అచ్చెన్నకు ఇంత బాధెందుకో ?

Thu Jul 22 2021 11:03:58 GMT+0530 (IST)

Why is Atchen Naidu being sidelined in TDP?

టీడీపీ నేతల వైఖరి చాలా విచిత్రంగా ఉంటోంది. నాలుగు రోజుల క్రితమే జగన్మోహన్ రెడ్డి నియమించిన 137 కార్పొరేషన్ల ఛైర్మన్లపై టీడీపీ నేతలు వరుసబెట్టి ఆరోపణలు విమర్శలు చేస్తున్నారు. కీలకమైన పదవులున్నీ తమ సామాజికవర్గానికే ఇచ్చుకుని ఎందుకు పనికిరాని పదవులను మాత్రం బడుగు బలహీనవర్గాలకు కట్టబెట్టారంటూ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అండ్ కో ఒకటే గోల చేస్తున్నారు.అధికారంలో ఉన్న పార్టీ ఏ పోస్టులో ఎవరిని నియమించుకున్నా  ప్రతిపక్షాలు స్పందించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఒకపోస్టుకు పదిమంది పోటీపడతారు. వారిలో ఎవరికో ఒకరికే ఇవ్వగలరు. అంతమాత్రాన పోస్టుదక్కని వారు అనర్హులని కాదు అర్ధం. ఏ పార్టీ అధికారంలో ఉన్నా అసంతృప్తులు సహజంగానే ఉంటారు. ఇపుడు జగన్ భర్తీ చేసిన పదవుల విషయంలో వైసీపీ నేతల్లో ఎక్కడా అసంతి కనబడటంలేదు. పోస్టులు ఇచ్చిన వారు హ్యాపీనే పుచ్చుకున్నవారూ హ్యాపీనే.

మధ్యలో ఏ సంబంధంలేని టీడీపీ నేతలు ఎందుకని పదే పదే జగన్ పై ఆరోపణలు చేస్తున్నారో అర్ధం కావటంలేదు. చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నపుడు ఎన్ని కార్పొరేషన్లు భర్తీచేశారు ? ఎంతమంది నేతలకు పదవులిచ్చారో ? అందరికీ తెలిసిందే. పదవులివ్వని చంద్రబాబును ప్రశ్నించాల్సిన నేతలు అప్పట్లో నోరిప్పలేదు. పైగా అప్పట్లో చంద్రబాబు నాయుడు మొదటి రెండు సంవత్సరాలు పదవులే పూరించలేదు. దీనివల్ల ఎంతో మంది అవకాశాలు కోల్పోయారు. మరి అపుడు జగన్మోహన్ రెడ్డి గాని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు గాని దీని గురించి ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే అది ఆ పార్టీ అంతర్గత వ్యవహారం.

కానీ ఇదంతా మరిచిపోయిన తెలుగుదేశం నేతలు ఒకేసారి 137 మందికి ఛైర్మన్ పదవులిచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ గురించి టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. ఆ మధ్య బీసీ కార్పొరేషన్లకు కూడా 56 మందిని ఛైర్మన్లుగా నియమించిన విషయం గుర్తుండే ఉంటుంది.

ఒకళ్ళకు పదవి ఇవ్వాలన్నా మరోనేతను పక్కనపెట్టాలన్నా జగన్ ఏవో  లెక్కలేసుకునే ఉంటారు. తన ఆలోచనల ప్రకారమే నేతలను జగన్ మోహన్ రెడ్డి ఛైర్మన్లుగా నియమించారు. మొన్ననే భర్తీ చేసిన మున్సిపల్ ఛైర్మన్లు కార్పొరేషన్ల మేయర్ పదవుల్లో బీసీ ఎస్సీ ఎస్టీలను నియమించిన విషయాన్ని మాట్లాడటంలేదు. జనరల్ సీట్లలో కూడా బీసీలనే కూర్చోబెట్టారు కదా. అయినా పదవులు దక్కిన వారు తమకు సరైన ప్రాధాన్యత లభించలేదని ఆపణలు చేసినా అసంతృప్తిని వ్యక్తంచేసినా బాగుంటుంది. అంతేకానీ ఏ సంబంధంలేని టీడీపీ నేతలు జగన్ పై ఆరోపణలు విమర్శలు చేయటమే విచిత్రంగా ఉంది.