రాజధానిపై తలకో మాట.. జగన్ మాటే ఫైనలా..?

Wed Aug 21 2019 20:00:01 GMT+0530 (IST)

What Is Ys Jagan Decision Over AP New Capital

అనుకున్నట్టుగానే జరిగింది. వైసీపీ అధికారంలోకి వస్తే.. రాజధానిపై విస్తృతమైన చర్చ జరుగుతుందం టూ.. కొందరు మేధావులు చేసిన ప్రకటనలు ఇప్పుడు నిజమవుతున్నాయి. అయితే దీనిలో వైసీపీ పాత్ర కంటే కూడా విపక్షం టీడీపీ నాయకులు చేస్తున్న హడావుడి ఎక్కువగా ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు అమరావతి ని తీసేస్తామని కానీ భూములు రద్దు చేస్తామని కానీ ఎక్కడా ప్రకటించ లేదు. కానీ చంద్రబాబు అండ్ టీం మాత్రం దీనిపై గలాటా చేస్తూనే ఉంది. తాజాగా తిరుపతికి చెందిన టీడీపీ నాయకుడు చింతా మోహన్ మాట్లాడుతూ... ఏపీ రాజధానిగా అమరావతి కాదు.. తిరుపతిని చేయాలని సంచలన ప్రకటన ఒకటి చేశారు.రాజధానిగా దొనకొండ కంటే తిరుపతి బాగుంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. దొనకొండలో రాజధాని ఏర్పాటుకి వసతులు లేవన్నారు. అందుకే తిరుపతి బెస్ట్ అన్నారు. అన్ని ప్రాంతాల ప్రజల ఆమోదం పొందే ప్లేస్ తిరుపతి మాత్రమే అని చెప్పారు. రాజధానిగా దొనకొండ ఆలోచనను సీఎం జగన్ వెనక్కి తీసుకోవాలని చింతామోహన్ డిమాండ్ చేశారు. ఏపీ రాజధాని అంశం సున్నితమైందని చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని చింతామోహన్ సూచించారు. ఈయన ఇలా అంటే.. నిన్నటికి నిన్న వైసీపీ నేత- మంత్రి బొత్స సత్యనారాయణ మరో కీలక ప్రకటన చేశారు. అమరావతిలో భూములు సరిగా లేవని వరద పోటు ఎక్కువని మిగిలిన చోట్ల నిర్మాణాలకు లక్ష అయితే.. ఇక్కడ రెండు లక్షల వరకు పెట్టాల్సి ఉంటుందని అన్నారు.

అయితే ఎక్కడా కూడా తాము అమరావతికి వ్యతిరేకం అంటూ ఆయన ప్రకటించలేదు. కానీ టీడీపీ నాయకులు మాత్రం అమరావతిని ఇప్పుడున్న చోటే కొనసాగించాలని లేక పోతే ఉద్యమాలు తప్పవని భీషణ ప్రతిజ్ఞలు చేస్తున్నారు. దీనిపై మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కొంత హాట్ హాట్ గానే మాట్టాడా రు. తాను నిరాహార దీక్షకు సైతం కూర్చుంటానని అన్నారు. మొత్తానికి ఇప్పుడు ఉరుములు లేని పిడుగు మాదిరిగా అమరావతి విషయం పెద్ద చర్చకు వచ్చింది. ఇవన్ని ఇలా సాగుతుంటే.. మేధావులు మాత్రం అసలు ప్రభుత్వ నాయకుడు జగన్ ఇప్పుడు విదేశాల్లో ఉన్నారు కదా? ఆయన వచ్చిన తర్వాత ఆయన ఏం చెబుతారో చూడాలని సూచిస్తున్నారు. అప్పటి వరకు సంయమనం పాటించాలని అంటున్నారు. మరి ఇది నిజమే కదా! సో.. నేతలు అప్పటి వరకు మౌనం వహిస్తేనే మంచిదని అంటున్నారు విశ్లేషకులు కూడా!