Begin typing your search above and press return to search.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐటీ సోదాల కలకలం

By:  Tupaki Desk   |   31 Jan 2023 12:58 PM GMT
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐటీ సోదాల కలకలం
X
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆదాయ పన్ను శాఖ (ఐటీ) సోదాలు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్‌ తోపాటు ఆంధ్రప్రదేశ్‌ లోని గుంటూరు, నరసాపురం, వైజాగ్, రాజమండ్రిలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ల్లో ఉన్న వసుధ ఫార్మా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కార్యాలయాల్లో ఐటీ అధికారులు విస్తృత స్థాయిలో సోదాలు జరుపుతున్నారు. ఫార్మా కంపెనీకి చెందిన కార్పొరేట్‌ కార్యాలయాలు, చైర్మన్‌ ఇళ్లు, డైరెక్టర్ల ఇళ్ళల్లో అధికారులు సోదాలకు దిగారు.

హైదరాబాద్‌ వెంగళరావు నగర్‌ లో రెండు బృందాలు, మాదాపూర్‌ లోని మరో కార్పొరేట్‌ కార్యాలయంలో నాలుగు బృందాలు సోదాలు చేస్తున్నాయి. హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్‌నగర్‌లోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో ఐటీ బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. అలాగే మాదాపూర్, జీడిమెట్ల తదితర ప్రాంతాల్లోని వసుధ, సోదరి సంస్థల ఆవరణలో కూడా సోదాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా వసుధ ఫార్మా కంపెనీ ఆదాయం, ఇతరులతో జరిపిన లావాదేవీలకు సంబంధించిన రికార్డులను అధికారులు తనిఖీ చేశారు. ఈ నిధులను రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి మళ్లిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలోనే ఈ దాడులు చేసినట్టు తెలుస్తోంది.

వసుధకు సంబంధించిన కొన్ని సంస్థలు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో నిమగ్నమై ఉన్నట్లు చెబుతున్నారు. ఇటీవల ఐటీ అధికారులు కొన్ని రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలపై జరిపిన దాడుల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని తెలుస్తోంది. ఐటీ సోదాల్లో భాగంగా వసుధ చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎం. వెంకట రామరాజు, డైరెక్టర్లు ఎం. ఆనంద్, ఎంవీఎన్‌ మధుసుగన్‌ రాజు, ప్రసాద్‌రాజుల ఇళ్లలో సోదాలు జరిగాయి.

ఫార్మా కంపెనీ నుండి వచ్చిన లాభాలను వెంకట రామరాజు రియల్‌ ఎస్టేట్‌ లో పెట్టుబడులు పెట్టారని సమాచారం. గతంలో పలు రియల్‌ ఎస్టేట్‌ కార్యాలయాలపై జరిపిన దాడుల్లో పలు పెట్టుబడులకు సంబంధించిన ఆధారాలు అధికారులకు లభించాయి. వాటి ఆధారంగానే ఈ సోదాలకు దిగినట్టు చెబుతున్నారు.

వసుధ ఫార్మా కెమ్‌ లిమిటెడ్‌ లో ఎంవీ రామరాజు ఛైర్మన్‌ గా వున్నారు. రామ రాజు 1995లో సాధారణ స్థాయి నుంచి ఎదిగారని తెలుస్తోంది. అద్దె ఇంటి నుంచి ప్రస్థానం మొదలు పెట్టిన ఆయన అంచెలంచెలుగా ఫార్మా కంపెనీని నెలకొల్పే స్థాయికి ఎదిగారు. వసుధ ఫార్మా టర్నోవర్‌ రూ.500 నుంచి 1000 కోట్లకు చేర్చారు. ఈ నేపథ్యంలో తాజాగా ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.