Begin typing your search above and press return to search.

ఉరి శిక్షతోనే వరంగల్ బావి మృతులకు నిజమైన నివాళి !

By:  Tupaki Desk   |   30 Oct 2020 2:50 PM GMT
ఉరి శిక్షతోనే వరంగల్ బావి మృతులకు నిజమైన నివాళి !
X
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వరంగల్ మృత్యు బావి కేసు లో తాజాగా తుది తీర్పు వెల్లడైన సంగతి తెలిసిందే. వరంగల్ న్యాయస్థానం తుది తీర్పును వెలువరించింది. కేసు నమోదైన నాటినుంచి కేవలం ఐదు నెలల వారం రోజుల్లో నిందితుడికి శిక్ష పడింది. ఈ ఏడాది మే 21న వరంగల్‌ శివారులోని గొర్రెకుంట సాయి దత్త గన్ని బ్యాగ్స్‌ కంపెనీలో 9 మందిని మత్తు ఇచ్చిన నిందితుడు వారిని సజీవంగా బావిలో పడేసి హత్యకు పాల్పడ్డారు. మొదట నాలుగు మృతదేహాలు బయటపడగా.. మరుసటి రోజు మరో ఐదు మృతదేహాలు కనిపించాయి. ఈ కేసును విచారించిన పోలీసులు నాలుగు రోజుల్లో బీహార్‌కి చెందిన సంజయ్‌ కుమార్‌ యాదవ్‌ని నిందితుడిగా తేల్చారు. ఈ ఘటన ఆ సమయంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

ఈ కేసును పోలీసులు తక్కువ సమయంలోనే చేధించి నిందితుడికి శిక్ష పడేలా చేశారు. నిందితుడికి ఉరిశిక్ష పడడంతో పోలీసులు, వరంగల్ నగర మేయర్ గుండా ప్రకాష్ రావుతో కలిసి బావిలో పూలను వేసి మృతులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రకాశ్‌ రావు మాట్లాడుతూ..గీసుకొండ మండలం గొర్రెకుంట సాయి దత్త మిల్లులో పని చేస్తున్న 9 మంది కార్మికులను నర రూప రాక్షసుడు సంజయ్ బావిలో పడేసి హత్య చేశాడు. దోషికి ఉరి శిక్ష పడేలా చేసిన గీసుగొండ పోలీసులు దేశానికే గర్వకారణం అన్నారు. కిరాతకంగా తొమ్మిది మందిని ఒకే రోజు రాత్రి సజీవంగా జల సమాధి చేసిన సంజయ్‌ కుమార్ కి ఉరిశిక్ష పడ్డ సందర్భంగా, మృతుల ఆత్మకు శాంతి చేకూర్చాలని వారి మత ఆచారాల ప్రకారం ప్రార్థనలు, పూజలు చేసి మృత్యు బావిలో పూల వర్షం కురిపించి ఘన నివాళులర్పించారు. ఉరి శిక్షతోనే మృతుల ఆత్మకు శాంతి చేకూరుతుందన్నారు. కార్యక్రమంలో గీసుగొండ ఇన్స్పెక్టర్ జూపల్లి శివరామయ్య, ఎస్సైలు పి.నాగరాజు, అబ్దుల్ రహీం, మూడో డివిజన్ కార్పొరేటర్ సుంకరి శివ, గీసుగొండ మండల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.