రెమ్ డెసివిర్ తో అసలేం జరుగుతుంది? ఎంత పని చేస్తుంది?

Sun Apr 18 2021 22:00:01 GMT+0530 (IST)

What actually happens with remdesivir? How much work?

సామాన్యుడి నుంచి సీఎం వరకు ఇప్పుడు అందరి నోట నానుతోంది రెమ్ డెసివిర్. కరోనా వచ్చిన రోగులందరికి కాకున్నా.. తీవ్రత ఎక్కువగా ఉన్న వారికి దీన్ని వినియోగిస్తున్నారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి ఈ ఇంజెక్షన్లను ఇవ్వటం ద్వారా వైరస్ తీవ్రత నుంచి బయటపడుతున్నట్లుగా చెబుతున్నారు. అయితే.. ఇప్పటికే కొన్ని దేశాల్లో రెమ్ డెసివిర్ ను వినియోగించటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని తేల్చటమే కాదు.. దాన్ని వినియోగించటం లేదు.అయితే.. మన దేశంలో మాత్రం రెమ్ డెసివిర్ ను విరివిగా వినియోగిస్తున్నారు. వైరస్ లోడ్ అధికంగా ఉండి.. ఆక్సిజన్ స్థాయి తగ్గిన వారికి ఈ ఇంజెక్షన్లు ఇవ్వటం ద్వారా పరిస్థితి మెరుగుపడుతుందన్న అభిప్రాయం పలువురి నోట వినిపిస్తుంది. ఈ కారణంతోనే.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే  భారీ ఎత్తున రెమ్ డెసివిర్ భారీ ఎత్తున కావాలని కేంద్రాన్ని అడుగుతున్నారు. అయితే.. మోడీ సర్కారు నుంచి స్పందన రాని పరిస్థితి. దేశ వ్యాప్తంగా ఈ ఇంజెక్షన్ కు డిమాండ్ పెరిగిపోయిన వేళ.. ఎయిమ్స్ డైరెక్టర్ రణ్ దీప్ గులేరియా మాత్రం అందుకు భిన్నమైన వాదనను వినిపిస్తున్నారు.

రెమ్ డెసివర్ వల్ల పెద్ద ప్రయోజనం ఉండదన్న విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పేస్తున్నారు. దాని వల్ల పూర్తి స్వస్థత చేకూరే అవకాశం లేదని.. లోడ్ అధికంగా ఉన్న వారి మీద దాని ప్రభావం ఉంటుందని.. ఆసుపత్రిలో చేరిన వారికి మాత్రమే ప్రయోజనమని చెబుతున్నారు. స్వల్పంగా  ఉన్న వారికి ఇవ్వటం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదంటున్నారు. అవసరం లేనప్పుడు దీన్ిన ఇవ్వటం వల్ల నష్టమే ఎక్కువని.. ఆసుపత్రుల్లో ఉన్న వారికి ఇవ్వటం వల్ల.. వారు అక్కడ ఉండే రోజులు మాత్రమే తగ్గుతాయని చెబుతున్నారు.

అంతేకాదు.. టీకా వేయించుకోవటంతోనే కరోనా నుంచి పూర్తి రక్షణ లభిస్తుందని భావిస్తే తప్పులో కాలేసినట్లేనని ఆయన స్పష్టం చేస్తున్నారు. రెండో విడత వ్యాక్సిన్ వేయించుకున్న రెండు వారాల తర్వాత శరీరంలోయాంటీబాడీలు తయారవుతాయని గులారియా చెబుతున్నారు. టీకా వేసుకున్న తర్వాత కూడా నోట్లోకి.. ముక్కులోకి వైరస్ చేరే వీలుందని స్పష్టం చేస్తున్నారు. టీకా వల్ల జరిగే మేలు ఏమైనా ఉందంటే.. అది కరోనా ఇన్ ఫెక్షన్ తీవ్రతను తగ్గించటానికి ఉపయోగపడుతుందే తప్పించి.. టీకా పొందినంతనే కరోనా నుంచి పూర్తి రక్షణ లభించినట్లు ఎంతమాత్రం కాదు. సో.. వ్యాక్సిన్ వేసుకున్న వారు సైతం.. కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏ చిన్న పొరపాటు జరిగినా.. వైరస్ బారిన పడటం ఖాయం.