ఈడీ సీబీఐ... తెలుగు స్టేట్స్ ఎందుకు టార్గెట్ ...?

Tue Mar 21 2023 23:00:01 GMT+0530 (India Standard Time)

Why ED and CBI Targetting Telugu States

ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సీబీఐ ఈ రెండూ ఇపుడు తెలుగు రాష్ట్రాలను అట్టుడికిస్తున్నాయి. వరసబెట్టి దర్యాప్తులు జరుపుతున్నాయి. కేసులు పెడుతున్నాయి. టాప్ లెవెల్ పొలిటీషియన్స్ ని టార్గెట్ చేస్తున్నాయి. ఇంతలా హడావుడి ఎపుడూ లేదు. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది అన్నదే చర్చగా ఉంది.నిజానికి నిప్పు లేనిదే పొగ రాదు తప్పు చేయనిదే పోలీస్ రాడు అని అంటారు. అలా ఎక్కడో ఏదో ఎంతో కొంత ఆధారం ఉండబట్టే ఈడీ వంటి అతి పెద్ద సంస్థ విచారణకు పిలుస్తుంది అని అన్న వారూ ఉన్నారు. అలాగే సీబీఐకి కూడా ఎన్నో కేసులు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఎందుకు ఉంటుంది అని కూడా అన్న వారు ఉన్నారు.

ఇక తెలంగాణాలో చూస్తే బీయారెస్ అధినేత కేసీయార్ ముద్దుల తనయ కవితను ఈడీ ఇప్పటికి మూడు సార్లు పిలిచి గంటల తరబడి విచారిస్తోంది. ఏపీలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి కడప ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా అనేక సార్లు పిలిచి విచారిస్తున్నారు. ఆయన తండ్రి వైఎస్ భాస్కరరెడ్డిని ఈడీ విచారణకు పిలిచే వీలుంది. ఇక అవకాశం ఉంటే ఈ కేసూల్లో సీబీఐ అరెస్టుల దాకా వెళ్లే చాన్స్ ఉంది అంటున్నారు.

అలాగే కవిత కేసులో ఈడీ అరెస్ట్ వంటి సంచలన డెసిషన్ తీసుకుంటుందా అన్న చర్చ సాగుతోంది. ఇదిలా ఉంటే ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు  రాఘవరెడ్డిని ఇప్పటికే ఈడీ విచారించి అరెస్ట్ చేసింది. ఇపుడు ఎంపీని సైతం పిలుతోంది. ఈ కేసు విషయంలో ఏమీని ఏ విధంగా విచారించి ఎంత దాకా వ్యవహరంలో వెళ్తారో అన్న ఆసక్తి ఉంది.

మరో వైపు ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అన్నది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగింది. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా  సీమెన్స్ అన్న సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. మూడు వేల కోట్ల రూపాయలు విలువ చేసే ఈ ప్రాజెక్ట్ కాస్ట్ లో పదవ శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే తొంబై శాతం సీమెన్స్ సంస్థ గ్రాంట్ ఇన్ ఎయిడ్ గా ఇస్తుంది అన్నది మ్యాటర్.

ఆ విధంగా మొదట ప్రభుత్వం నుంచి 371 కోట్ల రూపాయలు    సీమెన్స్  వైపు  వెళ్ళాయి. ఆ తరువాత ఈ ప్రాజెక్ట్ అతీ గతీ లేదు ఇది పెద్ద స్కాం దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఈ ప్రాజెక్ట్ లో భారీ స్కాం జరిగింది అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటున్నారు. అసెంబ్లీ సాస్ఖిగా ఆయన చంద్రబాబుకు ఈ స్కాం లో సంబంధం ఉంది అని తీవ్రమైన ఆరోపణలు చేశారు.

మరో వైపు చూస్తే ఈ ప్రాజెక్ట్ విషయంలో ఏపీ ప్రభుత్వం ఏపీ సీఐడీ ద్వారా విచారణ జరుపుతోంది. కేంద్రం వైపు నుంచి దీని మీద దర్యాప్తు సాగుతోందని అంటున్నారు. ఈ కేసులో వాస్తవాలు బయటకు మరింతగా బయటకు వస్తే చంద్రబాబుకు ఇబ్బందిగా మారుతుంది అని అంటున్న వారూ ఉన్నారు.

మొత్తానికి చూస్తే తెలుగునాట ముగ్గురు ప్రముఖ రాజకీయ నాయకులకు మనశ్శాంతి లేకుండా ఉంది. ఈడీ సీబీఐ విచారణలతో ఎటు నుంచి ఎటో డ్రైవ్ చేస్తున్న పరిస్థితి. తెలంగాణాలో ఎమ్మెల్సీగా ఉన్న కవిత అరెస్ట్ అయితే అది కేసీయార్ కి భారీ షాక్ లాంటి పరిణామం. అదే ఏపీలో వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ అయినా అలాగే మరో ఎంపీ మాగుంటను ఈడీ అదుపులోకి తీసుకున్నా వైసీపీ సర్కార్ ఉక్కిరిబిక్కిరి కావాల్సిందే. అంతే కాదు నేరుగా జగన్ కి కూడా షాకింగ్ గా ఉంటుంది అంటున్నారు.

ఇపుడు స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు చురుకుగా కదిలితే మాత్రం తెలుగుదేశానికి కూడా ఊపిరి సలపని ఇరకాటం ఉంటుంది అంటున్నారు. కట్ చేస్తే ఈ ఏడాది ఎండింగ్ లో తెలంగాణాలో ఎన్నికలు ఏపీలో వచ్చే ఏడాది ఎన్నికలు  ఉన్నాయి. కేంద్రంలో కూడా అదే సమయంలో ఎన్నికలు జరుగుతాయి. మరి ఇన్నాళ్ళుగా ఈ వ్యవహారాలు అన్నీ ఉన్నా ఇపుడే సడెన్ గా విచారణ వేగవంతం కావడం అందరికీ దడ పుట్టించేలా దూకుడు చేయడం అంటే దీని వెనక మాస్టర్ ప్లాన్ ఏంటి అన్నదే చర్చగా ఉంది.

మొత్తం మీద చూసుకుంటే తెలుగునాట బిగ్ షాట్స్ గా ఉన్న పొలిటీషియన్స్ ని కట్టడి చేసే క్రమంలో విచారణ జోరుగా సాగుతోందా అన్న డౌట్లు అయితే ఉన్నాయట. ఇన్నాళ్ళకు సౌత్ మీద బీజేపీ కన్నేసింది. వచ్చే ఎన్నికల్లో మూడవసారి మళ్లీ అధికారంలోకి రావాలని ఆరాటపడుతోంది. దాంతో తర తమ భేదం లేకుండా దర్యాప్తు సంస్థలు పాత కొత్త కేసులను తవ్వి తీస్తున్నాయని అంటున్నారు. చిత్రమేంటి అంటే వైసీపీ టీడీపీ కేంద్రంలోని బీజేపీతో దోస్తీ చేస్తున్నాయి. కేసీయార్ వ్వతిరేకిస్తున్నారు. అయినా అందరికీ  ఒకేసారి షాకింగ్ ట్రీట్మెంట్ అన్నట్లుగా కధ ముందుకు సాగడం రాజకీయ వ్యూహంగానే చూస్తున్నారు.   నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.