Begin typing your search above and press return to search.

జనసేనాని పోటీ నుంచి తప్పుకోవడం వెనుక వ్యూహం ఏంటి?

By:  Tupaki Desk   |   22 Nov 2020 1:30 PM GMT
జనసేనాని పోటీ నుంచి తప్పుకోవడం వెనుక వ్యూహం ఏంటి?
X
అమరావతి సాక్షిగా తెలంగాణలోని గ్రేటర్ ఎన్నికల్లో పోటీచేస్తానని పవన్ కళ్యాన్ ప్రకటించారు. అనంతరం బీజేపీ అగ్రనేతలు కిషన్ రెడ్డి, లక్ష్మన్ లు కలవగానే భేషరతుగా తన మాటను ఉపసంహరించుకొని బీజేపీకి మద్దతు పలికారు. అయితే పవన్ పోటీచేసినా పెద్దగా ఉపయోగం లేదని బీజేపీలోని ఒక వర్గం భావిస్తోందా? ముఖ్యంగా బండి సంజయ్ తాజాగా కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లతో పవన్ వద్దకు రాకపోవడానికి కారణం ఏంటి? అసలు పవన్ ను బండి పట్టించుకోవడం లేదా అన్న వాదన ఇప్పుడు రాజకీయవర్గాల్లో సాగుతోంది.

బీజేపీతో జీహెచ్ఎంసీ ఎన్నికలలో కలిసి పోటీచేయాలని జనసేనాని పవన్ ఆరాటపడినా తెలంగాణలో బండి సంజయ్ వర్గం అంత ఆసక్తి చూపించలేదని తెలుస్తోంది. ఇక సీనియర్లు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ వెళ్లి పవన్ తో భేటి అయినా బండి మాత్రం ఆ భేటికి రాలేదు. పవన్ అమరావతిలో పోటీకి ప్రకటన చేయగానే బండి సైతం స్పందించారు.

బండి సంజయ్ తెలంగాణలో భిన్నమైన ప్రకటన చేశారు. తాను పవన్ కళ్యాణ్ తో భేటి కావడం లేదని.. పొత్తు లేదని స్పష్టతనిచ్చారు.తమ పార్టీ అభ్యర్థుల లిస్ట్ ఇప్పటికే ఖరారయ్యిందని తెలిపారు. తమ దగ్గరకు జనసేన ఎలాంటి ప్రతిపాదన తేలేదని చెప్పారు. పవన్ మీద తమకు గౌరవం ఉందని స్పష్టం చేశారు. అలా పవన్ కళ్యాణ్ తో పొత్తుకు కొత్త అధ్యక్షుడు బండి సంజయ్ ఆసక్తిగా లేడన్న విషయం అప్పుడే తేటతెల్లమైంది.

పరస్పర భిన్నమైన ప్రకటనల నేపథ్యంలో బీజేపీ-జనసేన పొత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. కానీ సీనియర్ల ప్రవేశంతో ప్రస్తుతానికి జనసేనాని ఎగ్జిట్ అయ్యి బీజేపీకి మద్దతు ప్రకటించారు. ఏపీలో ఘోరంగా ఓడిపోయిన జనసేనాని పవన్ ను తెలంగాణ బీజేపీలోని యువ వర్గం అస్సలు పట్టించుకోవడం లేదన్న టాక్ ఇప్పుడు రాజకీయవర్గాల్లో సాగుతోంది.