ఆర్ఆర్ఆర్ పరిస్థితి ఏంటి.. ఏ పార్టీ నుంచి పోటీ?

Fri Mar 17 2023 21:00:01 GMT+0530 (India Standard Time)

What is the condition of RRR.. Contest from which party?

వైసీపీ అధిష్టానానికి నిత్యం చుక్కలు చూపిస్తున్నారు.. ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు. 2019 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచి వైసీపీ ఎంపీగా గెలిచిన రఘురామ ఆ తర్వాత కొద్ది కాలానికే పార్టీకి దూరమయ్యారు. అధిష్టానం నిర్ణయాలు నచ్చని ఆయన వైసీపీకి దూరమయ్యారు. నిత్యం సోషల్ మీడియాలో యూట్యూబ్ చానెళ్లలోనూ టీవీ చానెళ్లలోనూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రఘురామపై రాజద్రోహం నేరం మోపిన వైసీపీ ప్రభుత్వం ఆయనను అరెస్టు చేయించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా విచారణలో సీఐడీ అధికారులు తనను కొట్టారని రఘురామ ఆరోపించడం కలకలం రేపింది.



మరోవైపు 2024 ఎన్నికల్లో రఘురామకృష్ణరాజు నరసాపురం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఎంపీ బరిలో ఉంటారని చెబుతున్నారు. ఉభయగోదావరి విశాఖపట్నం వంటి జిల్లాల్లో అత్యధికంగా ఉన్న క్షత్రియ సామాజికవర్గంలో మంచి పట్టు ఉన్న నేతగా రఘురామకు పేరుంది. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం రఘురామతో వ్యవహరించిన తీరుతో క్షత్రియ సామాజికవర్గం వైసీపీపై గుర్రుగా ఉందని టాక్ నడుస్తోంది.

ఈ నేపథ్యంలో క్షత్రియ సామాజికవర్గం వైసీపీకి ఈసారి షాక్ ఇవ్వడం ఖాయమని అంటున్నారు. మరోవైపు టీడీపీ–జనసేన పొత్తు కూడా దాదాపు ఖాయమైంది. తాజాగా బందరులో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ మేరకు జనసేనాని పవన్ కల్యాణ్ సంకేతాలు కూడా ఇచ్చారు. టీడీపీ–జనసేన పొత్తు కుదిరితే నరసాపురం నుంచి రఘురామ ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన ఘనవిజయం సాధించడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. అలా కాకుండా గత ఎన్నికల్లో పోటీ చేసినట్టు జనసేన టీడీపీ వైసీపీ ఇలా వేర్వేరుగా పోటీ చేస్తే రఘురామకు గట్టి పోటీ తప్పకపోవచ్చని అంటున్నారు.

మరోవైపు జనసేన–టీడీపీ పొత్తు కుదిరే అవకాశం పుష్కలంగా కనిపిస్తున్న నేపథ్యంలో నరసాపురం నుంచి జనసేనాని పవన్ సోదరుడు నాగబాబు పోటీ చేస్తారని అంటున్నారు. అందులోనూ నరసాపురం ఎంపీ స్థానంలో టీడీపీ ఎక్కువసార్లు గెలిచిన సందర్భాలు లేవు. చివరిసారి 1996లో మాత్రమే టీడీపీ నరసాపురం లోక్ సభా నియోజకవర్గంలో గెలిచింది. 2014లో టీడీపీ –బీజేపీ పొత్తులో భాగంగా బీజేపీ అభ్యర్థి గోకరాజు గంగరాజు గెలిచారు. 2004 2009ల్లో కాంగ్రెస్ అభ్యర్థులు హరిరామజోగయ్య కనుమూరి బాపిరాజు ఎంపీలుగా గెలుపొందారు. 1999లో బీజేపీ అభ్యర్థి కృష్ణంరాజు గెలిచారు.

నరసాపురం ఎంపీ స్థానంలో టీడీపీ ట్రాక్ రికార్డు అంత బాగా లేని నేపథ్యంలో రఘురామకృష్ణరాజు భీమవరం లేదా నరసాపురం స్థానాల నుంచి టీడీపీ తరఫున అసెంబ్లీకి పోటీ చేయొచ్చని చెబుతున్నారు. నరసాపురం అసెంబ్లీ సీటును పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించాల్సి ఉంటుందని అంటున్నారు. ఇక్కడ నుంచి జనసేన నేత మత్స్యకార సామాజికవర్గానికి చెందిన బొమ్మిడి నాయకర్ పోటీ చేయొచ్చని టాక్ నడుస్తోంది. అప్పుడు ఇక రఘురామకృష్ణరాజు భీమవరం నుంచి అసెంబ్లీకి పోటీ చేయొచ్చని చెబుతున్నారు. తర్వాత టీడీపీ–జనసేన ప్రభుత్వం వస్తే మంత్రి కావాలనేది రఘురామరాజు లక్ష్యమని అంటున్నారు. టీడీపీ–జనసేన పొత్తు కుదిరితే రఘురామ అసెంబ్లీ పార్లమెంటు దేనికి పోటీ చేసినా సులువుగా గెలుస్తారని చెబుతున్నారు. మరి ఆయన అసెంబ్లీకి పోటీ చేస్తారా లేదంటే పార్లమెంటుకు పోటీ చేస్తారా అనేది మరికొద్ది రోజుల్లోనే తేలనుంది.

అయితే క్షత్రియ సామాజికవర్గంలో రఘురామకృష్ణరాజుకు మంచి పట్టు ఉంది. వైసీపీ ప్రభుత్వం ఆయనతో వ్యవహరించిన తీరు పట్ల ఆ సామాజికవర్గం వైసీపీపై అసంతృప్తిగా ఉందని అంటున్నారు.

ఈ నేపథ్యంలో క్షత్రియ సామాజికవర్గానికే చెందిన ముదునూరి ప్రసాదరాజును ప్రభుత్వ చీఫ్ విప్ గా జగన్ నియమించారు. ప్రభుత్వ చీఫ్ విప్ కు కేబినెట్ మంత్రి హోదా ఉంటుంది. ఇలా కొంతవరకు ఆ సామాజికవర్గంలో అసంతృప్తిని తగ్గించుకునే ప్రయత్నం చేశారని అంటున్నారు.

 అయితే రఘురామకృష్ణరాజు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే పార్టీలకతీతంగా ఆయనపై సానుభూతి చూపించవచ్చనే చర్చ నడుస్తోంది. టీడీపీ తరఫున పోటీ చేస్తే సెంటిమెంటు రీత్యా గెలుపుపై కొంత అనుమానాలు ఉంటాయని అంటున్నారు. అదే ఇండిపెండెంట్ గా అయితే తటస్తులు వైసీపీ మినహా అన్ని పార్టీల వాళ్లు రఘురామకృష్ణరాజుకు ఓట్లేయొచ్చని చెబుతున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.