Begin typing your search above and press return to search.

కరోనా అంతంపై డబ్ల్యూహెచ్ఓ సెన్సేషనల్ కామెంట్స్..!

By:  Tupaki Desk   |   24 Jan 2022 2:30 PM GMT
కరోనా అంతంపై డబ్ల్యూహెచ్ఓ సెన్సేషనల్ కామెంట్స్..!
X
కరోనా మహమ్మారి ధాటికి ప్రపంచదేశాలు అల్లాడుతున్నాయి. 2019 డిసెంబర్ నుంచి కొవిడ్ విశ్వరూపం చూపిస్తోంది. మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తూ.. కరాళ నృత్యం చేస్తోంది. దశలవారీగా పంజా విసురుతూ ఎంతో మందిని పొట్టనబెట్టుకుంది. వివిధ దేశాల్లో వివిధ వేవ్ ల రూపంలో మహమ్మారి విరుచుకుపడుతోంది. దక్షిణాఫ్రికాలో పుట్టిన ఒమిక్రాన్ వేరియంట్ తో భారతదేశంలో మూడో దశ ప్రారంభమైంది. కాగా ఈ వేరియంట్ తో కరోనా మహమ్మారి ముగింపు దశకు చేరుకున్నట్లేనని ఇప్పటికే పలువురు వైద్య నిపుణులు అంచనా వేశారు. అయితే దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా స్పందించింది.

మహమ్మారి కరోనా త్వరలోనే ఎండెమిక్ గా మారుతుందని ఇప్పటిలే చాలామంది తమ వాదనలు వినిపిస్తున్నారు. అయితే దీనిపై తాజాగా డబ్ల్యూహెచ్ఓ స్పందించింది. ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం ఐరోపా దేశాల్లో అధికంగా ఉంది. వివిధ దేశాల్లో విధ్వంసం సృష్టిస్తోంది. అయితే ఇది ముగింపు దశకు సంకేతమని ప్రపంచ ఆరోగ్య సంస్థ యూరప్ డిపార్టుమెంట్ తెలిపింది. కొత్త వేరియంట్ వల్ల యూరప్ కొత్త దశకు చేరుకుందని... ఫలితంగా చాలామంది వైరస్ బారిన పడ్డారని పేర్కొంది. త్వరలోనే ఐరోపాలో కరోనా ముగింపు దశకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని యూరప్ విభాగం డైరెక్టర్ హాన్స్ క్లూగే వెల్లడించారు.

మార్చి నాటికి యూరప్ లో 60 శాతం మంది వైరస్ బారిన పడే అవకాశం ఉందని క్లూగే తెలిపారు. ఇది చివరి దశకు చేరుకుంటోందని అభిప్రాయపడ్డారు. వైరస్ సోకి... కోలుకున్న తర్వాత రోగ నిరోధక శక్తి ఉంటుందని చెప్పారు. ఫలితంగా వైరస్ ప్రభావం క్రమంగా తగ్గుతుందని... ఇలా మెల్లమెల్లగా కరోనా అంతమవుతుందని అంచనా వేశారు. ఈ ఏడాది చివరికి మళ్లీ విజృంభించి... అనంతరం పూర్తిగా క్షీణిస్తుందని అన్నారు. ఆ తర్వాత వ్యాప్తి చెందే సామర్థ్యాన్ని కోల్పోతుందని చెప్పారు. అయితే వైరస్ మహమ్మారి నుంచి ఫ్లూ దశకు చేరినప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఒమిక్రాన్ తర్వాత కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చిన కూడా వ్యాక్సిన్లు ఉన్నాయని యూరప్ కమిషనర్ ఫర్ ఇంటర్నల్ మార్కెట్స్ థియరీ బ్రెటన్ అన్నారు. వేరియంట్లపై ప్రభావం చూపేవిధంగా వ్యాక్సిన్లను అభివృద్ధి చేయవచ్చునని పేర్కొన్నారు. ఇప్పటికే ఉన్న టీకాల్లో పలు మార్పులు చేస్తూ.. కొత్త వేరియంట్లను ఎదుర్కోగలమని అభిప్రాయపడ్డారు.

అమెరికా శాస్త్రవేత్త ఆంథోనీ ఫౌచీ కూడా కరోనా ముగింపు దశకు చేరుకుందని అంటున్నారు. అమెరికాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని... వైరస్ తీవ్రత కూడా చాలా వరకు తగ్గిందని చెప్పారు. కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయని డబ్ల్యూహెచ్ఓ ఆఫ్రికా ప్రాంతీయ కార్యాలయం కూడా తెలిపింది. జనవరి రెండో వారం నుంచి వైరస్ క్షీణిస్తున్నట్లుగా గుర్తించామని వెల్లడించింది. ఇటీవల మరణాలు కూడా తగ్గుతున్నాయని పేర్కొంది. అయితే వివిధ దేశాల్లో పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అదేవిధంగా వైరస్ సామర్థ్యం కూడా తగ్గుతోంది. మరణాల రేటు చాలా వరకు తగ్గిందని దేశాల నివేదికలు చూస్తుంటే తెలుస్తోంది. అయితే త్వరలోనే కరోనా ముగింపు దశకు చేరుకుంటుందని డబ్ల్యూహెచ్ఓతో పాటు వైద్యారోగ్య నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.