Begin typing your search above and press return to search.

మంకీపాక్స్‌ పై డబ్ల్యూహెచ్‌ఓ కీలక ప్రకటన

By:  Tupaki Desk   |   29 May 2022 2:30 AM GMT
మంకీపాక్స్‌ పై డబ్ల్యూహెచ్‌ఓ కీలక ప్రకటన
X
కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని ఊపిరి పీల్చుకునే లోపే మరో వైరస్ విజృంభిస్తోంది. స్మాల్‌పాక్స్ కుటుంబానికి చెంది మంకీపాక్స్ ప్రపంచాన్ని మరోసారి భయం గుప్పిట్లో నెట్టేస్తోంది. కరోనా కంటే వేగంగా వ్యాపిస్తున్న మంకీ పాక్స్ వైరస్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ కీలక ప్రకటన చేసింది. ప్రపంచ దేశాలను భయపెడుతున్న మంకీ పాక్స్ కరోనా మహమ్మారి అంత ప్రమాదకారి కాదని స్పష్టం చేసింది. ఈ వైరస్ నివారణకు అవసరమైన టీకాలు ఏయే దేశాల వద్ద ఎంత మొత్తంలో ఉన్నాయో పూర్తి సమాచారం లేదని తెలిపింది.

ప్రస్తుతం 20 దేశాల్లో మంకీపాక్స్ కేసులు బయటపడ్డాయి. పశ్చిమ ఆఫ్రికాలో తొలిసారిగా ఈ వైరస్ గుర్తించారు. తొమ్మిది ఆఫ్రికన్ దేశాల్లో మంకీపాక్స్ వ్యాప్తిని గుర్తించినట్లు డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించింది. వైరర్ వ్యాప్తిని గుర్తించి.. దాన్ని కట్టడి చేస్తే నివారణ కష్టమేం కాదని చెప్పింది. ముందుగానే అప్రమత్తమై.. సరైన జాగ్రత్తలు తీసుకుంటే మంకీపాక్స్ వ్యాప్తిని కట్టడి చేయొచ్చని అభిప్రాయపడింది. ప్రస్తుతానికి మంకీపాక్స్ సోకిన వారికి.. వారితో కాంటాక్ట్‌ అయిన వారికి సరిపడా టీకాలు అందుబాటులో ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

"కరోనా వ్యాప్తి చెందిన తొలినాళ్లలో అసలు ఆ వైరస్ గురించి ఎవరికీ తెలియదు. సడెన్‌గా ప్రపంచంలోకి అడుగుపెట్టి.. దాని మూలాలేంటో కనుగొనేలోపే చాప కింద నీరులా విజృంభించింది. ఎన్నో లక్షల మంది ప్రాణాలు పొట్టన పెట్టుకుంది. కానీ మంకీపాక్స్ అలా కాదు. స్మాల్‌పాక్స్ జాతికి చెందిన మంకీపాక్స్‌ వ్యాధి ఎప్పటినుంచో ఉంది. దీనికి చికిత్స కూడా ఎప్పటినుంచో అందుబాటులో ఉంది. ఈ వైరస్ సోకిన వారికి టీకా అందిస్తే రెండు నుంచి నాలుగు వారాల లోపు కోలుకుంటారు. ఈ వ్యాధి ప్రాణాంతకమేం కాదు. కానీ మొదట్లోనే గుర్తించి చికిత్స తీసుకుంటే త్వరగా నయమవుతుంది. ప్రస్తుతం మంకీపాక్స్ కేసులు పెరుగుతున్నందున దీనికి సరిపడా టీకాల తయారీపై దృష్టి పెట్టాం. అలాగే ఈ వైరస్ వ్యాప్తి కట్టడికి చర్యలు తీసుకుంటున్నాం." - డబ్ల్యూహెచ్‌ఓ

ఆఫ్రికా నుంచి యూరప్, అమెరికా, ఆస్ట్రేలియా వంటి అనేక దేశాలకు వ్యాపించిన మంకీపాక్స్ .. ఇంకా భారత్‌లో అడుగు పెట్టలేదు. మంకీపాక్స్ వ్యాప్తి చెందిన దేశాల నుంచి వచ్చిన వారి ఆరోగ్యం పై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నిఘా పెడుతోంది. ఇప్పటి వరకూ ఈ వైరస్‌కు సంబంధించిన భారత్‌లో అనుమానిత కేసులు నమోదు కాలేదు. కానీ త్వరలోనే భారత్‌లోనూ మంకీపాక్స్ అడుగుపెట్టే అవకాశముందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు భారత్‌లో పర్యాటక సీజన్ మొదలైనందున దీని వ్యాప్తి పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

అసలేంటీ ఈ మంకీపాక్స్... మంకీపాక్స్ అనేది ఓ వైరల్ వ్యాధి. ఇది స్మాల్‌పాక్స్ కుటుంబానికి చెందిందే. జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. ఎక్కువగా పశ్చిమ, మధ్య ఆఫ్రికా దేశాల్లో ఈ వైరస్ అధికంగా వ్యాపిస్తుంటుంది. తుంపర్లు లేదా వ్యాధి సోకిన వ్యక్తికి అతి దగ్గర ఉండటం వల్ల ఇతరులకు వ్యాపించే అవకాశముంటుందని వైద్యులు చెబుతున్నారు.

ఇది శరీరంలోకి వ్యాప్తి చెందడానికి 6 నుంచి 21 రోజుల సమయం పడుతుందని తెలిపారు. 1958లో మొదట ఈ వైరస్‌ను కోతుల్లో గుర్తించారు. అందుకే దీనికి మంకీపాక్స్ అనే పేరు వచ్చింది. 1970లో తొలిసారి మనుషుల్లో ఈ వైరస్ బయటపడింది. ఎలుకలు, చుంచు, ఉడతల నుంచి ఈ వ్యాధి అధికంగా వ్యాపిస్తున్నట్లు పరిశోధనల్లో తేలింది.