Begin typing your search above and press return to search.

యడ్డీ వారసుడెవరు? రేసులో వినిపిస్తున్న పేర్లతో ఎవరికి ఛాన్స్?

By:  Tupaki Desk   |   26 July 2021 11:30 AM GMT
యడ్డీ వారసుడెవరు? రేసులో వినిపిస్తున్న పేర్లతో ఎవరికి ఛాన్స్?
X
ముందుగా రాసుకున్న స్క్రిప్టు ఏలా అయితే జరుగుతుందో.. అంతే పక్కాగా కర్ణాటక అధికారపక్షంలో చోటు చేసుకునే మార్పులు క్రమపద్దతిలో సాగుతున్నాయి. మీడియా అంచనాలకు తగ్గట్లే.. కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి నుంచి యడ్యూరప్పను తొలగించారు అనక ఆయన చేత రాజీనామా చేశారు. ఎప్పుడు సీఎం కుర్చీలో కూర్చున్నా.. సంతృప్తికరంగా ఐదేళ్లు అధికార దండాన్ని అరచేతిలో పెట్టుకోవాలన్న ఆశ మాత్రం తీరలేదు. ఈ కారణంతోనే కావొచ్చు.. ఆయన తన పదవికి రాజీనామా చేసిన తర్వాత తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యారు. మోడీషాలకు మొక్కుబడి కృతజ్ఞత చెప్పి మమ అనిపించారు.

''రాజీనామా చేస్తున్నందుకు నాకు బాధ లేదు. ప్రధాని నరేంద్ర మోడీ.. అమిత్ షా.. జేపీ నడ్డాలు నాకు సీఎంగా రెండేళ్లు అవకాశం కల్పించారు. అందుకు వారికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా సరిపోవు'' అని ట్వీట్ చేయటం ద్వారా భవిష్యత్తులో కలిగే అవకాశాల్ని ఆయన సజీవంగా నిలుపుకున్నారని చెప్పాలి. సీఎం కుర్చీలో రెండేళ్లు కూర్చోబెట్టటం మామూలు విషయం కాదన్నట్లుగా ఆయన మాటలు ఆసక్తికరంగా మారాయి. ఏ రోజైతే ముఖ్యమంత్రి పదవిని చేపట్టారో.. సరిగ్గా రెండేళ్లకు అదే రోజు రాజీనామా చేసిన ప్రత్యేకత యడ్డీ సొంతమని చెప్పాలి. పదవీ గండం పొంచి ఉన్న వేళ.. ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీని కలిసి మంతనాలు చేసిన ప్రయత్నం ఫలించలేదు. కాకుంటే.. భవిష్యత్తు దివ్యంగా ఉంటుందన్న భరోసాను ఇచ్చినట్లు చెబుతారు.

యడ్డీ ముచ్చట ఇలా ఉంటే..ఆయన వారసుడు ఎవరు? ఎవరికి సీఎం పగ్గాలు అప్పజెప్పనున్నారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. తాజాగా పలు అంచనాలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్న బీజేపీ నేతలు ఎక్కువనే చెప్పాలి. యడ్డీ వారసుడిగా ఉండేందుకు ఎవరికి వారు ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నా.. మోడీషాలు ఎవరిని డిసైడ్ చేయాలనే దానిపై ఇప్పటికే ఒక ఆలోచనలో ఉండి ఉంటారని చెబుతున్నారు. మరోవైపు సీఎంగా ఆశావాహుల జాబితా కాస్త పెద్దదిగానే కనిపిస్తోంది.

రేసులో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో ఒకటి రాష్ట్ర హోం మంత్రి బసవరాజ్ బొమ్మై. కర్ణాటక రాష్ట్ర మాజీ సీఎం ఎస్ఆర్ బొమ్మై కొడుకే ఈ బసవరాజు బొమ్మై. ఇతనికే సీఎం పదవిని ఇవ్వాలని యడ్డీ కూడా చెప్పినట్లు ప్రచారం జరుగుతున్నా.. తన వారసుడు ఎవరన్న విషయం మీద అధిష్ఠానంతో తానేమీ చెప్పలేదని యడ్డీ స్పష్టం చేయటం గమనార్హం. బసవరాజ్ తర్వాత ఎక్కువగా వినిపిస్తున్న పేరు.. రాష్ట్ర గనుల శాఖా మంత్రి మురుగేశ్ నిరాణి.. ఎమ్మెల్యే అరవింద్ బెల్లాడ్ పేర్లు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి.

ఈ ముగ్గురు నేతలు లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన వారే కావటం గమనార్హం. కర్ణాకటలో రాజకీయంగా లింగాయత్ లు పవర్ ఫుల్ గా ఉండటమే కాదు.. ఈ వర్గానికి అధికారాన్ని కట్టబెడితేనే.. సదరు పార్టీ ఫ్యూచర్ ఉంటుందని చెబుతారు. ఎందుకంటే.. కర్ణాటక ఓటు బ్యాంకులో సింహభాగం లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన వారే. వారే రాష్ట్రంలో ఎవరి చేతిలో అధికారం ఉండాలన్నది డిసైడ్ చేస్తుంటారు. లింగాయత్ ల తర్వాత కర్ణాటక లో ప్రభావాన్ని చూపించే సామాజిక వర్గం ఒక్కళిగ వర్గంగా చెబుతారు.

మరో రెండేళ్లలో రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని నిలబెట్టుకోవటానికి వీలుగా సీఎం ఎంపిక ఉంటుందని చెబుతున్నారు. మొదట్లో అనుకున్నట్లు లింగాయత్ లకు అవకాశం లభించకుంటే.. ఒక్కళిక వర్గానికి చెందిన నేతను ముఖ్యమంత్రిగా డిసైడ్ చేయాలనుకుంటే.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి.. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి అశ్వత్ నారాయణ్.. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషీ.. రాష్ట్ర చీప్ విప్ సునీల్ కుమార్ పేర్లు వినిపిస్తున్నాయి. మరెవరికి ఎంపిక చేస్తారో చూడాలి. ఏది ఏమైనా.. రేపటికల్లా కొత్త ముఖ్యమంత్రి ఎవరన్నది తేలిపోవటం ఖాయమంటున్నారు. నూటికి తొంభై ఐదు శాతం మంగళవారమే యడ్డీ వారసుడ్ని డిసైడ్ చేయటం పక్కా అంటున్నారు.