Begin typing your search above and press return to search.

మోడీ నోరు మూగబోయిందా?

By:  Tupaki Desk   |   4 Aug 2020 12:50 PM GMT
మోడీ నోరు మూగబోయిందా?
X
యావత్ ప్రపంచంలో మరే దేశంలో లేని విధంగా వైరస్ మీద యుద్ధం ఎలా చేయాలన్న విషయాన్ని ప్రధాని మోడీని చూసి నేర్చుకోవాల్సిందే. లాక్ డౌన్ పెట్టటానికి ముందు.. ట్రయల్ రన్ గా జనతా కర్ఫ్యూ పేరుతో చేసిన హడావుడి తెలిసిందే. తర్వాత లాక్ డౌన్ విధించి.. ఫలానా టైంకు అందరూ చప్పట్లు కొట్టాలని.. దీపాలు వెలిగించాలని.. పూలవర్షం కురిపించాలని రకరకాల టాస్కులు ఇవ్వటం తెలిసిందే.

మోడీ మీద అభిమానం అనే కన్నా.. ఆయనేం చెబితే అది చేస్తే దేశానికి ఏదో మేలు జరుగుతుందన్న భావన దేశ ప్రజల్లో ఎంత ఎక్కువగా ఉందన్న విషయం.. ఆయనిచ్చిన టాస్కులకు వచ్చిన స్పందన చూసిన వారికి అర్థమైంది. సాధారణంగా వైరస్ మీద పోరు అర్థవంతంగా ఉండాలి. అందుకు భిన్నంగా భావోద్వేగాన్ని రగిలించటమే ముఖ్యమన్నట్లుగా మోడీ తీరు ఉందన్న విమర్శ ఉంది. లాక్ డౌన్ సమయంలో దేశంలోని వలసకూలీల విషయంలో మోడీ సర్కారు దారుణంగా వైఫల్యం చెందినప్పటికీ.. ఆ విషయాన్ని ఎవరూ పట్టించుకున్నది లేదు.

లాక్ డౌన్ వేళ.. తమ ఊళ్లకు చేరుకోవటానికి వేలాది కిలోమీటర్లు పిల్లాపాపలతో రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్లిన దయనీయ సన్నివేశాలు చూసినప్పుడు.. మోడీ మాటలకు.. చేతలకు మధ్యనున్న వ్యత్యాసం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందని చెప్పక తప్పదు. టాస్కులు ఇవ్వటం.. దానికి తన ప్రచార టీంతో మసాలా జోడింది.. ఉద్విగ్నతను పెంచి పోషించే తీరు చూసిన మేధావులు మాత్రం అవాక్కు అవుతున్నారు.

ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న రెండో దేశం.. కరోనా లాంటి ప్రాణాంతక వైరస్ మీద పోరాటం చేసే తీరు మాత్రం కచ్ఛితంగా ఇలా ఉండకూడదన్న మాట మేధావుల నోట వస్తున్నా పట్టించుకున్నది లేదు. ప్రపంచంలో దీపాలు వెలిగిస్తే.. చప్పట్లు కొడితే కరోనాకు చెక్ చెప్పేందుకు సాయమవుతుందని చెబితే దేశమంతా మోడీ.. మోడీ ఎంతలా కీర్తించుకున్న విషయం తెలిసిందే.

లాక్ డౌన్ వేళలోనూ.. అన్ లాక్ వేళలోనూ పేద ప్రజలకు సాయం అందేలా.. వారికి దన్నుగా నిలిచేలా చర్యలు తీసుకోవటంలో ఆయన సరైన నిర్ణయాలు తీసుకోలేదన్న విమర్శ అంతకంతకూ ఎక్కువ అవుతోంది. అన్నింటికి మించి.. ఘనమైన అంకెలతో ఆయన ప్రకటించిన ప్యాకేజీ ఒక పట్టాన అర్థం కాని పరిస్థితి. గుప్పెడు మంది కార్పొరేట్లకు దన్నుగా మాత్రమే ఆయన నిర్ణయాలు ఉంటున్నాయే తప్పించి.. పేదలకు.. సామాన్యులకు ఆయన ఎలాంటి భరోసా ఇవ్వటం లేదని చెబుతున్నారు.

ఈ వాదనకు నిదర్శనంగా కొన్ని గణాంకాల్ని ఉటంకిస్తున్నారు. 2019 జులై కంటే 2020 జులైను చూస్తే.. జీఎస్టీ వసూళ్లు కేవలం రూ.15వేల కోట్లు మాత్రమే వచ్చిన వైనం కనిపిస్తుంది. పూర్తిస్థాయిలో రైళ్లు.. విమానాలు.. అతిధ్య రంగంతో పాటు హోటళ్లు.. రెస్టారెంట్లు.. సినిమా.. వినోద రంగాలు ఏ మాత్రం పని చేయని వేళలోనే ఆదాయం ఇంతలా వస్తే.. అవన్నీ పని చేస్తే పరిస్థితి ఏమిటన్నది ప్రశ్న. దేశవ్యాప్తంగా చిన్న చిన్న వ్యాపారాలు ఇప్పటివరకూ షురూ అయ్యిందే లేదు. మొత్తంగా చూస్తే.. అన్ లాక్ పూర్తిస్థాయిలో జరగకున్నా.. పన్ను రూపంలో వచ్చే ఆదాయం కాస్త మాత్రమే తేడా ఉన్న పరిస్థితి చూస్తే.. దేశ ఆర్థిక పరిస్థితి రికవరీ మోడ్ లోకి వచ్చేసిందని చెప్పాలి. బ్యాడ్ లక్ ఏమంటే.. సామాన్యుడు.. మధ్యతరగతి జీవుల పరిస్థితి లాక్ డౌన్ వేళ కంటే మరింత దిగజారిందని చెప్పక తప్పదు. ఇదంతా చూస్తే.. కరోనా వేళ దేశ ప్రజలకు ఒరిగిందేమీ లేదన్న భావన కలుగక మానదు. రోజురోజుకు ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోతున్నప్పటికి మోడీ నోరు మూగబోయి ఉండటం దేనికి నిదర్శనమన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.