Begin typing your search above and press return to search.

లీటరు పెట్రోల్ పై రూపాయి ఎక్సైజ్ సుంకం పెంచితే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎంతంటే?

By:  Tupaki Desk   |   25 Jan 2021 5:00 AM GMT
లీటరు పెట్రోల్ పై రూపాయి ఎక్సైజ్ సుంకం పెంచితే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎంతంటే?
X
ఆకాశమే హద్దు అన్నట్లుగా అంతకంతకూ పెరిగిపోతున్న పెట్రోల్.. డీజిల్ ధరలతో సామాన్యుల గుండెలే కాదు.. మధ్యతరగతి.. ఎగువ మధ్యతరగతి జీవులు సైతం అదిరిపోతున్నారు. రికార్డు స్థాయికి చేరిన ఈ ధరల పెరుగుదల తీరు చూస్తే.. అతి త్వరలోనే లీటరు పెట్రోల్ రూ.వందకు చేరుకోవటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. చూస్తుండగానే.. అంతకంతకూ పెరిగిపోతున్న పెట్రోల్.. డీజిల్ ధరలపై సామాన్యుల ఆందోళన పెరుగుతోంది.

మొన్నటివరకు పెరిగే పెట్రోల్.. డీజిల్ ధరలపై పెద్దగా వ్యతిరేకత వ్యక్తం కాకున్నా.. లీటరు పెట్రోల్ రూ.తొంభైకి టచ్ కావటంతో ఆందోళన పెరుగుతోంది.
ఇదిలా ఉండగా.. పెట్రోల్.. డీజిల్ పై పన్ను భారం భారీగా ఉంది. వీటిపై వడ్డించే పన్నుల్లో ఎక్సైజ్ సుంకం ఎంత భారీగా ఉందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. లీటరు పెట్రోల్ పై ఎక్సైజ్ సుంకం రూ.32.98 ఉండగా.. లీటరు డీజిల్ పై రూ.31.83గా ఉంది. అంతేకాదు.. ఎక్సైజ్ సుంకం రూపాయి పెరిగితే.. ప్రభుత్వ ఖజానాకు ఏకంగా రూ.14,500 కోట్ల ఆదాయం వస్తుందని లెక్కలు చెబుతున్నారు.

లాక్ డౌన్ కారణంగా రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలపైన దెబ్బ పడింది. దీన్ని పూడ్చుకోవటానికి వీలుగా పెట్రోల్.. డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచారు. ఈ పెంపు ఇప్పుడు ఎంత గరిష్ఠంగా మారిందంటే.. పెట్రోల్..డీజిల్ ధరల్లో ఎక్సైజ్ సుంకమే భారీగా మారింది. దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధరలో ఎక్సైజ్ సుంకం వాటా 62 శాతంగా ఉంటే.. డీజిల్ లో ఇది 57 శాతంగా ఉంది.

అంటే.. మనం కొనుగోలు చేసే లీటరు పెట్రోల్.. డీజిల్ ధరలో అత్యధిక భాగం ఈ ఎక్సైజ్ సుంకమే ఉందన్న మాట. దీన్ని తగ్గిస్తే తప్పించి.. ప్రజల మీద భారం తగ్గని పరిస్థితి.అదే పనిగా బాదేస్తున్న నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తే తప్పించి పెట్రోల్.. డీజిల్ ధరలు తగ్గని పరిస్థితి. మోడీ మాష్టారు ఇప్పటికైనా కరుణిస్తారంటారా?