Begin typing your search above and press return to search.

కృష్ణంరాజు భవిష్యత్తు వ్యూహం ఏమిటి ?

By:  Tupaki Desk   |   18 Oct 2020 9:30 AM GMT
కృష్ణంరాజు భవిష్యత్తు వ్యూహం ఏమిటి ?
X
పార్లమెంటు సబార్జినేట్ స్టాండింగ్ కమిటి ఛైర్మన్ గా వేటు పడగానే నరసాపురం వైసీపీ ఎంపి కనుమూరు రఘురామ కృష్ణంరాజు భవిష్యత్తుపై అందరిలోను ఊహాగానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే కమిటి ఛైర్మన్ గా వేటు పడిన తర్వాత ఇక మిగిలింది ఎంపి గా అనర్హత వేటు పడటమే అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తన ఛైర్మన్ పదవీ కాలం మొన్నటి 9వ తేదీనే అయిపోయిందని కృష్ణంరాజు చెప్పుకుంటున్నా ఛైర్మన్ పదవి నుండి తొలగించమని జగన్మోహన్ రెడ్డి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాయటం వాస్తవం. ఇదే లేఖలో ఎంపిపై అనర్హత వేటు వేయాలని అడగటం కూడా వాస్తవమే.

సరే ఎంపిపై అనర్హత వేటు ఎప్పుడేస్తారో తెలీకపోయినా ఆ ముచ్చట కూడా తొందరలోనే జరిగిపోతుందని పార్టీలో ప్రచారం మొదలైపోయింది. ఇందుకనే అనర్హత వేటు పడిన తర్వాత కృష్ణంరాజు ఏమి చేస్తారు ? అనే విషయమై ఊహాగానాలు మొదలయ్యాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తనపై అనర్హత వేటు పడటం ఖాయమని ఎంపికి కూడా తెలుసు. అందుకనే తనపై అనర్హత వేటు పడితే మళ్ళీ పోటి చేసి బంపర్ మెజారిటితో గెలుస్తానని ఆమధ్య వైసీపీ నేతలతో చాలెంజ్ చేశారు. తనపై జగన్ పోటీ చేసినా తనకు 2 లక్షల ఓట్ల మెజారిటి ఖాయమంటున్నారు.

ఒకవేళ ఉపఎన్నికలంటు వస్తే నరసాపురం నియోజకవర్గంలో కృష్ణంరాజు ఏ పద్దతిలో పోటీ చేస్తారనే విషయంలో నియోజకవర్గంలో కూడా చర్చలు జరుగుతున్నాయట. ఇక్కడే రెండు ఆప్షన్లున్నట్లు సమాచారం. మొదటిదేమో ఏదో ఓ పార్టీ తరపున అభ్యర్ధిగా పోటి చేయటం. ఇక రెండో ఆప్షన్ ఏమిటంటే ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్ధిగా ఇండిపెండెంట్ గా బరిలోకి దిగటం. మొదటి ఆప్షన్ను గమనిస్తే అధికార వైసీపీని గట్టిగా ఢీకొనే స్ధాయిలో ప్రతిపక్షాలు ఉన్నాయా ? అన్నదే అసలైన డౌట్. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్ధులు ఓడిపోయిన విషయం అందరికీ తెలిసిందే.

ఇదే సమయంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ మరింత బలపడిందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలో మళ్ళీ ఏదో ఓ పార్టీ తరపున పోటీ చేస్తే గెలుపు కష్టమే. ఎందుకంటే పోటీదారులు ఎక్కువైపోతారు. టీడీపీ తరపున పోటి చేస్తే బీజేపీ+జనసేన తరపున ఒక అభ్యర్ధి, కాంగ్రెస్ తరపున మరో అభ్యర్ధి ఉంటారు. పోనీ బీజేపీ, జనసేన మిత్రపక్షాల తరపున అభ్యర్ధిగా రంగంలోకి దిగినా ఇష్టం ఉన్నా లేకపోయినా టీడీపీ కూడా అభ్యర్ధిని పోటిలోకి దింపాల్సుంటుంది. ఏ కారణం వల్ల టీడీపీ పోటీ చేయకపోయినా వచ్చే ఆరోపణలకు సమాధానం చెప్పుకోవాల్సుంటుంది. ఆరోపణలను పక్కనపెట్టేసినా జనాల ముందు పలుచనైపోవటం ఖాయం.

ఇక రెండో ఆప్షన్ చూస్తే ఏ రాజకీయ పార్టీ తరపున పోటీ చేయకుండా కృష్ణంరాజు స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తాను ఇండిపెండెంట్ గా పోటి చేసి ప్రతిపక్షాల మద్దతు తీసుకునే అవకాశాలున్నట్లు సమాచారం. దీనికి టీడీపీ రెడీ అన్నా బీజేపీ కలసివస్తుందా ? అన్నదే డౌట్. కాంగ్రెస్, వామపక్షాలను కన్వీన్స్ చేసుకోవటం కృష్ణంరాజు బాధ్యత. కాబట్టి ఉన్న రెండు ఆప్షన్లలో రెండోదానిపైనే కృష్ణంరాజు మొగ్గుచూపే అవకాశాలున్నట్లు ప్రచారం ఊపందుకుంటోంది. ప్రతిపక్షాలన్నీ తనకు మద్దతు ఇస్తాయన్న నమ్మకంతోనే ఉపఎన్నికల్లో తన గెలుపు ఖాయమని కృష్ణంరాజు అంత గట్టి నమ్మకంతో ఉన్నారని అనిపిస్తోంది. చూద్దాం ఏం జరుగుతుందో.