ఏ తేడా వచ్చినా.. ఇంటర్నెట్ కట్.. భారత్ లోనే అధికం

Thu Jul 07 2022 14:26:13 GMT+0530 (India Standard Time)

Whatever the difference is Internet cut is high in India

జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదుల దాడి జరిగినా.. దేశంలో ఎక్కడ అలజడులు రేగినా.. ఎక్కడ విధ్వంసాలు చోటుచేసుకున్నా.. ఆఖరికి రాజకీయ పార్టీల మధ్య ఘర్షణలు తలెత్తినా.. ముందుగా ఈ రోజుల్లో కట్ అయ్యేది ఇంటర్నెట్.. ఆ విధంగా చెప్పాలంటే ఇదో ‘‘డిజిటల్ ఎమర్జెన్సీ’’. పరిస్థితులే కానీ పరిణామాలే కానీ.. ఈ విధంగా చేయక తప్పడం లేదు. మనదగ్గరనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. కాకపోతే.. జనాభా విస్తీర్ణం రీత్యా భారత్ పెద్ద దేశం కాబట్టి తరచూ జరుగుతుంటుంది. కొన్ని సందర్భాల్లో ఇది తప్పనిసరి కాగా.. చాలాసార్లు అత్యవసరం కూడా.



ఏడాదికి 60 సార్లుపైనే..

665.. గత పదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ కట్ అయిన సందర్భాలు. అంటే ఏడాదికి 66 పైనే. అయితే ఇందులోనూ భారత్ టాప్ కావడం ఇక్కడ చెప్పుకోదగిన అంశం. అసలే ఇది ఇంటర్నెట్ యుగం. అందులోనూ సోషల్ మీడియా కాలం. అలాంటి సమయంలో ఇంటర్నెట్ కట్ అంటే అందరికీ అసౌకర్యమే. ఇది వివాదానికి కూడా దారి తీస్తోంది. ఇంటర్నెట్ షట్డౌన్లలో నాలుగేళ్లుగా ప్రపంచంలో భారతే టాప్ ప్లేస్లో ఉంది.! అగ్నిపథ్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అగ్గి రాజుకున్నా ప్రవక్తపై వ్యాఖ్యల కారణంగా రాజస్థాన్లో జరిగిన హత్యపై ఉద్రిక్తతలు తలెత్తినా
సాగు పౌరసత్వ సవరణ చట్టాలపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటినా... ప్రభుత్వం విధిగా తీసుకున్న తొలి చర్య ఇంటర్నెట్ షట్డౌనే.

ఇంటర్నెట్ లేకుండా అడుగు తీసి అడుగు ముందుకు వెయ్యలేని కాలమిది. ఏ ఉద్యమమైనా సోషల్ మీడియా వేదికలను వినియోగించుకునే వ్యూహాలు పన్నుతున్నారు. ఆ సాంకేతిక బాసట లేకుండా చేసేందుకు ప్రభుత్వాలు వెంటనే ఇంటర్నెట్ సర్వీసులను నిలిపేస్తున్నాయి. శాంతిభద్రతల కారణంతో ఒకప్పుడు కశ్మీర్కే పరిమితమైన ఈ ధోరణి ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్నిచోట్లకూ విస్తరించడం వివాదాస్పదమవుతోంది. కరోనా అనంతరం వర్క్ ఫ్రమ్ హోమ్ ఆన్లైన్ క్లాసులు డిజిటల్ పేమెంట్స్ పెరిగిపోయిన నేపథ్యంలో ఇంటర్నెట్ లేకుండా పూట గడవని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఉన్నట్టుండి నెట్ సర్వీసులు నిలిపివేస్తుండటంతో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎంతోమంది జీవనోపాధిపైనా దెబ్బ పడుతోంది.

