Begin typing your search above and press return to search.

హైదరాబాద్ సమస్యపై చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదు ?

By:  Tupaki Desk   |   21 Oct 2020 9:50 AM GMT
హైదరాబాద్ సమస్యపై చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదు ?
X
ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు వైఖరి చాలా విచిత్రంగా ఉంటోంది. భారీ వర్షాలకు రెండు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయిన మాట వాస్తవమే. అయితే నేతలతో జరిగిన కాన్ఫరెన్సులో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి సిఎంగా విఫలమైనట్లు మండిపోయారు. ఇంత అధ్వన్నమైన ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని చరిత్రలోనే ఎప్పుడూ చూడలేదని చంద్రబాబు కామెంట్ చేశారు. బాధితులను ఆదుకోవటంలో ప్రభుత్వం చేతులెత్తేసిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేయటమే ఆశ్చర్యంగా ఉంది. 15 ఏళ్ళు సిఎంగా చేసిన వ్యక్తికి ప్రభత్వం ఎలా పనిచేస్తుందో కొత్తగా ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు.

ఒకవైపు భారీ వర్షాలు పడుతుంటే క్షేత్రస్ధాయిలో ఏ ప్రభుత్వం కూడా సహాయచర్యలు చేయలేందు. ప్రభుత్వ ప్రయారిటి ఎలాగుంటుందంటే కేవలం మనుషుల ప్రాణాలను రక్షించటం, వాళ్ళని సహాయ శిబిరాలకు తరలించి నిత్యావసరాలను అందించటం మీదే ఉంటుంది. పంటల నష్టం, ఆస్తుల నష్టంపై ఈ దశలో దృష్టి పెట్టడం సాధ్యంకాదు. వర్షాలు తగ్గిన తర్వాత మాత్రమే నష్టాలపై అంచనాలు మొదలవుతాయి. ఎలాగంటే క్షేత్రస్ధాయిలో ఉన్నతాధికారులు, నిపుణులు తిరిగి స్ధానికులతో మాట్లాడిన తర్వాతే నష్టాలను అంచనా వేస్తారన్న విషయం ప్రతి ఒక్కళ్ళకు తెలుసు.

ఇపుడు ప్రభుత్వం చేస్తున్నదిదే. బాధితులను పరామర్శించేందుకు మంత్రులు, ఎంఎల్ఏలు, అధికారులు క్షేత్రస్ధాయిలో తిరుగుతున్నారు. బాధిత కుటుంబాలకు తలా రూ. 500 తాత్కాలిక రిలీఫ్ కింద అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉన్నంతలో ప్రభుత్వం బాగానే చేస్తోందదనే భావన మామూలు జనాల్లో ఉంటే చంద్రబాబు మాత్రం నోటికొచ్చినట్లు ఆరోపణలు చేసేస్తున్నారు. ప్రభుత్వాన్ని నెగిటివ్ యాంగిల్లో మాత్రం చూడాలని డిసైడ్ అయిన చంద్రబాబుకు ఇక పాజిటివ్ యాంగిల్ కనబడదన్న విషయం అర్ధమైపోతోంది.

మరి ఇదే సమయంలో తెలంగాణాలో సమస్యల గురించి పొరబాటున కూడా ఎక్కడా నోరిప్పటం లేదు. కనీవినీ ఎరుగని భారీ వర్షాల వల్ల హైదరాబాద్ నగరం మొత్తం బాగా దెబ్బతినేసింది. కాలనీలకు కాలనీలే వర్షం నీటిలో ముణిగిపోయింది. కనీసం 300 కాలనీలు వర్షపు నీటిలో గడచిన ఐదురోజులుగా ముణిగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. దీని ఫలితంగా వేలాదిమంది జనాలు రోడ్లపై పడ్డారు. ఆస్తులు, ప్రాణనష్టం భారీగా జరిగింది. ఈ దెబ్బ నుండి బయటపడటానికే సిఎం రిలీఫ్ పండుకు భారీగా విరాళాలు ఇవ్వాని కేసీయార్ పిలుపిచ్చిన విషయం అందరికీ తెలిసిందే.

మరి గడచిన ఎనిమిది నెలలుగా హైదరాబాద్ లోనే ఉంటూ భారీ వర్షాలపైన, జరిగిన నష్టాలపైన చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదు ? హైదరాబాద్ లోని డ్రైనేజి వ్యవస్ధ నిర్వహణ సరిగా లేని కారణంగానే తమకు ఇపుడు ఇబ్బందులు వచ్చినట్లు జనాలంతా మండిపడుతున్నారు. బాదితులంతా ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ విషయాలు మీడియాలో చూసిన తర్వాత కూడా కేసీయార్ ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలు చేయటానికి చంద్రబాబు ఎందుకు భయపడుతున్నట్లు ?