Begin typing your search above and press return to search.

జ్ఞానవాపి మసీదు సర్వేకు అనుమతించిన వారణాసి కోర్ట్

By:  Tupaki Desk   |   12 May 2022 12:30 PM GMT
జ్ఞానవాపి మసీదు  సర్వేకు అనుమతించిన వారణాసి కోర్ట్
X
దేశంలో ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లోని వారణాసి ‘జ్ఞానవాపి మసీదు’ వివాదం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈరోజు జ్ఞానవాపి మసీదు వివాదంపై వారణాసి హైకోర్టులో విచారణ జరిగింది. జ్ఞానవాపి మసీదు సర్వేపై కోర్టు విచారణ చేపట్టింది. సర్వే చేయాలని కోర్టు కమిషనర్ అజయ్ మిశ్రాతోపాటు మరో ఇద్దరు న్యాయవాదులను కమిషనర్లుగా కోర్టు నియమించింది. మే 17లోగా నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.

ఈ వివాదంపై ఇటు హిందువులు, అటు ముస్లింల తరుఫున న్యాయవాదులు వారి వాదనలు వినిపించారు. కోర్టు కమిషనర్ ను తొలగించేందుకు నిరాకరించింది. జ్ఞానవాపి మసీదు లోపలి భాగాలను కూడా సర్వే చేయవచ్చా? అనే పిటీషన్ ను విచారించిన కోర్టు మసీదులోని నేలమాళిగలతోపాటు మొత్తం ప్రాంతాన్ని సర్వేచేసి వీడియో చిత్రీకరించాలని తీర్పు చెప్పింది.

శుక్రవారం కోర్టు నియమించిన కమిటీ మసీదు ప్రాంగణాల్లో సర్వే, వీడియోను తీయకుండా మసీదు అడ్మినిస్ట్రేషన్ కమిటీ సర్వే టీంను లోపలికి రాకుండా అడ్డుకుంది. నిరసనలు తెలియజేసింది. దీంతో ఈ వివాదం హిందూ, ముస్లింల మధ్య చిచ్చు రాజేసేలా తయారైంది.

-అసలు వారణాసి జ్ఞానవాపి మసీదు వివాదం ఏంటి?
మొగల్ చక్రవర్తుల కాలంలో ఔరంగజేబు పాలనలో జ్ఞానవాపి శివాలయాన్ని కూల్చేసి అక్కడ మసీదును నిర్మించారనే ఆరోపణలున్నాయి. అయితే ఇందుకు అనుగుణంగానే మసీదు వెనుకాల దేవాలయానికి సంబంధించిన స్తంభాలు ఉండడంతో హిందువుల దేవాలయాన్ని కూల్చేసి మసీదు నిర్మించారని ఆరోపిస్తున్నారు. కొన్ని హిందూ సంస్థలు మసీదును హిందువులకు అప్పగించాలని కోరుతున్నారు.

అంతకుముందు ఢిల్లీకి చెందిన ఐదుగురు మహిళలు జ్ఞానవాపి మసీదు వెలుపల గోడపై హిందూ దేవతల విగ్రహాలున్నాయని.. తమకు పూజ చేసుకునే అవకాశం ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీంతో ఈ వివాదం పతాకస్థాయికి చేరింది. కోర్టు కలుగజేసుకొని దీనిపై వీడియోగ్రఫీ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేవించింది. దీంట్లో భాగంగానే సర్వేను కొనసాగించాలని వారణాసి కోర్టు తీర్పునిచ్చింది. ఈ సర్వే ప్రకారం ఇది హిందువులకు చెందుతుందా? మసీదుగానే పరిగణిస్తారా? అన్నది వేచిచూడాలి.