భారత్ లో6 నెలల్లో 59 సార్లు

భారత్లో ఇంటర్నెట్ షట్డౌన్స్పై అధ్యయనం చేస్తున్న సాఫ్ట్వేర్ ఫ్రీడమ్ లా సెంటర్ (ఎస్ఎఫ్ఎల్సీ) ప్రకారం 2012 నుంచి ఇప్పటివరకు ఏకంగా 665సార్లు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. జూన్ నాటికి దేశంలో ఏకంగా 59 సార్లు నెట్ కనెక్షన్ కట్ అయింది! జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు సమయంలో విధించిన ఇంటర్నెట్ షట్డౌన్ దేశంలోనే అత్యంత
సుదీర్ఘమైనది. కశ్మీర్ ప్రజలు ఏకంగా 552 రోజుల పాటు నెట్ సౌకర్యానికి దూరమయ్యారు. తరచూ నెట్ను నిలిపేస్తున్న రాష్ట్రాల జాబితాలో కశ్మీర్ తర్వాత రాజస్తాన్ ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. చీటికీమాటికీ ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడం పౌరులకు రాజ్యాంగమిచ్చిన ప్రాథమిక హక్కులకు భంగకరమేనని ఇంటర్నెట్ ఫ్రీడం ఫౌండేషన్ (ఐఎఫ్ఎఫ్) అనే న్యాయవాదుల గ్రూపు వాదిస్తోంది.

దీనిపై ఈ సంస్థ పలుమార్లు కోర్టుకెక్కింది కూడా. ఇంటర్నెట్ సదుపాయముంటే విద్వేష ప్రసంగాలు తప్పుడు వార్తలు వ్యాప్తి చెందుతాయని ప్రభుత్వాలు భావిస్తున్నాయే తప్ప అది ఉంటే వారు వాస్తవాలు తెలుసుకునే అవకాశమూ ఉంటుందని ఆలోచించలేకపోతోందన్నది దాని వాదన.  సామాజిక మాధ్యమాల వాడకం బాగా పెరిగిన నేపథ్యంలో తప్పుడు సమాచారం వదంతులు వాటి ద్వారా విపరీతంగా వ్యాప్తి చెందుతున్నాయన్నది ప్రభుత్వాల వాదన. ఉద్రిక్త పరిస్థితులకు ఇవి ఆజ్యం పోస్తాయి కాబట్టే నెట్ కట్ చేస్తున్నట్టు అవి చెబుతున్నాయి. ప్రజల భద్రత దృష్ట్యా టెలికాం నిబంధనల ప్రకారం ఇంటర్నెట్ సేవల్ని తాత్కాలికంగా నిలిపేసే అధికారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. ప్రమాదకర పరిస్థితులు తలెత్తినప్పుడు నెట్ సేవలను నిలిపేసే అధికారం 2017 దాకా సీఆర్పీసీ సెక్షన్ 144 ప్రకారం జిల్లా జడ్జిలకు ఉండేది. ఇంటర్నెట్ సేవలు ఆపేయడం తప్పనిసరైతే మధ్యేమార్గంగా వదంతులను వ్యాప్తి చేసే ఫేస్బుక్ వాట్సాప్ ట్విటర్ వంటి సోషల్ ప్లాట్ఫారంలను ఆపేసి మిగతావి కొనసాగించాలని నిపుణులు సూచిస్తున్నారు.  

డబ్బు కూడా నష్టమే..

ఇంటర్నెట్ షట్డౌన్లు దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావమే చూపుతున్నాయి. 2019లో 4 వేల గంటల పాటు దేశంలో నెట్ సేవలు ఆగిపోవడంతో 130 కోట్ల డాలర్లకు పైగా నష్టం కలిగిందన్నది ప్రపంచ బ్యాంకు అంచనా. ఇంటర్నెట్ లేక తాను పత్రికను ప్రింట్ చేసుకోలేకపోతున్నానని మరెందరో జీవనోపాధి కోల్పోతున్నారని కశ్మీర్కు చెందిన అనూరాధా భాసిన్ అనే
జర్నలిస్టు సుప్రీంకోర్టుకెక్కారు. నిరవధికంగా ఇంటర్నెట్ సేవలు నిలిపేయడం ఆమోదయోగ్యం కాదని ఆమె పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు పేర్కొంది.