వారిద్దరి భేటీని ప్రపంచం ఎందుకంత ఆసక్తిగా చూసింది?

Sun Mar 07 2021 10:06:52 GMT+0530 (IST)

Why did the world look forward to their meeting?

ఇద్దరు ప్రముఖులు భేటీ కావటం కొత్తేం కాదు. కానీ..కొన్ని కాంబినేషన్లు చాలా అరుదుగా కుదురుతాయి. తాజాగా అలాంటిదే ఒకటి చోటు చేసుకుంది. ప్రపంచ దేశాలన్ని ఆసక్తిగా చూసిన ఒక భేటీ ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. ఇంతకూ ఆ ఇద్దరు ప్రముఖులు ఎవరంటే.. ఇరువురు ఇరు మతాలకు చెందిన అత్యంత ప్రముఖులు. వారిలో ఒకరు తొంబై ఏళ్లషియాల గ్రాండ్ అయతొల్లా అలీ అల్ - సిస్తానీ కాగా.. మరొకరు ప్రపంచ క్రైస్తవులకు ఆరాధనీయుడైన 84 ఏళ్ల కేథలిక్ మత పెద్ద పోప్ ఫ్రాన్సిస్. వీరిద్దరు తొలిసారి అరబ్ దేశంలో ఇరాక్ లో భేటీ అయ్యారు.ఒక పోప్ షియా మతపెద్దను కలవటం ఇదే తొలిసారి. అందునా కరోనా తర్వాత వీరిద్దరి తొలి భేటీ కావటం మరో విశేషం. ఇరాక్ లోని పవిత్ర నగరమైన నజాఫ్ లో వీరిద్దరి చారిత్రక భేటీ సాగింది. శాంతియుత సహజీవనం సాగించాలని ముస్లింలను కోరటంతో పాటు.. ఇరాక్ లోని క్రైస్తవుల్ని కాపాడుకోవటంలో మతాధికారులు కీలకపాత్ర పోషించాలని.. ఇతర ఇరాకీయుల మాదిరే వారు కూడా సమానహక్కులతో స్వేచ్ఛగా జీవించాలని గ్రాండ్ అయతొల్లా అలీ అల్  - సిస్తానీ కాంక్షించారు. తన వద్దకు వచ్చేందుకు పోప్ శ్రమ తీసుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ ఇరువురు మత పెద్దలు మాస్కు పెట్టుకోకుండానే దగ్గర దగ్గర కూర్చొని మాట్లాడుకోవటం గమనార్హం. ఈ ఇరువురు అగ్ర మత పెద్దల భేటీ దాదాపు 40 నిమిషాలకు పైనే సాగింది. షియాలు అత్యంత పవిత్రంగా భావించే ఇమామ్ అలీ సమాధి ఉన్న రసూల్ వీధిలోని అల్ సిస్తానీ నివాసానికి పోప్ ఫ్రాన్సిన్ బుల్లెట్ ఫ్రూఫ్ మెర్సిడెస్ బెంజ్ కారులో వెళ్లారు. అల్ సిస్తానీ నివాసానికి కాలి నడకన వెళ్లారు. పోప్ తన షూస్ వదిలేసి.. అల్ సిస్తానీ ఉన్నగదిలోకి వెళ్లారు. సందర్శకులు తనను కలుసుకునేందుకు వచ్చిన సమయంలో సాధారణంగా తన సీట్లో కూర్చొని ఉంటారు.

అందుకు భిన్నంగా అల్ సిస్తానీ లేచి నిలబడి.. పోప్ ను తన గదిలోకి ఆహ్వానించారు. అది చాలా అరుదైన గౌరవంగా చెబుతున్నారు. పోప్ ఫ్రాన్సిస్ కు టీ.. నీళ్ల బాటిల్ అందించగా.. ఆయన కేవలం నీటిని మాత్రమే తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ పర్యటనలో మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు.. ముస్లింలు.. యూదుల విశ్వాసాలకు మూలపురుషుడిగా ఉండే అబ్రహం జన్మించిన పురాతన ఊర్ నగరానికి పోప్ వెళ్లారు. అక్కడ  జరిగిన సర్వమత సమ్మేళనానికి హాజరయ్యారు. ఇరాక్ లోని క్రైస్తవులు.. ముస్లింలు.. ఇతర మతలాల వారు శతాబ్దాలుగా తమ మధ్య ఉన్న వైరాన్ని వదిలి.. శాంతి.. ఐక్యతల కోసం కృషి చేయాలని కోరారు. గ్రాండ్ అయతొల్లాతో భేటీ అయిన మొదటి పోప్ ఆయనే అని చెబుతారు. పోప్ పర్యటన నేపథ్యంలో నజాఫ్ లో 25వేల మంది బలగాలతో భారీ బందోబస్తు నిర్వహించారు.