Begin typing your search above and press return to search.

ప్రపంచ చాంపియన్లపై ఇంత పైశాచికత్వం దేనికి?

By:  Tupaki Desk   |   30 May 2023 1:00 PM GMT
ప్రపంచ చాంపియన్లపై ఇంత పైశాచికత్వం దేనికి?
X
ఉత్తరప్రదేశ్‌ బీజేపీ ఎంపీ, భారత రెజ్లర్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ కు వ్యతిరేకంగా నెల రోజులుగా మహిళా రెజ్లర్లు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, చివరకు మైనర్‌ బాలికలను కూడా వదల్లేదని రెజ్లర్లు ఆరోపిస్తున్నారు. బ్రిజ్‌ భూషణ్‌ ను ఆ పదవి నుంచి తప్పించాలని, అరెస్టు చేయాలని నెల రోజులుగా ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు.

మహిళా రెజ్లర్లలో ప్రపంచ చాంపియన్లు అయిన వినేష ఫోగట్, సాక్షి మాలిక్‌ వంటి వారు ఉన్నారు. వీరికి పురుష రెజ్లర్, ఒలింపిక్‌ పతక విజేత భజరంగ్‌ పునియా వంటివారు కూడా మద్దతు తెలుపుతున్నారు.

అయితే కేంద్ర ప్రభుత్వంలో మాత్రం ఎలాంటి కదలిక లేదు. చివరకు కోర్టును ఆశ్రయించడం.. కోర్టు బ్రిజ్‌ భూషణ్‌ పై ఎఫ్‌ఆర్‌ఐ దాఖలు చేయాలని ఆదేశించడంతో పోలీసులు ఎట్టకేలకు ఆ పనిమాత్రం చేయగలిగారు.

అయితే బ్రిజ్‌ భూషణ్‌ ను రెజ్లర్ల ఫెడరేషన్‌ అధ్యక్షుడిగా తప్పించాలన్న రెజ్లర్ల డిమాండ్‌ ను కేంద్రం పట్టించుకోలేదు. అలాగే ఆయనను ఇప్పటివరకు అరెస్టు చేయలేదు. దీంతో రెజ్లర్లు తమ నిరసన దీక్షను కొనసాగిస్తున్నారు. మే 28న కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవం సందర్భంగా ఆ భవనం వైపు శాంతియుత ర్యాలీ చేపట్టారు.

శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీకి వెళ్తున్న రెజ్లర్లను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో అత్యంత దారుణంగా మహిళా రెజ్లర్లను పోలీసులు రోడ్లపైన ఈడ్చుకుపోయారు. సాక్షి మాలిక్, వినేష ఫోగట్, భజరంగ్‌ పునియాతో పాటు ఇతర ఆందోళనకారులను బంధించి ఢిల్లీలోని వివిధ పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. వారిపై పలు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

రెజ్లర్లను బలవంతంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిని బస్సుల్లో ఎక్కించి వేర్వేరు ప్రాంతాలకు తరలించారు. అందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కాగా ఈ ఫొటోల్లో వినేష ఫోగట్, సంగీత ఫోగట్‌ పోలీసు వ్యాన్‌లో కూర్చుని నవ్వుతూ సెల్ఫీ తీసుకుంటున్నట్లు ఉంది. బీజేపీ సోషల్‌ మీడియా వింగ్‌ ఈ ఫొటోలను వైరల్‌ చేసింది. వాస్తవానికి వారిద్దరూ పోలీస్‌ వ్యాన్‌ లో సీరియస్‌ గా కూర్చుని ఉన్నారు.

ఈ నేపథ్యంలో ఈ ఫొటోలపై రెజ్లర్లు స్పందించారు. తమ ఫొటోలను ''కొందరు మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారని ఆరోపించారు. కొత్తగా వచ్చిన ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌(ఏఐ) ఉపయోగించి మొహాలనే మార్చేస్తున్నారు.. మేమెంత చెప్పండి.. మా నిరసనపై బురద జల్లే ప్రయత్నంలో కొందరు గిట్టని వ్యక్తులు ఇలాంటి తప్పుడు ఫొటో (నవ్వుతున్నట్టు) ప్రచారం చేస్తున్నారు. ఈ నకిలీ ఫొటోను పోస్ట్‌ చేసిన వారిపై ఫిర్యాదు చేస్తాం'' అని భజరంగ్‌ పునియా తన ట్వీటులో దుమ్మెత్తిపోశాడు.

అలాగే మరో మహిళా రెజ్లర్‌ సాక్షి మాలిక్‌ కూడా తాము నవ్వుతున్నట్టు ఫేక్‌ ఫొటోలను కొందరు వైరల్‌ చేయడంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ''అవి నిజమైన ఫొటోలు కావు.. కొందరు కావాలనే మార్ఫింగ్‌ చేశారు. అలాంటి వారికి సిగ్గు లేదు. వారిని దేవుడు ఎలా సృష్టించాడో అర్థం కావట్లేదు. మాకు చెడ్డపేరు తీసుకొచ్చేందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు'' అని ధ్వజమెత్తారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఎంపీ, బలమైన సామాజికవర్గానికి చెందిన వ్యక్తిపై రెజ్లర్లు పోరాడుతుంటే కనీసం వారికి మద్దతు తెలపకపోగా బీజేపీ సోషల్‌ మీడియా వింగ్‌ ఇలాంటి చిల్లర పనులు చేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.