Begin typing your search above and press return to search.

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఈటెల సాధించేదేమిటి..?

By:  Tupaki Desk   |   8 Dec 2021 10:37 AM GMT
ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఈటెల సాధించేదేమిటి..?
X
తెలంగాణ‌లోని స్థానిక సంస్థ‌ల కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు డిసెంబ‌రు 10న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. 14న ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయి. మంగ‌ళ‌వారం సాయంత్రంతో ప్ర‌చారం ముగిసింది. ఈ రెండు రోజుల్లో అభ్య‌ర్థుల‌ను ఎవ‌రు ఏ మేర‌కు మేనేజ్ చేస్తారో ఆ పార్టీయే విజ‌యం సాధించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

ఈ వ‌రుస‌లో అంద‌రికంటే ముందుగా అధికార పార్టీ ఉంది. త‌న అంగ బ‌లం, ధ‌న బ‌లంతో ఓట‌ర్ల‌ను క్యాంపులు పెట్టి కాపాడుకుంటోంది. ఏదైనా అద్భుతం జ‌రిగితే త‌ప్ప టీఆర్ఎస్ ఓట‌ర్లు ఇత‌ర పార్టీల‌కు క్రాస్ ఓటు వేసే అవ‌కాశం లేదు.

మ‌రి ఇలాంటి ప‌రిస్థితుల్లో ఈటెల ఏం చేయ‌బోతున్నాడు..? త‌న వ్యూహం ఏమిటి? అనే అంశాలు చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. ఈటెల రాజేంద‌ర్ ముఖ్యంగా క‌రీంన‌గ‌ర్, ఆదిలాబాద్‌ జిల్లాల‌ ఎమ్మెల్సీల‌పై దృష్టి సారించిన‌ట్లు తెలుస్తోంది.

టీఆర్ఎస్ త‌ర‌పున ఆదిలాబాద్ నుంచి దండె విఠ‌ల్‌, క‌రీంన‌గ‌ర్ నుంచి ఎల్‌.ర‌మ‌ణ‌, టి.భానుప్ర‌సాద‌రావు బ‌రిలో నిలిచారు. ఈ రెండు జిల్లాల్లో మూడొంతుల స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు టీఆర్ఎస్ పార్టీ వారే ఉన్నారు.

వీరంద‌రినీ పార్టీకి చెందిన సీనియ‌ర్ మంత్రులు, నాయ‌కుల ఆధ్వ‌ర్యంలో క్యాంపుల్లోకి త‌ర‌లించింది. వారంద‌రినీ కంటికి రెప్ప‌లా కాపాడుకుంటోంది. పోలింగ్ రోజు డిసెంబ‌రు 10వ తేదీనే ఓట‌ర్ల‌ను పోలింగ్ కేంద్రాల‌కు త‌ర‌లించ‌నుంది. మ‌రి ఇలాంటి సంద‌ర్భంలో ఇత‌ర పార్టీల‌కు స్పేస్ ఎక్క‌డుందని టీఆర్ఎస్ వ‌ర్గాలు భావిస్తున్నాయి.

ఇదిలా ఉంటే టీఆర్ఎస్ త‌ర‌పున టికెట్ ఆశించి భంగ‌ప‌డిన క‌రీంన‌గ‌ర్ మాజీ మేయ‌ర్ స‌ర్దార్ ర‌వీంద‌ర్‌సింగ్ స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీలో నిలిచారు. టీఆర్ఎస్‌కు ఎలాగైనా షాక్ ఇవ్వాల‌ని భావిస్తున్న ఈటెల రాజేంద‌ర్ ర‌వీంద‌ర్‌సింగ్‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. పార్టీల‌కు అతీతంగా ఓట‌ర్ల‌ను అభ్య‌ర్థిస్తున్నారు.

కాంగ్రెస్‌, బీజేపీ ఓట‌ర్ల మ‌ద్ద‌తు కూడా కూడ‌గ‌డుతున్నారు. ముఖ్యంగా టీఆర్ఎస్‌లో ఉన్న అసంతృప్త ఓట‌ర్ల‌ను త‌న‌వైపు తిప్ప‌కునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈటెల వ్య‌వ‌హారం అధికార పార్టీలో ఒకింత అల‌జ‌డి సృష్టించేలా ఉంది.

ముఖ్యంగా ఎల్‌.ర‌మ‌ణ‌పై పెద్ద‌గా వ్య‌తిరేక‌త లేన‌ప్ప‌టికీ భానుప్ర‌సాద‌రావును రెన్యువ‌ల్ చేయ‌డ‌మే పార్టీ శ్రేణుల్లో అసంతృప్తికి కారణంగా తెలుస్తోంది. దీన్ని అందిపుచ్చుకోవాల‌ని ఈటెల భావిస్తుండ‌గా.. క్యాంపులు పెట్టి త‌మ అభ్య‌ర్థిని గెలిపించుకోవాల‌ని టీఆర్ఎస్ ప్రయ‌త్నిస్తోంది.

ఇలా ఎవ‌రి వ్యూహాల‌కు వారు ప‌దును పెడుతుండ‌టంతో ఎమ్మెల్సీ ఎన్నిక‌లు హీటెక్కాయి. చివ‌రి రోజుల్లో ఓట‌ర్ల కోసం ఏయే పార్టీలు ఎలాంటి పాచిక‌లు వేస్తాయో.. ఓట‌ర్లు చేజార‌కుండా ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకుంటాయోన‌ని చ‌ర్చ జ‌రుగుతోంది.

హుజూరాబాద్‌ ఎన్నిక‌ల త‌ర‌హాలో అధికార పార్టీకి షాక్ ఇస్తారా..? అధికార పార్టీ ఓట‌ర్లు విధేయ‌త చూపిస్తారా..? క్యాంపుల్లో ఎంజాయ్ చేసి వ‌చ్చిన ఓట‌ర్లు పార్టీని ధిక్క‌రించి క్రాస్ ఓటింగ్ వేయ‌గ‌ల‌రా..? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఈటెల మాత్రం అధికార పార్టీని క‌చ్చితంగా ఓడిస్తామ‌ని చెబుతుండ‌గా.. ఆయ‌న‌వ‌న్నీ దింపుడు క‌ళ్లెం ఆశ‌లేన‌ని.. బ్ర‌హ్మాండ‌మైన మెజారిటీతో త‌మ అభ్య‌ర్థులు గెలుస్తార‌ని టీఆర్ఎస్ నేత‌లు ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. వీట‌న్నింటికీ స‌మాధానాలు తేలాలంటే 14 తేదీ వ‌ర‌కు వేచి చూడాలి.