చిరంజీవిని ఆదర్శంగా తీసుకున్న విజయ్ కాంత్

Tue Jul 12 2016 15:48:25 GMT+0530 (IST)

Vijaykanth Follows Chiranjeevi

 సమయానుకూల వ్యూహాలు రచించలేకపోవడం.. అనవసరపు దూకుడు - మొండి పట్టుదలల కారణంగా రాజకీయంగా చితికిపోయిన డీఎండీంకే అధినేత - తమిళ హీరో విజయకాంత్ సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.  మొన్నటి ఎన్నికల్లో దారుణమైన ఓటమి ఎదుర్కొన్న అనంతరం ఆయనకు రోజురోజుకూ పార్టీపై పట్టు పోతోంది. నాయకులెవరూ ఆయన మాట వినే పరిస్థితిలో లేరు. మొన్నటి ఎన్నికల్లో పార్టీ నేతలు - శ్రేణులు మాట వినకుండా మొండితనంతో జయకు వ్యతిరేకంగా ఒంటరిగా పోటీ చేసి పొలిటికల్ గా దెబ్బతిన్న ఆయన జయకు రెండోసారి విజయం దక్కడానికి కూడా కారణమయ్యారు. ఎన్నికల తరువాత రోజురోజుకీ ఆ పార్టీ కుంగి కృశించిపోతోంది. దీంతో విజయ్ కాంత్ త్వరలో పార్టీని రద్దు చేస్తారని తెలుస్తోంది.వచ్చే నెలలో పుట్టిన రోజు జరుపుకోనున్న విజయ్ కాంత్ అదే రోజు తన పార్టీని రద్దు చేయనున్నట్టుగా తెలుస్తోంది. పార్టీని రద్దు చేయడమే కాదు రాజకీయాల నుంచి కూడా వైదొలగే అవకాశం ఉందని తమిళనాట పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మొన్నటి ఎన్నికల్లో దారుణ ఓటమిని ఎదుర్కోవడం తను కూడా ఎమ్మెల్యేగా గెలవడం మాట అటుంచి కనీసం రెండో స్థానాన్ని కూడా సంపాదింలచేకపోవడం.. విజయ్ కాంత్ ను ఇబ్బంది పెట్టే అంశాలుగా మారాయి. ఈ నేపథ్యంలో పార్టీని రద్దు చేయాలని విజయ్ కాంత్ ఇప్పటికే డిసైడయ్యాడని అంటున్నారు.

విజయ్ కాంత్ తీరును వ్యతిరేకిస్తూ ఎన్నికల ముందే కొంతమంది మరో ప్రతిపక్ష పార్టీ డీఎంకేలోకి వెళ్లిపోయారు.  మిగిలిన వారు ఎన్నికల తరువాత డీఎంకే వైపు చూస్తున్నారు. డీఎండీకే లో కొనసాగేందుకు ఆసక్తి చూపడం లేదు. అంతేకాదు.. కెప్టెన్ పుట్టిన రోజు ఏర్పాట్లు కూడా మొక్కుబడిగా చేస్తున్నారట.  పార్టీలో ఇంకా మిగిలిన వారు తనపై తిరుగుబాటు చేసి డీఎంకేలో చేరిపోవడానికి ముందే పార్టీని రద్దు చేయాలనుకుంటున్నారట విజయ్ కాంత్.  

తెలుగునాట ఎందరికో ఆశలు కల్పించి.. రాజకీయంగా ప్లాట్ ఫాం ఇచ్చిన చిరంజీవి కూడా ఆ తరువాత తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో కలిపేశారు. అది చిరంజీవికి బాగానే లాభించింది. అయితే.. విజయ్ కాంత్ మాత్రం పార్టీని విలీనం కాకుండా రద్దు చేయనున్నారని తెలుస్తోంది. మొత్తానికి ఏం చేసినా కూడా వందలాది మంది నేతలను మధ్య దారిలో వదిలేస్తున్న ఈ హీరో గారిని తమిళ చిరంజీవి అనాలేమో.