వైఎస్ అవినాష్ పై టీ హైకోర్టు ఏం తేల్చింది? ఇప్పుడేం జరగనుంది?

Sat Mar 18 2023 09:49:06 GMT+0530 (India Standard Time)

What did the TS High Court decide on YS Avinash?

మాజీ మంత్రి.. దివంగత మహానేత సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఉదంతంలో అనుమానితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ ముఖ్యమంత్రి సోదరుడు (వరుసకు) కమ్ కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించటం తెలిసిందే. వివేకా హత్య కేసులో తనను అరెస్టు చేయకుండా ఉండేలా సీబీఐకు ఆదేశాలు ఇవ్వాలంటూ ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించటం.. ఈ పిటిషన్ విచారణ నేపథ్యంలో కోర్టు నుంచి భారీ ఎదురుదెబ్బ తగలటం తెలిసిందే.అరెస్టు చేయకుండా సీబీఐను ఆపలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసిన వేళ.. పలు కీలక వ్యాఖ్యలు చేసింది. తనను అరెస్టు చేయొద్దని.. తదుపరి విచారణ జరపొద్దని.. తన స్టేట్ మెంట్ లను ఆడియో.. వీడియో రికార్డులు చేయాలని.. న్యాయవాది సమక్షంలోనే విచారించాలని వైఎస్ అవినాశ్ కోరటం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును ఇచ్చింది. అందులో పలు కీలక అంశాల్నిప్రస్తావించింది. హైకోర్టు తీర్పులోని కీలక అంశాలేమిటి? ఈ నేపథ్యంలో ఏం జరగనుంది? అన్నది ఆసక్తికరంగా మారింది.

టీహైకోర్టు తీర్పులోని కీలక అంశాల్ని చూస్తే..

-  అనుమానితుడు నిందితుడు సాక్షి అనే తేడా లేకుండా సీఆర్పీసీ సెక్షన్ 160 కింద దర్యాప్తు అధికారి తన విచక్షణ మేరకు ఎవరినైనా విచారణకు పిలువవచ్చు. సీబీఐ సమర్పించిన స్టేట్మెంట్లు ఇతర రికార్డులను పరిశీలిస్తే దర్యాప్తు అధికారి వివక్ష చూపుతున్నట్లు కనిపించడం లేదు.

-  సీబీఐ సమర్పించిన రికార్డులు పరిశీలించాం. అవినాశ్ రెడ్డి ఆరోపిస్తున్నట్లుగా వాంగ్మూలాలను మార్చినట్లుగా కనిపించడంలేదు. స్టేట్మెంట్లు సక్రమంగానే ఉన్నాయి. వాటిని మార్చినట్లు ఆధారాలు లేవు. సీబీఐపై చేసిన ఆరోపణలను నిరూపించడంలో పిటిషనర్ విఫలమయ్యారు.

-  సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం సాక్షుల స్టేట్మెంట్ను ఆడియో వీడియో రికార్డింగ్ తప్పనిసరిగా చేయాలనేమీ లేదు. దర్యాప్తు అధికారి విచక్షణ మేరకు రికార్డింగ్ ఉంటుంది.

-  కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నప్పుడు జోక్యం చేసుకోరాదని 'నిహారికా ఇన్ఫ్రాస్ట్రక్చర్' కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఇక్కడ ప్రస్తావించాలి. పిటిషనర్ కోరినట్లుగా అరెస్టు సహా ఎలాంటి కఠిన చర్యలూ తీసుకోవద్దని సీబీఐని ఆదేశించలేం. సీఆర్పీసీ 161 కింద పిటిషనర్ను సీబీఐ విచారించకుండా అడ్డుకోవడం సైతం సమంజసం కాదు.

-  దర్యాప్తు కీలక దశలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో పిటిషనర్ కోరినట్లు... బ్లాంకెట్ ఆర్డర్లు ఇవ్వడం సరికాదు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగించుకోవచ్చు. తనకు అవసరమని భావించినప్పుడు పిటిషనర్ను సీఆర్పీసీ 160 కింద విచారణకు పిలువవచ్చు

-  అవినాశ్ రెడ్డి కోరిన విధంగా ఆయన స్టేట్మెంట్ ఆడియో వీడియో రికార్డు చేయాలి. పిటిషనర్ కనుచూపు మేరలో ఉండేలా ఆయన న్యాయవాదిని కూడా సీబీఐ అనుమతించాలి. దర్యాప్తు చేసే గదిలోకి మాత్రం న్యాయవాదికి అనుమతి లేదు. విచారణ జరుగుతున్నప్పుడు న్యాయవాది జోక్యం చేసుకోవడానికి వీల్లేదు.

ఎంపీ అవినాశ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను విచారించే సమయంలో హైకోర్టులో వేడి వేడి వాదనలు చోటు చేసుకున్నాయి. విచారణ సందర్భంగా సీబీఐ తరఫు లాయర్ వాదనల్లో ఒక విషయం స్పష్టంగా వెల్లడైంది. అవినాశ్ రెడ్డిని.. ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని ఏ క్షణంలో అయినా సీబీఐ విచారించొచ్చని స్పష్టం చేసినట్లుగా చెప్పాలి. వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి పాత్ర స్పష్టంగా ఉందని.. ఆయనే కీలక పాత్ర పోషించినట్లుగా పేర్కొన్నారు. అంతేకాదు.. వివేకా హత్య తర్వాత అన్ని ఆధారాల్ని ఆయనే స్వయంగా చెరిపేశారన్న కీలక ఆరపణ చేయటం గమనార్హం.

సీబీఐ న్యాయవాదితో పాటు వివేకా కుమార్తె సునీత తరపు న్యాయవాది సైతం బలమైన వాదనను వినిపించారు. అవినాశ్ రెడ్డి సమాచారం అందుకున్న రెండు నిమిషాల వ్యవధిలోనే వివేకా ఇంటికి చేరుకున్నారని.. వివేకా గుండెపోటుతో మరణించారని స్థానిక నాయకురాలు శశికళకు.. సీఐ శంకరయ్యకు చెప్పిన వైనాన్ని ప్రస్తావించారు. వివేకాది సహజ మరణమని చిత్రీకరించే ప్రయత్నంతోపాటు తానే స్వయంగా ఆధారాలు చెరిపేశాడన్నారు. దీనికి ప్రతిగా అవినాశ్ రెడ్డి తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. సునీతతో సీబీఐ కుమ్మక్కైందని.. ఆమె దాఖలు చేసిన పిటిషన్ లో సీబీఐ హ్యాండ్ ఉందని తీవ్ర ఆరోపణలు చేయటం గమనార్హం. మొత్తంగా చూస్తే.. టీ హైకోర్టు తాజా నిర్ణయం నేపథ్యంలో అవినాశ్ రెడ్డి అరెస్టు ఖాయమన్న మాట బలంగా సాగుతోంది. ఏదైనా అనుకోని అద్భుతం జరిగితే తప్పించి.. అవినాశ్ అరెస్టు నుంచి తప్పించుకోలేరన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.