Begin typing your search above and press return to search.

రెమ్ డెసివిర్ ఏమో కానీ.. చేతికి వచ్చేసరికి కరోనా వచ్చేట్లుందిగా?

By:  Tupaki Desk   |   20 April 2021 4:30 AM GMT
రెమ్ డెసివిర్ ఏమో కానీ.. చేతికి వచ్చేసరికి కరోనా వచ్చేట్లుందిగా?
X
కుకట్ పల్లిలోని వై జంక్షన్ వద్ద.. రోడ్డు మీద పెద్ద ఎత్తున జనాలు కనిపిస్తారు. పొద్దున మొదలు సాయంత్రం వరకు.. ఎండ మండుతున్నా.. లెక్క చేయకుండా.. ఓపిగ్గా ఎదురుచూస్తుంటారు. వందల కొద్దీ జనాలతో రద్దీగా ఉండే అక్కడున్న ప్రతి ఒక్కరి ముఖంలో ఆందోళన.. భయం కనిపిస్తూ ఉంటాయి. మరెక్కడా కనిపించనంత జాగ్రత్త అక్కడున్న వారందరిలో కనిపిస్తుంది. కారణం.. వారంతా కరోనా బాధిత కుటుంబాలకు చెందిన వారు. తమ వారిలో రోగ తీవ్రత ఎక్కువగా ఉండి.. ఏదో రకంగా రెమ్ డెసివర్ ఇంజెక్షన్లను సొంతం చేసుకోవాలన్న తపన వారిలో కనిపిస్తుంటుంది.

హైదరాబాద్ మహానగరంలో కరోనా తీవ్రత ఎంత ఎక్కువగా ఉందన్న విషయాన్ని తెలుసుకోవాలంటే.. మరెక్కడో కాదు..కుకట్ పల్లిలోని హెటెరో డ్రగ్స్ కేంద్రం వద్ద బారులు తీరిన జనాన్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. డాక్టర్ రాసిన ప్రిస్కిప్షన్ తో పాటు.. సదరు రోగి ఆధార్ తో పాటు ఇతర ధ్రువ పత్రాలతో అక్కడ క్యూలో నిలుచుంటే.. రెమ్ డెసివర్ దొరికే అవకాశం ఉంది.

కరోనా వైరస్ లోడ్ ఎక్కువగా ఉండే వారికి.. ఉపకరిస్తుందని చెప్పే రెమ్ డెసివర్ కు భారీ కొరత ఉన్న విషయం తెలిసిందే. కార్పొరేట్ ఆసుపత్రుల్లో లభించే ఈ ఇంజక్షన్.. మిగిలిన చోట్ల దొరకదు. దీంతో.. ప్రభుత్వం సదరు కంపెనీ చేత ఒక ఔట్ లెట్ ను ఏర్పాటు చేసింది. బ్లాక్ మార్కెట్ లో ఒక్కో ఇంజెక్షన్ 20వేల వరకు పలికితే.. ఈ కేంద్రంలో మూడున్నర వేలకు దొరుకుతుంది. దీంతో.. భారీ ఎత్తున బాధితులు.. ఈ ఇంజెక్షన్ కోసంఇక్కడ పడిగాపులు కాస్తున్నారు. అయితే.. స్టాక్ లేదన్న మాటతో.. రోజులో ఏదో ఒక సమయంలో దీన్ని ఇస్తున్నారు. దీంతో.. ఇంజెక్షన్ స్టాక్ వచ్చే వరకు అక్కడ వెయిటింగ్ తప్పదు. ఇక్కడున్న రద్దీ చూసినప్పుడు.. కరోనా ఎక్కడ తగులుకుంటుందో అన్న భయాందోళనలు వ్యక్తమవుతాయి.