వూహాన్ లో ఇప్పుడలా జరుగుతోందట.. ఏం చేస్తున్నారంటే?

Tue Aug 03 2021 19:00:01 GMT+0530 (IST)

What's going on in Wuhan

ప్రపంచానికి మంట పెట్టిన చైనాలోని వూహాన్ మహానగరాన్ని ఎవరు మాత్రం మర్చిపోగలరు. కోట్లాది మంది ఉసురు తీసిన పాడు కరోనాకు పుట్టినిల్లు వూహాన్ మహానగరమే. అక్కడి పుట్టిన వైరస్ అంతకంతకూ వ్యాపించి ప్రపంచాన్ని చుట్టేయటం ఒక ఎత్తు అయితే.. యావత్ ప్రపంచం కరోనా కారణంగా కిందా మీదా పడుతున్న వేళ.. వూహాన్ లో ఒక్కటంటే ఒక్క కేసు లేకుండా ఉండటం.. ఈ కారణంగా అక్కడి ప్రజలు షాపింగ్ మాల్స్ మొదలు ఎక్కడి పడితే అక్కడ ఎంజాయ్ చేయటం తెలిసిందే.మొన్నటివరకు ఖుషీ ఖుషీగా గడిపిన వూహాన్ కు మళ్లీ కొత్త చిక్కు వచ్చి పడింది. కరోనాలోని డెల్టా వేరియంట్ ఇప్పుడక్కడ మొదలైంది. ఒక్కరోజులోనే అరవైకి పైగా కేసులు నమోదు కావటంతో.. ఇప్పుడక్కడి అధికారులు టెన్షన్ పడిపోతున్నారు. అంతకంతకూ పెరిగిపోతున్న డెల్టా కేసుల్ని అదుపులోకి తెచ్చేందుకు ఇప్పుడో భారీ కసరత్తుకు తెర తీశారు.

డెల్టా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో.. దాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి అదుపులోకి తేవాలని నిర్ణయించిన అక్కడి అధికారులు భారీ ఆపరేషన్ చేపట్టారు. వూహాన్ మహానగరంలోని ప్రతి ఒక్క పౌరుడికి కరోనా టెస్టు చేయాలని నిర్ణయించారు. వూహాన్ లో ప్రస్తుతం 1.10కోట్ల మంది పౌరులు ఉన్నారు. ఇంత బారీగా ఉన్న వారందరికి అతి తక్కువ వ్యవధిలో కరోనా టెస్టు చేయటం ద్వారా.. దాన్ని మొగ్గలోనే తుంచి పారేయాలన్న పట్టుదలతో ఉన్నారు.

గత అనుభవాల్ని దృష్టిలో ఉంచుకొని ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని డిసైడ్ అయ్యారు. అంతేకాదు.. ఈ నగర వాసుల్ని పబ్లిక్ ట్రాన్స్ పోర్టును వినియోగించే విషయంలో వీలైనంత మేరకు తగ్గించాలని కోరుతున్నారు. ఇటీవల బీజింగ్ లో కూడా కేసులు ఎక్కువ అవుతుండటంతో.. ఎక్కడికక్కడ కరోనా టెస్టులు చేయటమే కాదు.. కరోనా బాధితులకు సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించి వారిని ఐసోలేట్ చేస్తున్నారు. ప్రపంచానికి కరోనాను అందించిన వూహాన్ ను ఉలిక్కిపడేలా చేస్తున్న డెల్టా వేరియంటం.. అక్కడ మళ్లీ తన రూపం మార్చుకొని మరో దరిద్రపుగొట్టు వేరియంట్ గా తయారై ప్రపంచం మీద పడదు కదా?