విపక్ష పార్టీ వ్యస్థాపకుడు ఎన్టీఆర్ పేరును ఆయన జన్మించిన క్రిష్ణా జిల్లాకు పెట్టటంతో వారు ఆత్మరక్షణలో పడిన పరిస్థితి. దాదాపు పద్నాలుగున్నరేళ్ల పాటు అధికారంలో ఉన్న తాము తమ పార్టీ వ్యవస్థాపకుడి పేరును జిల్లాకు పెట్టలేకపోవటం.. తమ పార్టీకి బద్ధవిరోధంగా ఉండే వారు మాత్రం ఎన్టీఆర్ పేరు పెట్టేసి.. క్రెడిట్ సొంతం చేసుకోవటంతో తెలుగు తమ్ముళ్లు మింగాలేక కక్కా లేక ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. వచ్చే ఎన్నికల్లో క్రియాశీలకంగా వ్యవహరించి.. అధికారాన్ని సొంతం చేసుకుంటామని చెప్పే జనసేన.. ఇప్పటివరకు ఈ ఇష్యూ మీద మాట్లాడకపోవటం విశేషం. కొత్త జిల్లాల ఏర్పాటు కావొచ్చు.. కొత్త జిల్లాలకు పెట్టిన పేర్లు కావొచ్చు.. ఇలా ఏ అంశం మీదా మాట్లాడటానికి సుముఖత వ్యక్తం చేయటం లేదు. అన్నింటికి మౌనమే సమాధానం అన్నట్లుగా ఉంటోంది. ఎందుకిలా? అన్న దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త జిల్లాల విషయంలో తొందరపడి వ్యాఖ్యలు చేసేకన్నా.. ప్రజల నుంచి వచ్చే స్పందనను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే రియాక్టు కావాలన్నట్లుగా ఉందని చెబుతున్నారు.

తొందరపడి స్పందించే కన్నా.. ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిన తర్వాత.. మెజార్టీ ఏ అంశానికి ప్రాధాన్యత ఇస్తారో దానిపై గళం విప్పితే మంచిదన్న ఆలోచలో ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటు ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కాకపోవటం.. ఎన్నికల మేనిఫేస్టోలో ఉన్నదే కాబట్టి.. ప్రత్యేకంగా స్పందించటం సరికాదన్న ఆలోచనతోనే పవన్ తనదైన సమయం కోసం వెయిట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.