Begin typing your search above and press return to search.

కేంద్రం నిధుల కోసం 'సేవల' ముసుగు.. లక్షల్లో దోపిడీ

By:  Tupaki Desk   |   22 Jan 2020 8:34 AM GMT
కేంద్రం నిధుల కోసం సేవల ముసుగు.. లక్షల్లో దోపిడీ
X
స్వచ్ఛంద సంస్థల ముసుగులో దోచుకుంటున్నారు. వృద్ధులు - వికలాంగులు - డ్రగ్ డీఅడిక్షన్ సెంటర్ల పేరిట లేని వాటిని సృష్టిస్తూ కాజేస్తున్నారు. వృద్ధాశ్రమాలు - దివ్యాంగుల పునరావాస కేంద్రాలు - డ్రగ్ అడిక్షన్ సెంటర్లను నిర్వహిస్తున్నామంటూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపిస్తూ లక్షల్లో దోచుకుంటున్న వైనం ఒంగోలులో వెలుగుచూసింది. నిజానికి ఈ కేంద్రాలేవీ ఒంగులు జిల్లాలోని చెప్పిన చోట లేవు. అందులో వృద్ధులు - వికలాంగులు - డ్రగ్ బానిసలు లేరు. అయినా వారు ఉన్నారని బోగస్ లెక్కలు చూపించి సేవ చేస్తున్నామంటూ కేంద్రం నుంచి లక్షలు దోపిడీ చేస్తున్నారు. కొన్ని సెంటర్లు అయితే చెప్పిన చోట లేనే లేవు. అడ్రస్ కూడా లేకుండా తప్పుడు అడ్రస్ - పత్రాలు చూపించి స్వచ్ఛంద సంస్థలు నడిపిస్తున్నామంటూ దోచేస్తున్న వైనం ప్రకాశం జిల్లాలో సంచలనంగా మారింది.

తాజాగా విజిలెన్స్ ఏఎస్పీ రజినీ ఆధ్వర్యంలో ఈ స్వచ్ఛంద సంస్థల కేంద్రాలపై దాడులు జరిగాయి. కేంద్రం నుంచి నిధులు తీసుకుంటున్న నిర్వాహకులు రికార్డుల్లో నమోదు చేసిన కేంద్రంలో అసలు లబ్ధిదారులే లేని వైనం వెలుగుచూసింది. కొన్ని కేంద్రాల చిరునామా కూడా లేకపోవడం చూసి విజిలెన్స్ అధికారులే ఆశ్చర్యపోయారు. ఎక్కువ సంస్థలు కేంద్రం నిధుల కోసం తప్పుడు సంస్థలను ఏర్పాటు చేసి నిధులను కాజేస్తూ దుర్వినియోగం చేసినట్టు విజిలెన్స్ విచారణలో వెలుగుచూసింది.

ఇటీవలే ప్రకాశం జిల్లాలో బోగస్ స్వచ్ఛంద సంస్థల పేరిట కేంద్రం నుంచి నిధులను పొందేందుకు కొందరు అక్రమార్కులు కుట్రపన్నారు. ఈ ఫైళ్లను కేంద్రానికి పంపించేందుకు అధికారితో బేరమాడారు. లక్షల్లో డబ్బులు లంచం అడిగిన ఇన్ చార్జి ఏడీ సింగయ్య ఏసీబీకి దొరికిపోవడంతో ఈ దందా వెలుగుచూసింది. అధికారులే ఇలా బోగస్ స్వచ్ఛంద సంస్థలతో కలిసి దోపిడీ చేస్తున్న వైనం వెలుగుచూసింది.

ఇన్ చార్జి ఏడీ సింగయ్య దొరకడంతో అధికారులు అసలు ఈ భోగస్ స్వచ్ఛంద సంస్థల ఫైళ్లను పంపకుండా తనిఖీలు చేయకుండా పక్కన పడేశారు. దీంతో లక్షల్లో దోచుకున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పారు. ప్రకాశం జిల్లా అధికారుల సహాయ నిరాకరణతో ఏకంగా గుంటూరు జిల్లా ఏడీని రంగంలోకి దింపారు. ప్రకాశం జిల్లాలోని స్వచ్ఛంద సంస్థల కేంద్రాలను గుంటూరు ఏడీ తనిఖీ చేసేలా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు ఇప్పించారు. గుంటూరు ఏడీ నిబంధనలకు విరుద్ధంగా స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయంటూ తూతూమంత్రంగా తనిఖీలు చేసి కేంద్రానికి ప్రతిపాదనలు పంపడం వివాదాస్పదమైంది. కేంద్రం నిధుల కోసం అధికారులు - స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కుట్ర పన్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంట్లో లక్షలు చేతులు మారినట్టు ఆరోపణలున్నాయి.

ప్రకాశం జిల్లాలో అసలు స్వచ్ఛంద సంస్థలు లేకున్నా.. వృద్ధులు - వికలాంగులు - డ్రగ్స్ బానిసలకు సేవ చేయకున్నా ఇలా సంస్థలు - అధికారులు కలిసి దోపిడీకి ప్లాన్ చేయడంపై వికలాంగులు - వృద్ధులు మండిపడుతున్నారు. తాజాగా దివ్యాంగుల సంఘాలు దీనిపై ఆందోళన చేసి లోకాయుక్తకు కూడా అక్రమాలపై ఫిర్యాదు చేశాయి. దీనిపై ప్రస్తుతం విజిలెన్స్ విచారణ సాగుతోంది. మరి ఇప్పటికైనా ఈ స్వచ్ఛంద సంస్థల ముసుగులో దోపిడీని అరికట్టాలని దివ్యాంగుల సంఘాలు కోరుతున్నాయి.