ఆపరేషన్ చేస్తూ టిక్ టాక్ వీడియో..తెలంగాణలో సంచలనం

Sun Feb 23 2020 20:13:40 GMT+0530 (IST)

Viral Video: Doctors doing TikTok in operation theater

ఇటీవల కాలంలో  పాపులర్ అయిన సోషల్ మీడియా ప్లాట్ ఫాం టిక్ టాక్ ఎంత వినోదాన్ని అందిస్తుందో అంతేస్థాయలో వివాదాలనూ సృష్టిస్తోంది. విధులను పక్కన పెట్టి ఉద్యోగులు టిక్ టాక్ వీడియోలు చేసి ఇబ్బందులు కొనితెచ్చుకోవడం.. భర్తలు వద్దంటున్నా హాట్ హాట్ వీడియోలు చేసి కొందరు భార్యలు తమ కాపురాలు చేజేతులా కూల్చుకోవడం వంటివి ఇప్పటికే చూశాం. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో టిక్ టాక్ మరోసారి వివాదానికి దారితీసింది.తెలంగాణలోని ఓ వైద్యుడు ఆపరేషన్ చేస్తూ టిక్ టాక్ వీడియో చేయడం సంచలనంగా మారింది. ఆపరేషన్ థియేటర్ లో రోగికి శస్త్రచికిత్స చేస్తూ ఇతర సిబ్బందితో డాక్టర్ టిక్ టాక్ చేయడం కలకలం రేపింది. హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు శ్రీకాంత్ రోగికి ఆపరేషన్ చేస్తూ తన బృందంతో టిక్ టాక్ వీడియో చేశారంటూ వార్తలొచ్చాయి. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే... దీనిపై హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ ఎంఓ డాక్టర్ శ్రీకాంత్ వివరణ ఇచ్చారు. తాము టిక్ టాక్ వీడియో చేయలేదని వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న టిక్ టాక్ వీడియోతో తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆపరేషన్ చేయడానికి ముందు తీసిన వీడియోగా భావిస్తున్నామని చెప్పారు. ఆ వీడియోను ఎవరో టిక్ టాక్ లో పెట్టారని చెబుతున్నారు.