ఏపీ గురించి మీకెందుకయ్యా... వదలని వైసీపీ

Sat Oct 01 2022 15:52:23 GMT+0530 (India Standard Time)

Why are you talking about AP? YSRCP does not give up

రాజకీయాలు అన్నాక విమర్శలు సహజం. ఇక ఒక రాష్ట్రంగా ఉన్న ఏపీ రెండుగా విడిపోయాక ఎపుడో ఒకపుడు ఏదో ఒక పోలిక మీద అటు నుంచి ఇటు నుంచి కూడా మాట్లాడేవారుంటారు. అయితే గతంలో చంద్రబాబు టైం లో ఒక రకమైన సమరమే అన్నట్లుగా టీయారెస్ టీడీపీల మధ్య సీన్ సాగింది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక చాన్నాళ్ళ పాటు రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత సాగింది.అయితే గత ఏడాదిగా మాత్రం సీన్ మారింది. తెలంగాణా మాత్రం చాలా సులువుగా ఏపీ మీద విమర్శలు చేస్తున్నారు. ఒక సందర్భంలో కేటీయార్ అయితే ఏపీలో రోడ్లూ బాగుండవ్ కరెంటూ ఉండదని హాట్ కామెంట్స్ చేశారు. ఇపుడు ఆయన బావ హరీష్ రావు వంతు వచ్చింది. ఆయన ఇటీవలే ఏపీలో ఉద్యోగులు ఉపాధ్యాయులు నానా ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. అంతే కాదు ఏపీలో ఎపుడు కరెంట్ వస్తుందో పోతుందో ఎవరికీ తెలియదు అంటూ కూడా  సెటైర్లు వేశారు.

దీని మీద వరసబెట్టి వైసీపీ మంత్రులు హరీష్ రావు మీద రివర్స్ అటాక్ చేస్తున్నారు. సజ్జల రామక్రిష్ణారెడ్డితో మొదలుపెడితే మంత్రి గుడివాడ అమరనాధ్ హరీష్ మీద నిప్పులే కక్కారు. ఇపుడు పెద్ద నోరు చేసుకుని మరో మంత్రి అంబటి రాంబాబు కూడా హరీష్ ఏపీతో నీకేమి పని అని గద్దించారు. నీ స్టేట్ ఏదో చూసుకో అంటూ సలహా ఇచ్చారు. అక్కడ టీయారెస్ వీక్ అయిందా లేక మరేమైనా ప్రాబ్లమా ఎందుకు ఏపీ వైపు చూస్తున్నారు అని అంబటి అసహనం వ్యక్తం చేశారు.

ఏపీకి ఆదాయం తక్కువగా ఉన్నా సంక్షేమాన్ని అద్భుతంగా చేస్తున్నామని చెప్పుకున్నారు. సంక్షేమం మీద తెలంగాణా ఏపీల విషయంలో చర్చకు సిద్ధమా అని హరీష్ రావుకు సవాల్ చేశారు. ఏపీ గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా హరీష్ కు లేదని అంబటి మండిపడ్డారు. ఇలా హరీష్ తో ఆయన  చెడుగుడు ఆడేశారు.

ఇవన్నీ ఇలా ఉంటే అమరావతి రైతుల పాదయాత్రను కొవ్వు బలసి చేస్తున్న యాత్రగా అంబటి చెప్పడం విశేషం. కడుపు కాలి పాదయాత్ర చేయడానికి అవతల వారు సిద్ధమైతే దానికి చంద్రబాబే బాధ్యత వహించాలని అంబటి పేర్కొనడం విశేషం.

చంద్రబాబు కుప్పంలో ఈసారి ఓడిపోతారని ఆయన బెంగ అంతా అక్కడే ఉందని అంబటి సెటైర్లు వేశారు. వారసులను జనాలు నెత్తిన పెట్టుకోరని దానికి ఉదాహరణ చంద్రబాబు కుమారుడు లోకేష్ అని ఆయన్ని దొడ్డితోవన తెచ్చి మంత్రి పదవులు కట్టబెట్టినా చివరికి 2019 ఎన్నికల్లో లోకేష్ ఓటమి పాలు అయ్యారని అంబటి  గుర్తు చేశారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.