Begin typing your search above and press return to search.

వెడ్డింగ్ టైమ్ : బొత్స ఇంట గంటా సందడి?

By:  Tupaki Desk   |   12 Feb 2022 6:05 AM GMT
వెడ్డింగ్ టైమ్ : బొత్స ఇంట గంటా సందడి?
X
మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ కుమారుడు సందీప్ వివాహ మ‌హోత్స‌వానికి సీఎం జ‌గ‌న్ తో స‌హా ఇరు తెలుగు రాష్ట్రాల‌కూ చెందిన కీల‌క నేత‌లూ వ‌చ్చి, కొత్త జంట‌ను ఆశీర్వ‌దించి వెళ్లారు.

ముఖ్యంగా వేడుక‌ల్లో గంటా శ్రీ‌నివాస‌రావు (టీడీపీ నేత అక్క‌డ ఉన్నారో లేదో కూడా తెలియ‌దు లేండి) హ‌డావుడి చేశారు.ఆయ‌న‌ను ఆత్మీయంగా ఆహ్వానించిన బొత్స చాలాసేపు ముచ్చ‌టించి యోగ క్షేమాలు తెలుసుకున్నారు.ఇదే వేడుక‌ల్లో వివాదాస్ప‌ద వైసీపీ ఎమ్మెల్యేలు గంటాను క‌లిసి చాలా సేపు ముచ్చ‌టించి వెళ్లారు. రాజీక‌యంగా విభేదాలు ఉన్న వారు సైతం గంటాతో గంట‌ల సేపు మాట్లాడి సెల్ఫీల‌కు దిగారు.ఈ ప‌రిణామాలు అన్నీతెలుగు దేశంకు కంట‌గింపుగా ఉన్నా కూడా ఇప్ప‌టికిప్పుడు గంటాపై చ‌ర్య‌లు తీసుకునేందుకు టీడీపీ అధిష్టానంకు మ‌న‌సొప్ప‌దు.క‌నుక ఈ ఎపిసోడ్లో జ‌రిగిన ప‌రిణామాల‌ను టీడీపీ అధినేత చంద్ర‌బాబు తెలుసుకోవ‌డం మిన‌హా చేయ‌గ‌లిగిందేమీ లేదు.

ఇక విశాఖ రాజ‌కీయాల్లో చాలా కాలంగా సైలెంట్ గా ఉంటూ ఎటువంటి స్టేట్మెంట్లూ ఇవ్వ‌ని గంటా శ్రీ‌ను స‌డెన్ గా హైద్రాబాద్ హైటెక్స్ లో ప్ర‌త్య‌క్ష‌మై వైసీపీ సోద‌రుల‌తో చాలా క‌లియ‌దిరిగారు. అంటే ఆయ‌న పార్టీ మార‌బోతున్నారా? లేదా ఇదొక వేడుక క‌నుక అందరినీ క‌లుపుకుని పోవాల‌ని భావించారా? వాస్త‌వానికి ఒక‌ప్పుడు ఉత్త‌రాంధ్ర రాజ‌కీయాల‌ను శాసించిన బొత్స కానీ గంటా కానీ ఇవాళ పెద్ద‌గా యాక్టివ్ గా లేరు.

మంత్రిగా ఉండి కూడా త‌న విజ‌య‌న‌గ‌రం జిల్లాకూ,తన నియోజ‌క‌వ‌ర్గం చీపురుప‌ల్లికీ ఏమీ చేయ‌లేక‌పోతున్నాన‌న్న బాధ అయితే బొత్స‌లో ఉంది. అదేవిధంగా ఏవో కొన్ని సంద‌ర్భాల్లో త‌ప్పితే ముఖ్య‌మంత్రి త‌న‌కు పెద్ద‌గా ప్రాధాన్యం ఇవ్వ‌డం లేదు అన్న అక్క‌సు కూడా ఉంది.

రాజ‌శేఖ‌ర్రెడ్డి తో పోలిస్తే జ‌గ‌న్ ద‌గ్గ‌ర త‌న‌కున్న ప్రాధాన్యం అంతంత మాత్ర‌మే అని ఆయ‌న అంత‌ర్మ‌థ‌నం చెందిన దాఖ‌లాలూ ఉన్నాయి.ఇదే సంద‌ర్భంలో త‌న ప‌లుకుబ‌డితో గంటాను ఇటుగా తీసుకుని రావాల‌ని ప్ర‌య‌త్నించినా సాయిరెడ్డి అడ్డుకోవ‌డంతో ఆయ‌న ఆశ‌లు కాస్త అడియాశ‌లు అయ్యాయి. కానీ అవంతి శ్రీ‌ను (గంటా శిష్యుడు) మాత్రం వైసీపీలోకి వ‌చ్చి మినిస్ట‌ర్ పోస్టు కొట్టేశారు.కానీ ఆయ‌న కూడా సాయిరెడ్డి కార‌ణంగానే ఎక్క‌డిక‌క్క‌డ మాట్లాడ‌కుండా ఉండిపోతున్నారు అన్న వాద‌న ఒక‌టి వినిపిస్తోంది.

ఈ నేప‌థ్యంలో నిన్న‌టి వేళ బొత్స వారింటి వేడుక‌ల్లో గంటా సంద‌డి చేయ‌డం చూస్తుంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ హ‌వాకు చెక్ పెట్టేందుకు అటు చిరును ఇటు గంటాను రంగంలోకి దించేందుకు వైసీపీ ఓ వ్యూహం ప‌న్నుతోంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. అదే నిజంఅయితే త్వ‌రలో గంటా శ్రీ‌ను బృందం వైసీపీలోకి రావ‌డం ఖాయం.