జట్టంతా మైదానంలో.. కెప్టెనేమో విందులు చిందుల్లో

Fri Mar 17 2023 20:00:01 GMT+0530 (India Standard Time)

Why Rohit Sharma will not play 1st ODI

టీమిండియా మైదానంలో చెమటోడ్చుతోంది.. ఆటగాళ్లంతా మ్యాచ్ కోసం సిద్ధమవుతున్నారు.. కానీ ఒక్కరు మాత్రం మిస్సింగ్.. అతడేమీ సాదాసీదా ఆటగాడు కాదు.. చాలా సీనియర్.. అందులోనూ ప్రపంచ కప్ ముంగిట ఆడనున్న అతి కొద్ది వన్డే మ్యాచ్ లివి. ఇలాంటి సమయంలో అతడి ప్రాతినిధ్యం అతడికే కాక జట్టుకూ అవసరం. కానీ ఆ ఆటగాడు మాత్రం అందుబాటులో లేడు.అందుకేనా.. విరామం

భారత జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ ఆడుతోంది. తొలి మ్యాచ్ శుక్రవారం వాంఖడే స్టేడియంలో ప్రారంభమైంది. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా సారథ్యంలో జట్టు బరిలో దిగింది. తుది జట్టులో కేఎల్ రాహుల్ కు వికెట్ కీపర్ గా స్థానం దక్కింది. స్పెషలిస్ట్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ఉన్నప్పటికీ అతడిని కాదని రాహుల్ కు కీపింగ్ అప్పగించారు. మరోవైపు కిషన్ డబుల్ సెంచరీ వీరుడు కావడంతో ఎక్కువగా బ్యాట్స్ మన్ గానే అతడిని వినియోగించుకోవాలని జట్టు చూస్తోంది.

అంతా బాగానే ఉంది గానీ.. జట్టులో ఓ లోటు కనిపిస్తోంది. పూర్తిస్థాయి కెప్టెన్ అయిన రోహిత్ శర్మ ఎక్కడ? అనే సందేహం వస్తోంది. టి20 కెప్టెన్ అయిన పాండ్యా ఎందుకు బాధ్యతలు చేపట్టాడు. ఒకవేళ పాండ్యాను వన్డేలకూ కెప్టెన్ చేస్తారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. కానీ దీని వెనుక ఉన్న కథ వేరే. నెల కింద ఆసీస్ తో వన్డే సిరీస్ కు జట్టును ప్రకటించిన సమయంలోనే కెప్టెన్ రోహిత్ తొలి వన్డేకు అందుబాటులో ఉండడని తెలిపారు. వ్యక్తిగత కారణాలే దీనికి కారణమని చెప్పారు.

అందుకుతగ్గట్లే రోహిత్ తొలి మ్యాచ్ కు విరామం తీసుకున్నాడు. రెండో వన్డే నుంచి అతడు అందుబాటులోకి వస్తాడని భావించారు. అప్పట్లో రోహిత్ ఒక్క మ్యాచ్ కు విరామం తీసుకోవడం ఎందుకో ఎవరికీ తెలియరాలేదు. తీరాచూస్తే .. గురువారం రాత్రి జరిగిన ఓ వివాహ వేడుకలో రోహిత్ శర్మ తన భార్య రితికాతో కలిసి వేదికపై డ్యాన్స్ చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది.

దీనివెనుక నేపథ్యం ఏమంటే..

భార్యతో కలిసి షాకింగ్ స్టెప్పులేసిన రోహిత్ శర్మను చూసి స్నేక్ మూమెంట్స్ అదుర్స్ అంటూ నెటిజన్ల కామెంట్స్ చేస్తున్నారు. బావ మరిది (రితికా సోదరుడు) పెళ్లి నేపథ్యంలో రోహిత్ తొలి వన్డే నుంచి తప్పుకొన్నాడు. ఇప్పుడు ఆ పెళ్లి వేడుకకు సంబంధించి రోహిత్ ఆయన భార్య వీడియో వైరల్ అవుతోంది. గురువారం రాత్రి జరిగిన వివాహ వేడుకలో రోహిత్ రితికాతో కలిసి వేదికపై డ్యాన్స్ చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేశాడు. రోహిత్ పాములా చేతులు కదుపుతూ భార్యతో కలిసి స్టెప్పులు వేశాడు.

ఆ తర్వాత భార్యపై డబ్బుల కురిపిస్తున్న చేతులు ఆడిస్తూ సరదాగా కనిపించాడు. ఈ వీడియోపై నెటిజన్లతో పాటు అభిమానులు కూడా తెగ ఇష్టపడుతున్నారు. రోహిత్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ కామెంట్లు చేస్తున్నారు. పాములా స్టెప్పులు వేస్తావేంటి భయ్యా.. తీన్మార్ స్టెప్పులు వేస్తే బాగుండేది అంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. కాగా రోహిత్ విశాఖపట్టణంలో జరిగే రెండో వన్డే నుంచి జట్టుతో చేరనున్నాడు. కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టనున్నాడు.  


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.