పవర్ ఇచ్చి నెత్తిన పెట్టుకున్నాం.. కనీస ఓదార్పుకు నోచుకోలేమా కేసీఆర్?

Sat Mar 18 2023 09:52:53 GMT+0530 (India Standard Time)

We have achieved by fighting.. When people are in trouble..

విషాదం ఏదైనా కోరుకునేది పరిహారం కంటే కూడా కంటి నుండి కారే కన్నీటిని తుడిచి.. నేనున్నాన్న ధైర్యాన్ని.. ఓదార్పును అందించే ఆపన్నహస్తం కోసం. ఈ కారణంగానే ఏదైనా అనుకోని పరిణామం చోటు చేసుకున్నంతనే నేతలు పరుగులు తీస్తారు. వారికి సాయం చేస్తారా? లేదా? వారికి వచ్చిన కష్టాన్ని తీరుస్తారా? లేదా? అన్నది పక్కన పెడితే.. మేమున్నామన్న ఉనికిని చాటుతారు. వీలైనంతవరకు వారి విషాదంలో తాము భాగస్వామ్యులమన్న సంకేతాల్ని ఇస్తుంటారు. గల్లీ లీడరు నుంచి ఢిల్లీ లీడరు వరకు ఇలాంటి తీరును ప్రదర్శిస్తుంటారు.అయితే.. దీనికి భిన్నమైన తీరు కనిపిస్తుంటుంది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లో. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి అధికారంలోకి వచ్చి దాదాపుగా పదేళ్లు కావొస్తోంది. మరికొద్ది నెలల్లో ఎన్నికలు సైతం దగ్గర పడ్డాయి. రెండు దఫాలుగా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న ఆయన.. ఏ రోజున ప్రక్రతి విపత్తుల్లోనూ.. అనూహ్యంగా చోటు చేసుకున్న విషాదాల్లోనూ ప్రగతిభవన్.. ఫాంహౌస్ అనే ఫార్మర్ హౌస్ నుంచి బయటకు వచ్చి ప్రజల మధ్యకు వచ్చిన దాఖలాలు కనిపించవు. అది కొండగట్టు విషాదమైనా.. తాజాగా సికింద్రాబాద్ నడిబొడ్డున జరిగిన స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్నిప్రమాదమైనా.

విపత్తులే కాదు విషాదాలు కూడా ఆయనకు పట్టవన్న విమర్శ కేసీఆర్ మీద చాలా ఎక్కువ. ఎంత ముఖ్యమంత్రి అయితే మాత్రం ఆ మాత్రం పట్టించుకోకుండా ఉండటమా? ఇదెక్కడి న్యాయం? అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఏ ముఖ్యమంత్రి కూడా ప్రజలకు ఇంత దూరంగా ఉన్నది లేదన్న విమర్శ ఉండనే ఉంది. స్వీయ పాలన కోసం తపించిన తెలంగాణ ప్రజలు.. పోరాడి సాధించుకున్న సొంత గడ్డకు చెందిన ముఖ్యమంత్రి పాలనలో తమకు ఎదురయ్యే  ప్రతి కష్టానికి అండగా నిలుస్తారని భావించారు.

కానీ.. అందుకు భిన్నంగా ఎంతటి పెద్ద విషాదమైనప్పటికీ బయటకు రాకపోవటం.. బాధితుల వద్దకు వెళ్లి వారి బాధను విని..మీకు నేనున్నా..నేను చూస్తా.. మీ బాధను.. వేదనను అర్థం చేసుకుంటానంటూ ఒక్కసారి కూడా వెళ్లింది లేకపోవటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ తీరు ఏ మాత్రం సరికాదన్న వాదన వినిపిస్తోంది. పోరాడి సాధించుకున్న గడ్డ ను ఏలే తమ సొంత మనిషే ఇంతటి చిన్నచూపు చూడటమా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ముచ్చటగా మూడోసారి అధికారం ఖాయమన్న ధీమాతో ఉన్న ముఖ్యమంత్రి.. ప్రజల్లో జరుగుతున్న చర్చ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే.. చేతలు కాలాక ఎన్ని ఆకులు పట్టుకున్నా ప్రయోజనం ఉండదన్న సామెతను కేసీఆర్ లాంటి మేధావికి గుర్తు చేయాల్సిన అవసరం ఉందంటారా?

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.