Begin typing your search above and press return to search.

ఎవరీ చిరంజీవి....సైకిల్ జోరుగా తొక్కేశారే...!

By:  Tupaki Desk   |   17 March 2023 6:13 PM GMT
ఎవరీ చిరంజీవి....సైకిల్ జోరుగా తొక్కేశారే...!
X
ఆయన పేరు ఉత్తరాంధ్రాలో పెద్దగా ఎవరికీ రాజకీయంగా తెలియదు. ఆయన ఎంచుకున్న రంగమే వేరు. ఉపాధ్యాయుడిగా ఆయన అడుగుపెట్టి అనంతర కాలంలో పోటీ పరీక్షలలో విద్యార్ధులకు శిక్షణ ఇచ్చే మాస్టారుగా ఎదిగారు. ఈ మాస్టారుకు రాజకీయ వాసనలు లేవు. ఆయన ఈ ఏడాది జనవరి 31 వరకూ కూడా తెలుగుదేశంతో ఎలాంటి సంబంధం కూడా లేదు. కానీ సడెన్ గా ఆయన టీడీపీ ఉత్తరాంధ్రా పట్టభద్రుల సీటు ఎమ్మెల్సీ అయిపోయారు.

ఆయనే వేపాడ చిరంజీవిరావు. ఆయన కొత్త ఎమ్మెల్సీగా ఆరేళ్ల పాటు పెద్దలసభలో అత్యున్నత హోదాను అనుభవించనున్నారు. ఆయన కేవలం నలభై రోజులు మాత్రమే ప్రచారం చేశారు. అధికార వైసీపీకి ఓడిస్తూ మరీ విజయ దుందుభి మోగించారు. నాలుగేళ్ళుగా సక్సెస్ లేక నలిగిపోతున్న టీడీపీకి ఉత్తరాంధ్రాలో కొత్త ఊపిరి పోశారు.

నిజంగా ఉత్తరాంధ్రా జిల్లాలు తెలుగుదేశానికి కంచుకోటలు. అలాంటి చోట 2019 నుంచి ఎంత ప్రయత్నం చేసినా కలసిరావడంలేదు. పోనీ నేతలు లేరా అంటే అందరూ ఉద్ధండులే ఉన్నారు. ఆ మూల నుంచి ఈ మూల దాకా మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు సీనియర్ నేతల జాబితా తీస్తే కొండవీటి చాంతాడు అంత అవుతుంది.

అంగబలం, అర్ధబలం ఉంది. అన్నీ ఉన్నా కూడా తెలుగుదేశం లోకల్ బాడీస్ కి జరిగిన ఎన్నికల్లో ఓడిపోయింది. విశాఖలో నాలుగు ఎమ్మెల్యేలను గెలుచుకున్న టీడీపీని పక్కన పెట్టి మరీ మేయర్ సీటుని వైసీపీ గెలుచుకుంది. అలాంటిది ఇక తమకు గెలుపు పిలుపు అందనంత ఎత్తున ఉంది అని తమ్ముళ్ళు అంతా నిరాశ నీడలో జారుకుంటున్న నేపధ్యంలో అద్భుతమైన విజయం చిరంజీవిరావు రూపంలో లభించింది.

ఆయనకు విద్యావేత్తగా సొంతంగా బలం ఉంది. అలాగే యూత్ తో కనెక్టివిటీ ఉంది. మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన ఎంతో మందికి మూడు జిల్లాల్లో తర్ఫీదు ఇచ్చి పోటీ పరీక్షల్లో నెగ్గేలా చూశారు. ఆయన ఎపుడూ టచ్ లో ఉండేదే నిరుగ్యోగులతో. అలాంటి ఆయననే ఎమ్మెల్సీ చేయాలన్న ఆలోచన రావడమే టీడీపీ హిట్ అవడానికి మొదటి మెట్టు అంటున్నారు

అలా తన బలం ప్లస్ టీడీపీ బలం, ఆ పార్టీ పట్టుదల అన్నీ కలసి ప్రభుత్వ వ్యతిరేక పవనాలను తన విజయ సోపానాలుగా మార్చుకున్నారు చిరంజీవరావు. ఆయన ఇపుడు ఉత్తరాంధ్రా టీడీపీలో బిగ్ షాట్ అయిపోయారు. ఉత్తరాంధ్రాలో సైకిల్ ని జోరుగా పరుగు తీయించి కొత్త ఊపిరులు పోసిన ఆయనను అధినాయకత్వం మనసారా అభినందిస్తోంది. ఆయనకు పెద్ద పీట వేయడానికి సిద్ధమవుతోంది.

స్వతహాగా మంచి వక్త అయిన చిరంజీవరావు రానున్న రోజులలో తన ప్రతిభతో పాటు తన సామాజికవర్గం నేపధ్యం దృష్ట్యా ఉత్తరాంధ్రా ప్రాధ్యాన్యత దృష్ట్యా టీడీపీలో కీలకమైన భూమికను ఉత్తరాంధ్రాలో పోషించడం ఖాయమని అంటున్నారు. చిరంజీవిరావు టీడీపీకి అండగా ఉంటే టీడీపీ కూడా ఆయనకు అండగా ఉండబోతోంది. రానున్న రోజులో అంటే వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో యూత్ ఓట్లను పార్టీ వైపుగా మళ్ళించే అతి పెద్ద బాధ్యతను కూడా ఆయన మీద పెట్టబోతున్నారు అని అంటున్నారు.

ఇక్కడ ఒక్క మాట చెప్పుకోవాలి. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధి ఆరు నెలల క్రితం ప్రకటించబడ్డారు. టీడీపీ కూడా ఆ తరువాత తమ అభ్యర్ధిగా బీసీ మహిళా కార్పోరేటర్ పేరుని ప్రకటించింది. పీడీఎఫ్ అభ్యర్ధి చాన్నాళ్ల క్రితమే డిసైడ్ అయ్యారు. బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ ఎటూ క్యాండిడేట్ గా ఉన్నారు. ఎటూ తెర వెనక ఉన్నది తనకు కూడా ఎమ్మెల్సీ అభ్యర్ధిని అవుతాను అని తెలియని వ్యక్తి ఈ చిరంజీవిరావు. ఆయన చివరాఖరున వచ్చారు. జస్ట్ నలభై రోజుల్లో ఒక ప్రణాళికబద్ధంగా ప్రచారం చేశారు. పోటీ పరీక్షల్లో విద్యార్ధులను నెగ్గించినట్లే తానూ ఎమ్మెల్సీ పరీక్ష నెగ్గేసి పెద్దల సభలో కూర్చోబోతున్నారు. ఇక్కడ ఆయన అదృష్టంతో పాటు టాలెంట్ కూడా అందరూ చెప్పుకుంటున్నారు. దటీజ్ చిరంజీవిరావు అని కూడా అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.