తెలంగాణ కాంగ్రెస్ పతనావస్థకు అదే కారణమట!

Thu Jun 20 2019 07:00:01 GMT+0530 (IST)

Vasthu Problems is Reason For Telangana Congress Party Facing Problems

ఒకవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ వాస్తు లెక్కలను కాంగ్రెస్ వాళ్లు తప్పు పడుతూ ఉంటారు. కేసీఆర్ కు వాస్తు మీద ఉన్న నమ్మకం వల్లనే ఆయన సెక్రటేరియట్ కు కూడా సరిగా రారు.. అనే ప్రచారం ఒకటి ఉండనే ఉంది. ఉమ్మడి ఏపీ నాటి సెక్రటేరియట్ విషయంలో కేసీఆర్ కు నమ్మకం లేదని - దాని వాస్తు సరిగా లేకపోవడంతోనే అప్పటి ముఖ్యమంత్రులు ఎదురుదెబ్బలు తిన్నారనే నమ్మకంతో కేసీఆర్ సెక్రటేరియట్ వైపు చూడటం లేదనే విశ్లేషణలు  ఉండనే ఉన్నాయి.అయితే సెక్రటేరియట్ వైపు రాకపోయినా వరసగా రెండో సారి కేసీఆర్ సీఎంగా ఎన్నుకున్నారు తెలంగాణ ప్రజలు. అలాంటప్పుడు సెక్రటేరియట్ కు వస్తే ఏమిటి - రాకపోతే ఏమిటనే వాదన కేసీఆర్ అభిమానులు వినిపిస్తూ ఉంటారు.

ఇక కేసీఆర్ వాస్తు లెక్కల సంగతలా ఉంటే.. ఇప్పుడు టీ కాంగ్రెస్ కు కూడా అదే భయమే పట్టుకుందట. గాంధీ భవన్ వాస్తు  సరిగా లేకపోవడం వల్లనే తాము రాజకీయంగా ఎదుగలేకపోతున్నట్టుగా భావిస్తున్నారట తెలంగాణ కాంగ్రెస్ నేతలు. గాంధీభవన్ కు గతంలో వాస్తు బాగానే ఉండేదని - అయితే వైఎస్ మరణించాకా - కిరణ్ సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్ర విభజనకు పూర్వం పీసీసీ చీఫ్  గా బొత్స సత్యనారాయణ ఉన్నప్పుడు గాంధీభవన్ ఆవరణలో కొత్త భవనం కట్టడం వాస్తు దోషంగా  మారిందని టీ కాంగ్రెస్ నేతలకు వాస్తు పండితులు చెప్పారట. గతంలో వైఎస్ పీసీసీ చీఫ్ గా ఉన్నప్పుడు ఆయన గాంధీభవన్ లో కొన్ని వాస్తు దోషాలను సరి చేయించారట. దీంతో రెండు వేల నాలుగు - రెండు వేల తొమ్మిది సంవత్సరాల్లో వరసగా  కాంగ్రెస్ అధికారం దక్కిందట. ఆ తర్వాత సత్తిబాబు పీసీసీ చీఫ్ గా ఉన్నప్పుడు ఆ ఆవరణలోనే ఇందిరా భవన్ ను నిర్మించారు. అది వాస్తు దోషానికి కారణం అవుతోందని పండితులు చెబుతున్నారని సమాచారం.

అది ఏపీ కాంగ్రెస్ కు కేటాయించారు. ఈ నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ ఇందిరాభవన్ ను ఖాళీ చేసి టీ కాంగ్రెస్ కు అప్పగిస్తే అందులోని వాస్తు దోషాలను సరి చేసుకోవడానికి వీలుంటుందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు అంటున్నారట. మరి తెలంగాణలో కాంగ్రెస్ బాగు కోరి ఏపీ కాంగ్రెస్ నేతలు దాన్ని వదులుకోవడానికి సమ్మతిస్తారా?