కేటీఆర్ వ్యాఖ్యలపై విశ్వబ్రాహ్మణుల గరం.. సారీ చెప్పాలంటూ వార్నింగ్

Sat Jul 02 2022 19:00:01 GMT+0530 (IST)

Vishwa Brahmins on KTR comments

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఠంగ్ స్లిప్ అయ్యారు. బీజేపీ నాయకుడిపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఓ సామాజికవర్గంలో అగ్గిని రాజేశాయి. తమకు చులకన చేసి మంత్రి మాట్లాడారంటూ మహబూబ్ నగర్ జిల్లాలో ఆందోళనకు దిగారు కుల సంఘాల నేతలు. దీనిపై జిల్లాలోని విశ్వబ్రాహ్మణ కులస్థులు ఆందోళన చేపట్టారు.మంత్రి కేటీఆర్ ‘చారి’ పేరుతో వివాదాస్పద వ్యాక్యలు చేశారని.. తమను కించపరిచే విదంగా మాట్లాడారని అదే సామాజికవర్గానికి చెందిన కొందరు మండిపడుతున్నారు. జిల్లాలో పలు చోట్ల కేటీఆర్ కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు.

నాగర్ కర్నూల్ కు చెందిన కాంగ్రెస్ కౌన్సిలర్లు గురువారం రాజీనామా చేసి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. కల్వకుర్తి నియోజకవర్గంలో మరో 2500 మంది ఇతర పార్టీల నాయకులు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.

ఈ చేరికల సమయంలోనే మంత్రి కేటీఆర్ కల్వకుర్తి నియోజకవర్గం బీజేపీ నాయకుడు ‘ఆచారి’ని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవి వివాదాస్పదమయ్యాయి. ఆచారిని ఉద్దేశిస్తూ ‘చారీ.. పంపుచారి’ అంటూ కామెంట్ చేశారు. అయితే విశ్వబ్రాహ్మణులపై చేసిన వ్యాఖ్యల వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.

ఆ వర్గం వారు సీరియస్ అయ్యి ఆందోళన చేపట్టారు. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిరసనకు దిగారు. ఎల్బీ నగర్ లోని శ్రీకాంతాచారి విగ్రహం వద్ద కేటీఆర్ దిష్టిబొమ్మను చెప్పులతో కొడుతూ దగ్ధం చేశారు. తమ మనోభావాలను కించపరిచారని కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలు వివాదం కావడంతో ఆయన వివరణ ఇచ్చారు.

గురువారం తాను చేసిన వ్యాఖ్యలపై కొందరు చేస్తున్న ప్రచారం అవాస్తవమని మంత్రి కేటీఆర్ ఖండించారు. విశ్వబ్రాహ్మణులను (చారీలను) నేను కించపరచలేదన్నారు. అంతేకాకుండా ఓ కులాన్ని లేదా ఒక వర్గాన్ని తక్కువ చేసి మాట్లాడే సంస్కారిని కాదని కేటీఆర్ వివరణ ఇచ్చారు. కేవలం ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఒక నాయకుడిని ఉద్దేశించిన వ్యాఖ్యలని.. ఎవరైనా బాధపడి ఉంటే ఆ మాటను ఉపసంహరించుకుంటున్నట్లుగా ప్రకటించారు. మంత్రి వివరణతో విశ్వబ్రాహ్మణుల ఆగ్రహం చల్లారినప్పటికీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతోంది.