Begin typing your search above and press return to search.

చంద్రబాబు ను చూసి నేర్చుకోవాలి

By:  Tupaki Desk   |   28 May 2023 5:00 PM GMT
చంద్రబాబు ను చూసి నేర్చుకోవాలి
X
పార్టీ నిర్వహణ ను చంద్రబాబు నాయుడు ను చూసి నేర్చుకోవాల్సిందే. మిగిలిన పార్టీ నేతల సంగతేమో కానీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్ది అయితే చాలా నేర్చుకోవాలి. ఇప్పుడిదంతా ఎందుకంటే రాజమండ్రి మహానాడు మొదటి రోజు జరిగిన ప్రతినిధుల సభలో చంద్రబాబు ను జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నామినేషన్ వేశారు. చంద్రబాబు కు పోటీగా మరెవరూ నామినేషన్ వేయకపోవటంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. పాలిట్ బ్యూరో సభ్యుడు కాలువ శ్రీనివాసు లు అధ్యక్షుడిగా చంద్రబాబుతో ప్రమాణ స్వీకారం చేయించారు.

నిజానికి అధ్యక్ష ఎన్నికలకు ప్రకటన, నామినేషన్లు వేయటం, ఏకగ్రీవంగా ఎన్నికవడం అంతా ఉత్త షో అంటే లాంచనంగా జరిగే ప్రక్రియ అన్న విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబు ఉండగా పార్టీలో ఎవరైనా నేత అధ్యక్షపదవికి పోటీపడగలరా ? కానీ ప్రజాస్వామ్యంలో ఇలాంటి షోలు తప్పవు. పైగా ఇలాంటి షోలనే కేంద్ర ఎన్నికల కమీషన్ నిబంధనల పేరుతో అమలవ్వాలని కోరుకుంటోంది. దాన్ని చంద్రబాబు పర్ఫెక్టుగా అమలు చేస్తున్నారు. మరిదే బుద్ధి జగన్ కు ఎందుకు లేకపోయింది ?

ఆమధ్య జరిగిన వైసీపీ ప్లీనరీలో జగన్ ను శాశ్వత అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. దాన్ని కమీషన్ వెంటనే తప్పుపట్టింది. ఎందుకంటే పార్టీలకు శాశ్వత అధ్యక్షులుండరు. ఒకవేళ శాశ్వత అధ్యక్ష పదవి అన్నది ఉంటే అది రాచరికమో లేకపోతే నియంతృత్వమో అవుతుంది కానీ ప్రాజాస్వమ్యం అనిపించుకోదు. అందుకనే ఎన్నికల నిబంధనల్లో ప్రతి రెండేళ్ళ కు ఒకసారి అధ్యక్షుడిని ఎన్నుకోవాలని కమీషన్ నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయి.

కమీషన్ నిబంధనలు ఇంత స్పష్టంగా ఉన్నాకూడా వైసీపీ దాన్ని ఎందుకు ఉల్లంఘిస్తోంది ? టీడీపీకి చంద్రబాబు ఎలా జాతీయ అధ్యక్షుడో వైసీపీ కి జగనూ అంతేకదా ? జగన్ ఉన్నంతవరకు ముఖ్యమంత్రి పదవి అయినా పార్టీ అధ్యక్ష పదవి అయినా నూరుశాతం తనదే అన్న విషయం అందరికీ తెలుసు. ఏ ప్రాంతీయపార్టీలో అయినా ఇదే జరుగుతుంది. మరింతోటి దానికి శాశ్వాత అధ్యక్షుడిగా తనను తాను జగన్ గతంలో ఎలా ప్రకటించుకున్నారో అర్ధంకావటం లేదు. అందుకనే పార్టీ నిర్వహణను ఎలా చేయాలనే విషయాన్ని చంద్రబాబు ను చూసి జగన్ నేర్చుకోవాలనేది.