Begin typing your search above and press return to search.

పట్టాభి విషయంలో ఆ గంటసేపు ఏమి జరిగింది

By:  Tupaki Desk   |   24 Oct 2021 5:30 AM GMT
పట్టాభి విషయంలో ఆ గంటసేపు ఏమి జరిగింది
X
రాష్ట్రంలో తాజా గొడవలకు మూలకారకుడైన టీడీపీ నేత పట్టాభి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. రాజమండ్రి జైలు నుండి బెయిల్ పై విడుదలైన ఈ నేత విజయవాడకు సమీపంలోని పొట్టిపాడు టోల్ ప్లాజా దగ్గరకు వచ్చిన కాసేపటి తర్వాత నుండి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. బెయిల్ విడుదలైన తనను ఏదో కారణంతో పోలీసులు మళ్ళీ అరెస్టు చేస్తారనే అనుమానంతోనే సదరు నేత ఎవరికీ కనిపించకుండా దాక్కున్నట్లు సమాచారం. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి పట్టాభి రిలీజయ్యారు.

రాజమండ్రి నుండి భారీ కాన్వాయ్ తో బయలుదేరిన పట్టాభి రాత్రి 10 గంటల ప్రాంతంలో హనుమాన్ జంక్షన్ దగ్గరకు చేరుకున్నారు. అక్కడి నుండి పొట్టిపాడు టోల్ ప్లాజాకు చేరుకోగానే ఆయన కాన్వాయిని పోలీసులు నిలిపేశారు. పట్టాభి ప్రయాణిస్తున్న కారుని మాత్రం పోలీసులు తమతో తీసుకెళ్ళారు. దాంతో టెన్షన్ పడిన మిగిలిన కార్లలో ఉన్న సదరు నేత మద్దతుదారులు వెంటనే పట్టాభికి, ఆయన కారు డ్రైవర్, వ్యక్తిగత బాడీగార్డులకు ఫోన్లు చేశారు. అయితే ఎన్నిసార్లు ఫోన్లుచేసినా ఎవరి ఫోన్లు పలకలేదు.

దాంతో ఏమి చేయాలో అర్ధంకాని పట్టాభి మద్దతుదారులు ఇదే విషయాన్ని ఆయన ఇంట్లోవాళ్ళతో పాటు పార్టీలోని ముఖ్యులకు తెలియజేశారు. దాంతో ఒక్కసారిగా అందరిలోను టెన్షన్ పెరిగిపోయింది. అయితే సుమారు గంట తర్వాత పట్టాభి సురక్షితంగా ఉన్నట్లు ఆయన మద్దతుదారులకు, ఇంట్లో వాళ్ళకు ఫోన్లు రావటంతో అందరు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత తమ నేతను కలుద్దామని మద్దతుదారులు చేసిన ప్రయత్నాలేవి ఫలించలేదు.

ఎందుకంటే తాను సురక్షితంగానే ఉన్నానంటు పట్టాభి ఫోన్ నుండి సమాచారం అందిన తర్వాత మళ్ళీ ఎవరికీ ఆయన ఫోన్లో అందుబాటులోకి రాలేదు. ఇటు ఇంటకి రాలేదు, అటు పార్టీ కార్యాలయంలోను ఆయన సమాచారం లేదు. దాంతో సదరు నేత ఎక్కడికి వెళ్ళారో ఎవరికీ అంతుపట్టడం లేదు. అయితే ముందుజాగ్రత్తగానే తాను హైడౌట్ లోకి వెళ్ళిపోయారని మాత్రం అందరికీ అర్ధమైంది. ప్రస్తుతానికి బెయిల్ మీద విడుదలైనా మళ్ళీ పోలీసులు ఏదో కారణంతో తనను అరెస్టు చేస్తారని పట్టాభి అనుమానించారు.

అయితే హోలు మొత్తం మీద గమనించాల్సిన విషయం ఏమిటంటే పొట్టిపాడు దగ్గర నుండి పోలీసులతో వెళ్ళిన పట్టాభి తర్వాత ఏమైనట్లు అన్నదే ఎవరికీ అర్ధం కావటంలేదు. పోలీసులతో వెళ్ళిన దగ్గర నుండి దాదాపు గంట తర్వాత మాత్రమే పట్టాభి ఫోన్ అందుబాటులోకి వచ్చింది. మరి ఈ గంటసేపు సదరు నేత ఎక్కడున్నారు ? ఎవరితో మాట్లాడారు ? పోలీసులు పట్టాభిని ఎక్కడికి తీసుకెళ్ళారు ? అన్నదే అంతుపట్టడంలేదు. అజ్ఞాతం వీడి పట్టాభి బయటకు వస్తే కానీ ఆ గంటపాటు ఏమి జరిగిందో ఎవరికీ తెలిసే అవకాశంలేదు. మరి ఆ విషయం ఎప్పటికి బయటకు వస్తుందో ఏమో.