హీరో వర్షిప్ తోనేనా : జనసేనాని గురించి ఏమనుకుంటున్నారు....?

Tue Jun 28 2022 16:44:38 GMT+0530 (IST)

What People Thinking About Janasena

పవన్ కళ్యాణ్ వెండి తెర కధానాయకుడు. ఆయనను తెర మీద చూస్తే చాలు ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చేస్తాయి. పవర్ స్టార్ పవర్ అలాంటిది మరి. అదే పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడిగా మారారు. జనసేన పార్టీని పెట్టి జనంలోని వస్తున్నారు. గత ఎనిమిదేళ్ళుగా పవన్ అనేక పర్యాయాలు ప్రజల మధ్యనే ఉన్నారు. ఇక 2019 ఎన్నికలలో ఆయన సొంతంగా పోటీ చేశారు కూడా. అయితే ఒకే ఒక్క సీటు లభించింది. ఒక విధంగా చేదు ఫలితమే అనుకోవాలి.ఇక 2024 ఎన్నికలకు ముందే మేలుకుని పవన్ అస్త్ర శస్త్రాలు రెడీ చేసుకుంటున్నారు. ఆయన జనంతోనే నిరంతరం అని ఒక బృహత్తర ప్రోగ్రాం ని డిజైన్ చేశారు. పవన్ కళ్యాణ్ బస్సు యాత్రను అక్టోబర్ 5న ప్రారంభించనున్నారు. నిజానికి ఈ కార్యక్రమం ద్వారా పవన్ కళ్యాణ్ ప్రస్తుత తన పాత్రను ఇంకా పెంచుకోవాలని చూస్తున్నారు. జనసేనానిగా తన వెనక ఎంత మంది ఉన్నారు అన్న అంచనాకు ఆయన రావడానికి ఈ టూర్ ఉపయోగపడుతుంది.

ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ఎనిమిదేళ్ళ జనసేన ప్రస్థానంలో ఆయనని ఇంకా సినీ హీరోగానే అంతా చూస్తున్నారన్న అభిప్రాయాలు అయితే బలంగా ఉన్నాయి. పవన్ సభలకు ఫ్యాన్స్ మాత్రమే హాజరవుతారని వారు ఓట్లు పొలిటికల్ గా కన్వర్ట్ కావడం లేదు అన్న భావన ఉంది. ఇక్కడ రెండు విషయాలల్లో మార్పు రావాలని కూడా విశ్లేషణలు ఉన్నాయి.

మొదటిది ఏంటి అంటే పవన్ కళ్యాణ్ తాను పూర్తి స్థాయి రాజకీయ నాయకుడుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడం. దాని కోసమే ఆయన సుదీర్ఘమైన బస్సు యాత్రను ఎంచుకున్నారు. అంటే ఆ దిశగా అడుగులు పడినట్లే. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయ పరిభాష కూడా మారాల్సి ఉంది అంటున్నారు. అలాగే ఆయన అసందిగ్ద రాజకీయ ప్రకటనలకు స్వస్తి చెప్పాలని కోరే శ్రేయోభిలాషులూ ఉన్నారు.

అదే టైమ్ లో పవన్ కళ్యాణ్ రాజకీయ విమర్శల కంటే ప్రజా సమస్యలను బస్సు యాత్ర సందర్భంగా ఎత్తుకోవాలని అలాగే ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ కానీ దానికి ముందు పనిచేసిన తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఏ రకంగా పాలించింది తాను అధికారంలోకి వస్తే ఏం చేయగలను అన్నది స్పష్టంగా పవన్ జనాలకు వివరించాల్సి ఉంటుందని అంటున్నారు. ఒక విధంగా ఆంధ్రా రాజకీయాల్లో ఒక ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ ని ఆయన ఆవిష్కరింపచేయాల్సి ఉంది.

ఇక పవన్ ఫ్యాన్స్ ఎటూ ఉంటారు వారు కాకుండా కామన్ ఓటు బ్యాంక్ కచ్చితంగా జనసేనకు తయారు కావాలీ అంటే అన్ని వర్గాలను ఆకట్టుకునే పవన్ స్పీచ్ ఉండాలని ఆయన అధికార పార్టీని అదే పనిగా  విమర్శిస్తూ కూర్చుంటే జనాలు మెచ్చరని అంటున్నారు. ఇక పవన్ ఇప్పటిదాకా చేసిన రాజకీయ ప్రయాణంలో ఆయనను కేవలం సినీ హీరోగానే జనాలు చూశారన్న విమర్శలు ఉన్నాయి. వాటిలో చాలా వరకూ నిజాలు ఉన్నాయి.

అందుకే పవన్ విషయంలో రాజకీయ పార్టీలు కూడా ఆలోచనలో పడుతునాయని అంటున్నారు. ఈ విమర్శలను తిప్పికొట్టడానికి బస్సు యాత్ర సరైన ఆయుధమని దాన్ని పవన్ ఎంతలా ఉపయోగించుకుంటే అంతలా ఆయన మంచి నాయకుడిగా మారుతారు అని అంటున్నారు.

హీరో వర్షిప్ తోనే రాజకీయాలను ఎవరూ శాసించలేరని వెండి తెర కధానాయకుడి నుంచి రాజకీయ నాయకుడిగా పవన్ రూపాంతం పూర్తి స్థాయిలో చెందేందుకు బస్సు యాత్ర నూటికి నూరు శాతం ఉపయోగపడుతుంది అని అంటున్నారు. పవన్ ఆ దిశగా కృషి చేయాలి. ఫ్యాన్స్ కూడా కార్యకర్తలుగా మారాలి. దాంతో పాటు వారు నిర్మాణాత్మకమైన శక్తిగా జనసేనకు ఉపయోగపడాల్సి ఉంది అని అంటున్నారు.