అర్థరాత్రి వేళ చంద్రబాబును సోనూసూద్ ఎందుకు నిద్ర లేపారు?

Sun Jun 13 2021 12:14:11 GMT+0530 (IST)

Why did Sonu Sood wake Chandrababu up in the middle of the night?

ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు నటుడు సోనూసూద్. రీల్ లైఫ్ లో విలన్ పాత్రలు పోషించే ఆయన రియల్ లైఫ్ లో అందుకు భిన్నంగా అపర కర్ణుడి మాదిరి వ్యవహరిస్తూ.. ఎవరికేం సాయం అవసరమైనా క్షణాల్లో సమకూర్చేలా చేస్తుండటం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా ఆయన సేవలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. కష్టం వచ్చినంతనే పరిష్కారం కోసం సోనూసూద్ ను సాయం అడిగితే సరిపోతుందన్నట్లుగా ఇప్పుడు పరిస్థితులు మారాయి.ఇదిలా ఉంటే.. తాజాగా జరిగిన ఒక వెబ్ నార్ లో ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు సోనూసూద్. కరోనా ఫస్ట్ వేవ్ లో టీడీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అర్థరాత్రి వేళ తాను నిద్ర లేపానని చెప్పారు. అత్యవసరంగా ఒక రోగిని తరలించాల్సి వచ్చిందని.. అందుకు ఆయన సాయం అవసరమైందని.. అందుకే ఆయన్ను అంత రాత్రి వేళ నిద్ర లేపానని.. ఆయన సానుకూలంగా స్పందించి సాయం చేసినట్లుగా చెప్పారు.

అంతేకాదు.. చంద్రబాబు విజన్ ను సోనూ పొగడటం గమనార్హం. సినిమా షూటింగ్ ల కోసం తాను అనేకసార్లు హైదరాబాద్ కు వచ్చానని.. అక్కడి మౌలిక సదుపాయాలు.. నగర అందం తనను బాగా ఆకట్టుకున్నాయన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దూరదృష్టితో ఆయన ఏర్పాటు చేసిన మౌలిక వసతుల గురించి.. ఆయన విజన్ గురించి అందరూ చెబుతుంటారన్నారు. తాను కూడా అదే విషయాన్ని తన సహచర నటులకు బాబు విజన్ గురించి చెబుతానని పేర్కొనటం గమనార్హం.

ఇదిలా ఉంటే.. సోనూసూద్ తో గతంలో తాను మాట్లాడిన విషయాన్ని చంద్రబాబు వెల్లడించారు. మదనపల్లికి చెందిన ఒక రైతు కాడెడ్లు లేక తన పిల్లలతో కాడి పట్టించి పొలం దున్నుతున్న వైనం చాలామందిని కదిలించిందని.. ఆ రైతుకు సోనూ ట్రాక్టర్ ఇచ్చారని.. ఆ సమయంలో తాను అతనితో ఫోన్ లో మాట్లాడిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. సోనూసూద్ ను చూసి అందరూ గర్వపడాలని.. ఆయన్ను చూసి చాలామంది స్ఫూర్తి పొందుతున్నారన్నారు. ఇలా బాబు  గొప్పతనం గురించి సోనూ.. అతని సేవాతీరును చంద్రబాబు గొప్పగా చెప్పుకోవటం గమనార్హం.