జూనియర్ ఎన్టీఆర్‌పై వర్ల రామయ్య ఘాటు వ్యాఖ్యలు..!

Thu Nov 25 2021 17:00:01 GMT+0530 (IST)

Varla Ramaiah harsh comments on Junior NTR

టాలీవుడ్ యంగ్‌టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పై తెలుగు దేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఆ పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వైసీపీ సభ్యులు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ వర్ల రామయ్య ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టారు.తన భార్యతో కలిసి 12 గంటల పాటు తాను ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నానని ఆయన చెప్పరు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తన సొంత మేనత్త అయిన భువనేశ్వరిపై వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలకు ఎన్టీఆర్ స్పందించిన తీరు ఏ మాత్రం సరిగా లేదని చెప్పారు.

భువనేశ్వరి మేనల్లుడిగా ఎన్టీఆర్ విఫమయ్యారని వర్ల ఎద్దేవా చేశారు. మేనత్తను వైసీపీ వాళ్లు అన్నేసి మాటలు అంటుంటే ఎన్టీఆర్ సరిగా స్పందించలేదన్న విషయాన్ని ఆయన వీడియో చూసిన ప్రజలే అనుకుంటున్నారని వర్ల విమర్శించారు.

తన సినిమాల విషయంలో ఇబ్బంది ఎదురవుతుందని ఎన్టీఆర్ సరిగా స్పందించలేదేమో ? అన్న సందేహం వ్యక్తం చేసిన వర్ల .. నీకు కుటుంబం కన్నా సినిమాలు ఎక్కువా ? అని విమర్శించారు.

వల్లభనేని వంశీ కొడాలి నాని ఇద్దరూ కూడా నీతో సినిమాలు చేసిన నిర్మాతలు అయి ఉండవచ్చు.. వాళ్లు నీకు సన్నిహితులే ఒరేయ్ నాని నా మేనత్తను అనే దమ్ము ఉందా ? ఒరేయ్ వంశీ నోరు అదుపులో పెట్టుకో అని నవ్వు వాళ్ల గుండెల్లో వణుకు పుట్టేలా వార్నింగ్ ఎందుకు ఇవ్వలేదని వర్ల ప్రశ్నించారు.

ఇక బుద్ధా వెంకన్న సైతం ఎన్టీఆర్ సింహాద్రి లాగా ఆదిలాగా స్పందిస్తారు అనుకుంటే చాగంటి కోటేశ్వరరావులా ప్రవచనాలు చెప్పారని ఎద్దేవా చేశారు.

మరోవైపు కొడాలి నాని సైతం ఈ రోజు చంద్రబాబుకు మళ్లీ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డ ఆయన జూనియర్ ఎన్టీఆర్ చెపితే వంశీ తాను ఎందుకు వింటామని ప్రశ్నించారు.

చంద్రబాబు తనంతట తానే తన భార్యను అల్లరి చేసుకుంటుంటే.. తాము ఎందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక నందమూరి కుటుంబం అంటే తమకు ముఖ్యమంత్రికి ఎంతో గౌరవం ఉందని.. అయితే వాళ్లంతా గొర్రె కసాయి వాడిని నమ్మినట్టు చంద్రబాబునే నమ్ముతున్నారని నాని మండిపడ్డారు.