Begin typing your search above and press return to search.

ఏపీలో ఎమ్మెల్యేలు ఏమై పోయారు? నెటిజ‌న్ల రుస‌రుస‌లు

By:  Tupaki Desk   |   4 Jun 2021 12:30 PM GMT
ఏపీలో ఎమ్మెల్యేలు ఏమై పోయారు?  నెటిజ‌న్ల రుస‌రుస‌లు
X
``మీకు ఏ క‌ష్ట‌మొచ్చినా మేమున్నాం. మేం అన్ని చ‌ర్య‌లు తీసుకుంటాం``-ఇదీ.. ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసీపీ నాయ‌కులు ఇచ్చిన హామీ. ఈ హామీలు న‌మ్మారో.. లేక మార్పు కోరుకున్నారో.. ప్ర‌జ‌లు వైసీపీ నేత‌ల‌కు ప‌ట్టం క‌ట్టారు. అయితే.. ఇప్పుడు క‌రోనా క‌ష్ట కాలంలో మాత్రం ఒక‌రిద్ద‌రు ఎమ్మెల్యేలు త‌ప్ప ఏ ఒక్క‌రూ ప్ర‌జ‌ల‌కు అందుబాటులో లేకుండా పోయారు. చిత్తూరు జిల్లాలో తిరుప‌తి ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి, చంద్ర‌గిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర రెడ్డి త‌ప్ప‌.. ఎవ‌రూ కూడా ప్ర‌జ‌ల‌కు క‌నిపించ‌డం లేదు.

నిజానికి క‌రోనా విల‌యం ఒక‌వైపు.. ప్ర‌జ‌లకు కంటిపై కునుకు లేకుండా చేస్తుంటే.. మ‌రోవైపు.. ప్ర‌భుత్వం క‌రోనా క‌ట్ట‌డి కోసం అంటూ.. విధించిన క‌ర్ఫ్యూతో సాధార‌ణ‌, సామాన్య ప్ర‌జ‌ల‌కు ఉపాధి లేకుండా పోయింది. గ‌తంలో రోజంతా క‌ష్ట‌ప‌డితే.. రూ.500 సంపాయించుకునే ప్ర‌జ‌లు.. ఇప్పుడు రూ.200, కొన్ని చోట్ల‌రూ.300 ల‌తో స‌రిపుచ్చుకుంటున్నారు. దీంతో జీవ‌నం వెళ్లబుచ్చ‌డం వారికి భారంగా మారిపోయింది. ఈ ప‌రిణామాల‌ను దృష్టిలో పెట్టుకుని.. తాము గెలిపించిన ఎమ్మెల్యేలు ఏదో ఒక రూపంలో సాయం చేయ‌క‌పోతారా? అని వారు ఎదురు చూస్తున్నారు.

కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్ర వ్యాప్తంగా ఆ ఇద్ద‌రు త‌ప్ప‌.. మ‌రెవ‌రూ కూడా ప్ర‌జ‌ల‌ను ప‌ట్టించుకున్న పాపాన‌పో లేదు. ఆ ఇద్ద‌రూ కూడా రాజ‌కీయాల కోసం వెంప‌ర్లాడుతున్న ప‌రిస్థితి కనిపిస్తోంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తు న్నాయి. ఒక‌రు క‌రోనా మృత దేహాల‌కు అంత్య క్రియ‌లు చేస్తూ.. మీడియాలో ఉంటున్నారు. మ‌రొక‌రు.. త‌న నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన క‌రోనా బాధితుల‌కు ప్ర‌త్యేకంగా క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేసి చేతులు దులుపు కొన్నారు. అయితే.. ఉన్నంత‌లో ఈ రెండు ప‌నులు మంచివే అయినా.. మిగిలిన ప్రజ‌ల ప‌రిస్థితి ఏంట‌నేది ఇప్పుడు ప్ర‌శ్న‌.

ఇక‌, రాష్ట్ర వ్యాప్తంగా ప‌రిస్తితిని గ‌మ‌నిస్తే.. ఎమ్మెల్యేల్లో చాలా మంది క‌రోనాకు భ‌య‌ప‌డి ఇంటికే ప‌రిమితం కాగా, యువ ఎమ్మెల్యేలు సైతం త‌మ సొంత ప‌నులు చేసుకుంటూ.. కాలం వెళ్ల‌దీస్తున్నారు. ఏదైనా ఉంటే.. వ‌లంటీర్లు చేస్తారు.. లేదా.. స‌ర్కారే అన్నీ ఇస్తుందిగా! అనే నిర్లిప్త ధోర‌ణిని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. దీంతో ఏపీలో ఎమ్మెల్యేలు ఉన్నారా? అనే సందేహాలను నెటిజ‌న్లు వెలిబుచ్చుతున్నారు. `మా ఎమ్మెల్యే ఎక్క‌డ‌?` అనే కామెంట్లు జోరుగా క‌నిపిస్తున్నాయి. మ‌రి ఇప్ప‌టికైనా.. ఎమ్మెల్యేలు త‌మ వంతుగా ప్ర‌జ‌ల‌కు ఏదైనా చేస్తారా? లేదా.. క‌రోనా బూచిని చూపించి.. ఇలానే ఉంటారో చూడాలి.