Begin typing your search above and press return to search.

మృతదేహాలకూ వైరస్ పరీక్షలు చేయాల్సిందే..హైకోర్టు ఆదేశం!

By:  Tupaki Desk   |   27 May 2020 9:30 AM GMT
మృతదేహాలకూ వైరస్ పరీక్షలు చేయాల్సిందే..హైకోర్టు ఆదేశం!
X
రాష్ట్రంలో వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో మృతదేహాలకు కూడా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయాలని తెలంగాణ హైకోర్టు మంగళవారం (మే 26,2020) ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల కాలంలో ఎవరు ఏకారణంతో చనిపోయినా కరోనా వైరస్ సోకటం వల్లనే అనేలా తయారైంది పరిస్థితి. దీంతో వివిధ ఆస్పత్రుల్లో చనిపోయిన వారు ఏ కారణాలతో మృతి చెందారో తెలుసుకునేందుకు మృతదేహాలకు కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.

ఆస్పత్రుల్లో మృతి చెందిన మృతదేహాలను వారి వారి బంధువులకు అప్పగించే ముందు వాటికి వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయాలని ఆదేశించింది. వైరస్ పరీక్షలకు సంబంధించి దాఖలైన పలు పిటిషన్లపై చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ విజయ్‌సేన్‌ రెడ్డితో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. వైరస్ పరీక్షల కోసం మృతదేహాల నుంచి నమూనాలు సేకరించరాదని పేర్కొంటూ పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ డైరెక్టర్‌ జారీచేసిన ప్రొసీడింగ్స్‌ను హైకోర్టు పక్కన పెట్టింది.

అలాగే , మే 1 నుంచి 25 వరకు చేసిన వైరస్ పరీక్షలు, రాష్ట్రానికి వచ్చిన వలస కార్మికులకు చేసిన పరీక్షలు, ఎంతమందిని క్వారంటైన్‌ చేశారు? జోన్ల మార్పిడికి కారణాలు ఏమిటి? వంటి పలు అంశాలతో కూడి పూర్తి నివేదిక సమర్పించాలని సూచించింది. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశంలోనే లక్షకుపైగా మరణాలు సంభవించాయని, మన దేశంలో వైద్యరంగం ఇంకా అభివృద్ధి చెందలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు పరీక్షల సంఖ్యను పెంచాలని తెలిపింది. తదుపరి విచారణను జూన్‌ 4కు వాయిదా వేసింది.