Begin typing your search above and press return to search.

కేంద్రం ముందు కీలక డిమాండ్ ఉంచిన వైసీపీ ఎంపీ..

By:  Tupaki Desk   |   13 Sep 2021 9:14 AM GMT
కేంద్రం ముందు కీలక డిమాండ్ ఉంచిన వైసీపీ ఎంపీ..
X
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇటీవల కేంద్రం ముందు ప్రధాన డిమాండ్ ను ఉంచారు. ఎప్పటినుంచో ఏపీకి కావాల్సిన ప్రత్యేక హోదా గురించి ఆయన కేంద్రానికి సమర్పించిన ఓ నివేదికలో ప్రస్తావించారు. పదేళ్లపాటు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని అందులో పేర్కొన్నారు. పన్నుల శాఖ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ గా ఉన్న విజయసాయిరెడ్డి ఏపీకి కావాల్సిన పలు డిమాండ్లను ఓ రిపోర్టులో పేర్కొంటూ దానిని కేంద్రానికి అందించారు. అయితే ఎప్పటి నుంచో ఈ డిమాండ్ ఉన్నా బీజేపీ పట్టించుకోలేదు. దీంతో బీజేపీకి మద్దతుగా ఉంటున్న వైసీపీ ఒక్కసారిగా ఇలాంటి ప్రతిపాదన పెట్టేసరికి కేంద్ర పెద్దలు అయోమయానికి గురవుతున్నారు.

ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ కొన్ని వనరులను తెలంగాణకే అప్పగించింది. మిగులు నిధులు ఏమాత్రం లేని ఏపీకి పదేళ్లపాటు హైదరాబాదే రాజధాని అని విభజనచట్టంలో పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయిన తరువాత వచ్చిన ఎన్నికల్లో 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో కొన్ని సంవత్సరాల తరువాత అమరావతి రాజధానిని ప్రకటించుకొని నిర్మాణాలు ప్రారంభించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఉన్న సాన్నిహిత్యంతో విభజన చట్టంపై చంద్రబాబు పెద్దగా పట్టించుకోలేదు.

ఈనేపథ్యంలో ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఏపీకి ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేసింది. ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయిన తరువాత ఏపీకీ అన్యాయం జరిగిందని, ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. అయితే అధికారంలో ఉన్న టీడీపీ సైతం ప్రజల డిమాండ్ కు అంగీకరించి కేంద్రాన్ని సంప్రదించింది. అయితే ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీని ఇస్తామని చెప్పి కొన్ని నిధులను కూడా మంజూరు చేసింది. దీంతో కొన్ని రోజుల పాటు ప్రత్యేక హోదా విషయం బయటికి రాలేదు.

2019లో ప్రత్యేక హోదా విషయంతోనే వైసీపీ ఎలక్షన్ బరిలోకి దిగింది. తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలన్న కాంక్షతో ఏపీ ప్రజలు వైసీపీకి పట్టం కట్టారు. అయితే అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రత్యేక హోదా గురించి పట్టించుకోలేదు. పైగా కేంద్రంలోని బీజేపీకి పరోక్ష మద్దతుగా ఉండడం వల్ల ప్రత్యేక హోదా గురించి గట్టిగా మాట్లాడలేకపోయిది. దీంతో ప్రతిపక్షాలతో పాటు ప్రజల నుంచి తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి.

ఈనేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా కేంద్రానికి సమర్పించిన నివేదికలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఏపీ విడిపోయినప్పుడు రాజధాని లేదని, ఏమాత్రం మిగులు నిధులు లేకపోవడంతో రాష్ట్రం అభివృద్ధిలో కూరుకుపోయిందన్నారు. ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని అన్నారు. అంతేకాకుండా పదేళ్లపాటు ప్రత్యేక హోదా కల్పించి అందుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని అన్నారు. ఏపీకే కాకుండా ప్రత్యేక హోదా అవసరమున్న ఝార్ఘండ్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలకు కూడా ప్రత్యేక హోదా కల్పించాలని కోరారు.

ఇక ఏపీకి రైల్వేజోన్ అని ప్రకటించి ఆ తరువాత దాని గురించి మరిచిపోయారన్నారు. ఇప్పటికైనా రైల్వే జోన్ గురించి ఆలోచించాలని కోరారు. పైకి ప్రకటించామని చెబుతూనే ఇక్కడ అభివృద్ధి గురించి ఏమాత్రం పట్టించుకోలేదని నివేదికలో పేర్కొన్నారు. అయితే విజయసాయిరెడ్డి పార్లమెంటరీ కమిటీ నివేదిక కేంద్రం కనుసన్నల్లోనే ఉంటుంది. అయితే తనకున్న హోదాను అవకాశంగా చేసుకున్న విజయసాయిరెడ్డి రాష్ట్రానికి కావాల్సిన డిమాండ్లను కోరడంలో వైసీపీ శ్రేణుల్లో కొంత హర్షం వ్యక్తమవుతోంది. మరోవైపు విజయసాయిరెడ్డి చేసిన ప్రతిపాదనకు రాష్ట్రం నుంచి ప్రశంసలు అందుతున్నాయి. అయితే విజయసాయిరెడ్డి నివేదికకు కేంద్రం ఏవిధంగా స్పందిస్తుందో చూడాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు.