Begin typing your search above and press return to search.

సుప్రీం బలపరీక్ష తీర్పు ముందు.. తర్వాత సీఎం ఉద్దవ్ ఏం చేశారంటే?

By:  Tupaki Desk   |   30 Jun 2022 1:57 AM GMT
సుప్రీం బలపరీక్ష తీర్పు ముందు.. తర్వాత సీఎం ఉద్దవ్ ఏం చేశారంటే?
X
మహారాష్ట్ర రాజకీయం కీలక మలుపు తిరిగింది. శివసేన రెబెల్ ఎమ్మెల్యేల పుణ్యమా అని తొమ్మిది రోజులుగా మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం చివరి అంకానికి చేరింది. అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న ఉద్దవ్ ఠాక్రే తన సీఎం పదవికి.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు (బుధవారం) అసెంబ్లీలో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కోనుంది.

అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలంటూ గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ జారీ చేసిన ఆదేశాలపై స్టే ఇవ్వాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించటం.. అందుకు తగ్గట్లు నిర్ణయం రాని నేపథ్యంలో తన సీఎం పదవికి రాజీనామా చేయాలని ఉద్దవ్ నిర్ణయించారు. తీర్పునకు ముందుగా నిర్వహించిన కేబినెట్ భేటీలో పలు నిర్ణయాలు తీసుకున్న ఆయన.. తీర్పు ప్రతికూలంగా వస్తే.. తన పదవికి రాజీనామా చేస్తానని చెప్పినట్లుగా చెబుతున్నారు. తాజా పరిణామాలతో 31 నెలల ఉద్దవ్ ప్రభుత్వం కుప్పకూలినట్లైంది.

బలపరీక్షను ఎదుర్కొని.. అందులో ఓటమి పాలైన తర్వాత సీఎం పదవికి రాజీనామా చేసే బదులు.. ముందే తప్పుకోవటం మంచిదన్న భావనకు ఉద్దవ్ వచ్చినట్లుగా చెబుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన అరగంటకు ఆయన ఫేస్ బుక్ లోని వెబ్ క్యాస్టింగ్ ద్వారా పార్టీ శ్రేణుల్ని.. అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన నోటి నుంచి.. తమ ప్రభుత్వానికి దురదృష్టం పట్టుకుందంటూ వ్యాఖ్యానించారు.

తమ ప్రభుత్వానికి సహకరించిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ లకు ఉద్దవ్ కృతజ్ఞతలు తెలిపారు. ఆ రెండు పార్టీల అధినేతలకు థ్యాంక్స్ చెబుతూనే.. తిరుగుబాటుకు కారణమైన షిండే వర్గంపై మాట్లాడుతూ.. కోరినవన్నీ ఇచ్చినా తిరుగుబాటు చేశారన్నారు. సీఎం పదవికి రాజీనామా చేయటానికి ముందు కేబినెట్ సమావేశాన్ని నిర్వహించిన ఆయన పలు కీలక నిర్ణయాల్ని తీసుకున్నారు.

- ఔరంగాబాద్‌ పట్టణం పేరును శంభాజీ నగర్‌గా, ఉస్మానాబాద్‌ పేరును ధారాశివ్‌గా మార్చాలన్న ప్రతిపాదనలకు ఆమోదం

- త్వరలో అందుబాటులోకి రాబోతున్న నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి పీడబ్ల్యూపీ నేత డీబీ పాటిల్‌ (దినకర్‌ బాలూ పాటిల్‌) పేరు పెట్టాలని నిర్ణయం.

సుప్రీం తీర్పు వచ్చిన అరగంటకు వెబ్ క్యాస్టింగ్ ద్వారా ఉద్దవ్ ఠాక్రే ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయ కీలక వ్యాఖ్యలు చేశారు. తన కోసం ఎవరూ రోడ్ల మీదకు వచ్చి నిరసనలు చేయొద్దన్నారు. రెబెల్ ఎమ్మెల్యేలను తిరిగి రానివ్వాలని.. శివసేన వల్ల.. ఠాక్రే వల్ల రాజకీయంగా ఎదిగిన రెబెల్స్ ను .. ఠాక్రే కొడుకును సీఎం పదవి నుంచి దించేసిన ఆనందాన్ని.. సంతృప్తిని పొందనివ్వమన్నారు. తాను అంకెల ఆటలోకి దిగదల్చుకోలేదన్నారు. రెబెల్స్ కోరుకుంటే తాము ప్రభుత్వం నుంచి వైదొలగి బయట నుంచి మద్దతు ఇస్తామని తనకు కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ చెప్పినట్లు పేర్కొన్నారు. మొత్తంగా తొమ్మిది రోజులుగా సా..గుతున్న మహా సంక్షోభం ఒక కొలిక్కి వచ్చి.. ఉద్దవ్ సర్కారు ఇంటికి.. ఫడ్నవీస్ నేత్రత్వంలోని బీజేపీ సర్కారు అధికారంలోకి రానున్నదని చెప్పాలి.