ఏపీ అసెంబ్లీ షురూ.. ఇప్పటివరకూ ఏం జరిగిందంటే?

Wed Jun 12 2019 12:11:58 GMT+0530 (IST)

What Happened In AP Assembly Up To Now

ఏపీ 15వ శాసనసభా సమావేశాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. ముందుగా నిర్ణయించిన ముహుర్తం ప్రకారం ఈ ఉదయం (బుధవారం) 11. 05 గంటలక సమావేశాలు మొదలయ్యాయి. ఏపీ ముఖ్యమంత్రి హోదాలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభకు హాజరయ్యారు. విపక్ష నేత చంద్రబాబుతో సహా వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు.. టీడీపీ నేతలు హాజరయ్యారు.అసెంబ్లీకి వచ్చిన జగన్ కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సభా నాయకుడిగా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారు. ప్రోటెం స్పీకర్ గా శంబంగి చిన వెంకట అప్పలనాయుడి బాధ్యతలు స్వీకరించారు. ఈ రోజు నుంచి ఐదు రోజుల పాటు సాగనున్న అసెంబ్లీ సమావేశాల్లో తొలుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రమాణస్వీకారం చేశారు. దైవసాక్షిగా ప్రమాణం చేశారు. అనంతరం విపక్ష నేత చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం నేపథ్యంలో అసెంబ్లీకి పువ్వులతో అలంకరించారు.

ముఖ్యమంత్రి వెళ్లే ద్వారాలకు పూలతో ప్రత్యేక అలంకరణ చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్షానికి తాత్కాలిక ఛాంబర్లు కేటాయించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు.. టీడీఎల్పీకి పక్కపక్కనే గదులు కేటాయించారు. జగన్.. చంద్రబాబు ప్రమాణస్వీకారం తర్వాత అక్షరక్రమంలో ఎమ్మెల్యేల చేత స్పీకర్ ప్రమాణస్వీకారం చేయించారు. స్పీకర్ ను గురువారం ఎన్నుకోనున్నారు. ఈ నెల 14న ఉభయ సభల్ని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఈ మధ్యాహ్నం 12 గంటల సమయానికి ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారోత్సవం కొనసాగుతూ ఉంది.