వివేకా హత్య కేసు: అవినాశ్ రెడ్డి తర్వాతి నోటీసులు అతడికేనా?

Tue Jan 24 2023 12:00:01 GMT+0530 (India Standard Time)

Viveka murder case: Is Avinash Reddy the next notice for him?

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తాజాగా కడప వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేయటం తెలిసిందే. ఆయనకు నోటీసులు ఇవ్వటానికి ముందు అతడి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి గురించి అధికారులు ఆరా తీయటం ఆసక్తికరంగా మారింది.ఇప్పటికే వివేకా హత్య కేసుకు సంబంధించిన దర్యాప్తులోనూ భాస్కర్ రెడ్డి ప్రస్తావన పలు మార్లు రావటం.. ఆయనకు వివేకా హత్య కేసులో ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్నట్లుగా వాంగ్మూలాలు నమోదు కావటం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఎంపీ అవినాశ్ రెడ్డి తర్వాత సీబీఐ నోటీసులు ఇచ్చేది అతడి తండ్రి భాస్కర్ రెడ్డికేనని చెబుతున్నారు. అవినాశ్ కు నోటీసులు ఇవ్వటానికి ముందు కడప పులివెందుల వెళ్లిన సీబీఐ అధికారులు భాస్కర్ రెడ్డి ప్రస్తావన తేవటం.. అతడి కూడా ఆరాలు తీయటం తెలిసిందే. వైసీపీ ఆఫీసుకు వెళ్లిన సీబీఐ అధికారులు.. భాస్కర్ రెడ్డి ఎప్పుడు వస్తారంటూ అక్కడి సిబ్బందిని అడగ్గా.. తమకు తెలీదని వారు చెప్పినట్లుగా తెలుస్తోంది.

పార్టీ ఆఫీసుకు భాస్కర్ రెడ్డి రాలేదని.. ఆఫీసు సిబ్బంది అక్కడి నుంచి బయటకు వచ్చి.. స్థానికంగా పలు ప్రాంతాల్ని పరిశీలించినట్లుగా చెబుతున్నారు. తర్వాత ఇంటి వద్దకు వెళ్లి ఎప్పుడు వస్తారని అడగటం గమనార్హం.

తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల్ని చూస్తే.. వైఎస్ భాస్కర్ రెడ్డికి కూడా ఈ హత్య కేసులో నోటీసులు ఇవ్వటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. భాస్కర్ రెడ్డి మీద ఇప్పటికే నోటీసులు సిద్ధం చేశారని.. సరైన సమయం చూసుకొని అతడ్ని కూడా విచారణకు పిలుస్తారని చెబుతన్నారు.

వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి పాత్ర మీద సీబీఐకి బోలెడన్ని అనుమానాలు ఉన్నాయని.. అందుకే నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచి.. ఆ తర్వాత తదనంతర నిర్ణయాలు తీసుకుంటారని చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.