వైసీపీ ప్లీనరీ ఎపుడంటే... ?

Sat Oct 16 2021 06:00:01 GMT+0530 (IST)

When is the YCP Plenary

వైసీపీ ఒక రాజకీయ పార్టీ. దానికి ఎన్నికలు నిర్వహించాలి. ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనల మేరకు ఠంచనుగా పార్టీ కార్యవర్గాలు ఏర్పాటు చేయాలి. ఇపుడు తెలంగాణాలో టీయారెస్ ప్లీనరీకి రంగం సిద్ధమవుతోంది. అట్టహాసంగా చేస్తున్నారు. మరి ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్లీనరీ ఎపుడూ అన్న చర్చ కూడా సాగుతోంది. నిజానికి వైసీపీ ప్లీనరీ జరిగి ఇప్పటికి నాలుగేళ్ళు పై దాటింది. పార్టీ రాజ్యాంగం ప్రకారం ప్రతీ రెండేళ్లకు ఒకసారి ప్లీనరీ జరగాలి అని చెబుతారు. అయితే గత రెండేళ్ళుగా కరోనా కారణంగా పార్టీ సమావేశాలను నిర్వహించలేకపోయారు అంటున్నారు. ఇపుడు కరోనా తగ్గుముఖం పట్టింది కాబట్టి వైసీపీలోనూ పార్టీ మహాజన సభల మీద చర్చ బాగానే సాగుతోంది.నిజానికి 2018 జూలైలో వైసీపీ చివరిసారిగా ప్లీనరీని నిర్వహించింది. నాడు నిర్వహించిన ప్లీనరీ ఆమోదించిన తీర్మానాలు ఆ పార్టీ చరిత్రలో గుర్తుండిపోయేవే అనడమో సందేహం. లేదు. ఎందుకంటే నాటి ప్లీనరీలోనే జగన్ పాదయాత్రకు ఆమోద ముద్ర వేశారు. నాటి చంద్రబాబు సర్కార్ మీద అలా బ్రహ్మాస్త్రాన్ని వదిలారు. అది ఎక్కడ చేదించాలో అక్కడ చేదించి లక్ష్యాన్ని సాధించింది. ఇక పార్టీ అనుకున్న విధంగా మంచి మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ఇపుడు ప్రభుత్వం బాగానే ఉంది కానీ పార్టీ ఎక్కడ అన్న ప్రశ్న అయితే అందరిలో ఉంది. అపుడెపుడో వేసిన కార్యవర్గాలు మాత్రమే ఉన్నాయి. అయితే అందులో చాలా మంది ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఇతర నామినేటెడ్ పదవులు తాజాగా లోకల్ బాడీ ఎన్నికల్లో అనేక కీలక పదవులు పొందారు. దాంతో వారంతా పార్టీకి దూరంగానే ఉంటున్నారు అని చెప్పాలి.

పార్టీ చక్కగా ఉంటేనే ఏదైనా జరిగేది కానీ వైసీపీ తీరు చూస్తే అనేక జిల్లాలలో పార్టీ ఆఫీసులు కూడా సరిగ్గా తెరచుకోని పరిస్థితి. దాంతో కార్యకర్తలు ఎక్కడ ఉన్నారు వారి సాధక బాధలు ఏంటి అన్నది పట్టించుకునే వారే లేరు అన్న విమర్శలు ఉన్నాయి. దాంతో పార్టీ ప్లీనరీని నిర్వహించి కొత్త కమిటీలు వేయాలి. అలాగే రాష్ట్ర స్థాయి దాకా కీలక పదవులకు నేతలను ఎన్నుకోవాలి. ఈ ఏడాది చివర్లో ప్లీనరీ నిర్వహిస్తారు అని ఆ మధ్యన ప్రచారం సాగింది. ఇపుడు చూస్తే ఆ అలికిడి అయితే లేదు. కానీ మంత్రివర్గ విస్తరణకు ప్లీనరీకి మధ్య లింక్ ఉందని అంటున్నారు.

సీనియర్ మంత్రులను తప్పించి పార్టీ బాధ్యతలు అప్పగించాలని వైసీపీ అధినాయకత్వం ఆలోచిస్తోంది అంటున్నారు. అదే నిజమైతే మంత్రి వర్గ విస్తరణకు ముందే వైసీపీ ప్లీనరీ జరిగే అవకాశం ఉంది అంటున్నారు. వైసీపీ ప్లీనరీ నిర్వహించి పార్టీకి ప్రభుత్వానికి మధ్య ఉన్న గ్యాప్ ని తొలగిస్తారు వచ్చే ఎన్నికలు సిద్ధం చేస్తారు అని పార్టీ నేతలు అంటున్నారు. అంటే సాధ్యమైనంత తొందరలోనే వైసీపీ ప్లీనరీ కూడా జరిగే అవకాశం ఉంది అనుకోవాలన్న మాట.