Begin typing your search above and press return to search.

పూత‌ల‌ప‌ట్టు వైసీపీలో ప‌రేషాన్‌.. రీజ‌నేంటి..?

By:  Tupaki Desk   |   20 July 2021 8:12 AM GMT
పూత‌ల‌ప‌ట్టు వైసీపీలో ప‌రేషాన్‌.. రీజ‌నేంటి..?
X
చిత్తూరు జిల్లాలోని ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం పూత‌ల‌ప‌ట్టులో వైసీపీ కేడ‌ర్ తీవ్ర గంద‌రగోళంలో చిక్కుకుంది. ఇక్క‌డ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన ఎం.ఎస్‌. బాబు నియోజ‌క‌వ‌ర్గంలో ఉండ‌క‌పోవ‌డంతోపాటు.. ఆయ‌న పెద్ద‌గా యాక్టివ్‌గా కూడా లేక‌పోవ‌డంతో కేడ‌ర్ దెబ్బ‌తింటోంద‌నే వాద‌న వినిపిస్తోంది. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు 2014లో ఇక్క‌డ నుంచి సునీల్ గెలుపొందారు.అయితే.. మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి క‌నుస‌న్న‌ల్లో న‌డిచే ఈ నియోజ‌క‌వ‌ర్గం రాజ‌కీయాల్లో సునీల్‌కు పెద్దిరెడ్డికి మ‌ద్య విభేదాలు చోటు చేసుకున్నాయి. పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు సునీల్ పెద్దిరెడ్డినే ఢీ కొట్టారు. దీంతో గ‌త ఎన్నిక‌ల్లో ఎంత‌గా ప్ర‌య‌త్నించినా.. సునీల్‌కు టికెట్ ద‌క్క‌లేదు. పైగా సునీల్ తాను చ‌నిపోతానంటూ అప్ప‌ట్లో రిలీజ్ చేసిన ఫేస్ బుక్ వీడియో కూడా పెద్ద సంచ‌ల‌నం అయ్యింది.

పైగా నాన్‌లోక‌ల్ అయిన‌..ఎం.ఎస్‌.బాబుకు ఇక్క‌డ టికెట్ ఇచ్చారు. నాన్‌లోక‌ల్‌తోపాటు.. కేవ‌లం 7వ త‌ర‌గ‌తి డ్రాప‌వుట్ అయిన బాబు.. ఎమ్మెల్యేగా ప్ర‌మాణ స్వీకార స‌మ‌యంలోనే త‌డ‌బ‌డి.. న‌వ్వుల పాల‌య్యారు. ఇక‌, ఆ త‌ర్వాత‌.. పార్టీ పరంగా అయినా పుంజుకుంటారులే అనుకుంటే.. మొత్తం ఇక్క‌డి కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌స్తుతం మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డికే వ‌దిలేసి.. త‌న బిల్డ‌ర్ వ్యాపారం స‌హా.. రియ‌ల్ ఎస్టేట్ బిజినెస్‌లో బాబు బిజీ అయ్యార‌న్న టాక్ వినిపిస్తోంది. దీంతో నియోజ‌క‌వ‌ర్గానికి కూడా చుట్ట‌పు చూపుగానే వ‌స్తున్నారు. ఫ‌లితంగా పార్టీ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టేవారు క‌రువ‌య్యారు. ఎప్పుడైనా మంత్రి పెద్దిరెడ్డి వ‌స్తేనే ఆయ‌న వెంట బాబు వ‌స్తున్నారు.

దీంతో వైసీపీలో నిరాశ పెల్లుబుకుతోంది. ఏదైనా అంటే.. అంతా వ‌లంటీర్లు చూసుకుంటార‌ని, ఏదైనా ఉంటే.. వారికే చెప్పాల‌ని బాబు నిర్మొహ‌మాటంగా చెబుతున్నారట‌. దీంతో శ్రేణులు మాన‌సికంగా కుంగిపోతున్నారు. ఇక నియోజ‌క‌వ‌ర్గంలో ద్వితీయ శ్రేణి నాయ‌క‌త్వం సైతం ఏదైనా పెద్ద ప‌ని ఉంటే ఎమ్మెల్యే బాబును కాకుండా.. మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డికే చెప్పుకోవాల్సిన ప‌రిస్థితి ఉంది. వారు కూడా ఆ ఎమ్మెల్యేకు చెప్పినా ప‌ని కాదు... నేరుగా మంత్రి పెద్దిరెడ్డినే క‌లుద్దాం.. అక్క‌డ అయితేనే ప‌ని అవుతుంద‌ని నిర్ణ‌యించే సుకుంటున్నారు.

మ‌రోవైపు.. టీడీపీ పుంజుకుంటే క‌నుక‌.. వైసీపీ శ్రేణులు అటు చూసే అవ‌కాశం ఉంది. అయితే.. ఆ ప‌రిస్థితి లేక‌పోవ‌డం స‌హా వైసీపీ పుంజుకోని ప‌రిస్థితి నెల‌కొన‌డంతో కేడ‌ర్‌కు ఇప్పుడు ఏం చేయాల‌నే విష‌యంపై సందిగ్ధ‌త నెల‌కొంది. ఇప్ప‌టికైనా బాబు నియోజ‌క‌వ‌ర్గాన్ని ప‌ట్టించుకోవాల‌నేది , వారి స‌మ‌స్య‌లు వినాల‌నేది ఇక్క‌డి వైసీపీ కేడ‌ర్ టాక్‌. మ‌రి ఆయ‌న ఏం చేస్తారో చూడాలి.