Begin typing your search above and press return to search.

పీకే అంటే వైసీపీ ఎమ్మెల్యేల‌కు వ‌ణుకు ఎందుకు ?

By:  Tupaki Desk   |   13 Oct 2021 4:30 PM GMT
పీకే అంటే వైసీపీ ఎమ్మెల్యేల‌కు వ‌ణుకు ఎందుకు ?
X
ప్ర‌శాంత్ కిషోర్ ప్ర‌స్తుతం దేశ రాజకీయాల్లో ఈ పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్‌కు ఉన్న డిమాండ్ మామూలుగా లేదు. ముఖ్యంగా బెంగాల్ ఎన్నిక‌ల త‌ర్వాత పీకే క్రేజ్ ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం. ఇక 2014 ఎన్నిక‌ల‌కు ముందు ఇదే పీకే వైసీపీకి స్ట్రాట‌జిస్ట్‌గా ఉన్నారు. ఆయ‌న వ్యూహాలు జ‌గ‌న్ భారీ మెజార్టీతో అధికారంలోకి రావ‌డానికి ఎంతైనా ఉప‌యోగ‌ప‌డ్డాయి. ఈ విష‌యంలో ఎవ్వ‌రికి ఎలాంటి సందేహాలు లేవు. ఏపీలో మ‌రో రెండున్న‌రేళ్ల‌లో ఎన్నిక‌లు ఉన్నాయి. పీకే టీం మ‌రోసారి జ‌గ‌న్‌కు ప‌ని చేసేందుకు ఏపీలో రంగంలోకి దిగింది. ఇప్ప‌టికే ఉత్త‌రాంధ్ర నుంచి తొలి స‌ర్వే ప్రారంభించిన‌ట్టు కూడా తెలుస్తోంది.

పీకే టీం అలా ఏపీలో దిగి స‌ర్వేలు మొద‌లు పెట్టిందో లేదో ఏపీలో అధికార వైసీపీ ఎమ్మెల్యేల గుండెళ్లో రైళ్లు ప‌రిగెట్టేస్తున్నాయ‌ట‌. ఈ విష‌యం వారి మ‌ధ్య అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో కూడా వినిపిస్తోంది. పీకే అంటే జ‌గ‌న్‌కు అపార‌మైన న‌మ్మ‌కం.. ఎందుకంటే పీకే వ్యూహాలు జ‌గ‌న్‌కు భారీ మెజార్టీని క‌ట్ట‌బెట్టాయి. ఇక ఇటీవ‌ల బెంగాల్లో బీజేపీ ఎన్ని రంకెలు వేసినా తృణ‌మూల్ 200కు పైగా సీట్ల‌తో అధికారంలోకి వ‌స్తుంద‌ని స‌వాల్ చేసి మ‌రీ స‌క్సెస్ అయ్యారు. ఇక ఇప్పుడు పీకే చెప్పినట్టు చేసే విష‌యంలో జ‌గ‌న్ మాత్రం ఎందుకు ? వెనుక‌డుగు వేస్తారు.

అదే ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేల‌ను తెగ టెన్ష‌న్ పెట్టేస్తోంది. మొన్న బెంగాల్లో పీకే దెబ్బ‌తో 35 మంది సిట్టింగ్‌ల సీట్లు ఎగిరిపోయాయి. ఇక ఇప్పుడు కూడా ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త ఎదుర్కొంటోన్న సిట్టింగ్‌ల సీట్ల‌లో కోత త‌ప్ప‌ద‌న్న సంకేతాలు వైసీపీ ఎమ్మెల్యేల‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మొన్న ఎన్నిక‌ల‌లో జ‌గ‌న్ వేవ్‌తోనే గెలిచిన వారు 80 శాతం వ‌ర‌కు ఉంటారు. ఇక వీరిలో ప‌నితీరు ఏ మాత్రం బాగోలేని 60 శాతం ఎమ్మెల్యేల‌ను మార్చేస్తేనే వ‌చ్చే ఎన్నిక‌ల‌లో మ‌రోసారి వైసీపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని కూడా పీకే టీం ప్రాధ‌మికంగా నిర్దార‌ణ‌కు వ‌చ్చింద‌ని తెలుస్తోంది. ఇవ‌న్నీ పార్టీ నేత‌ల చ‌ర్చ‌ల ద్వారా బ‌య‌ట‌కు రావ‌డంతోనే చాలా మంది సిట్టింగ్‌లు ఇప్పుడు పీకే టీం ప్రాప‌కం కోసం ప్ర‌య‌త్నాలు చేస్తోన్న ప‌రిస్థితి.

ఇక గ‌త ఎన్నిక‌ల‌కు ముందే రాజ‌కీయాల్లోకి వ‌చ్చి జ‌గ‌న్ వేవ్‌లో తొలిసారి ఎమ్మెల్యేలు అయిన వారు చెప్పుకునేందుకు కూడా ఏమీ లేకుండా పోయింది. వారు తాము సొంతంగా గెలిచామ‌ని చెప్పుకోలేరు. పోనీ వారు చేసిన‌, చేస్తోన్న‌, చేసే డ‌వ‌ల‌ప్‌మెంట్ కూడా ఏమీ ఉండ‌దు. సంక్షేమ ప‌థ‌కాలు అన్ని జ‌గ‌న్ ఖాతాలోకి వెళ్లిపోతున్నాయ్‌..! ఇక పీకే టీం ప్ర‌స్తుతం చేస్తోన్న స‌ర్వేలో ప్ర‌జ‌ల నుంచి, పార్టీ కేడ‌ర్ నుంచి జ‌గ‌న్ ప‌ట్ల సానుకూల ధృక్ప‌థం క‌నిపిస్తున్నా.. చాలా మంది ఎమ్మెల్యేల‌పై అటు ప్ర‌జ‌ల్లోనే కాకుండా.. ఇటు పార్టీ కేడ‌ర్‌లోనూ తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త క‌నిపిస్తోంద‌ట‌.

కొంద‌రు ఎమ్మెల్యేలు నిధులు లేక‌, క‌మీష‌న్లు రాక చిన్నా చిత‌కా కూడా క‌క్కుర్తి ప‌డుతున్నారు. ఇది కూడా పీకే టీం ఫీడ్‌బ్యాక్‌లో తేలుతుంద‌ట‌. అందుకే చాలా మంది పీకే టీం ప్రాప‌కం పొంది.. వారికి ముడుపులు ముట్టించేందుకు కూడా వెనుకాడ‌డం లేద‌ని టాక్ ?

ఈ న్యూస్ గురించి మీ దగ్గర ఏదైనా సమాచారం ఉంటె క్రింద ఉన్న కామెంట్ బాక్స్ లో షేర్ చేసి కామెంట్ రూపం లో మాతో పంచుకోండి.